Digital Education: సర్కారు బడుల్లో డిజిటల్ విద్య
సాక్షి, నరసరావుపేట: ఒకప్పుడు కార్పొరేట్ పాఠశాలలకే పరిమితమైన డిజిటల్ విద్య ఇప్పుడు మన ఊరిలోని సర్కారు బడిలో పేదింటి పిల్లలకూ అందుబాటులోకి వచ్చింది. పాఠశాల స్థాయి నుంచే అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్యను ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. మన బడి నాడు–నేడు ద్వారా ఇప్పటికే పాఠశాలల రూపురేఖలను మార్చిన ప్రభుత్వం బోధనా తీరునూ సమూలంగా మార్చింది. స్మార్ట్ తెరల ద్వారా పాఠ్యాంశాల బోధనకు శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా మనబడి నాడు – నేడు తొలి విడతలో అభివృద్ధి చేసిన 446 పాఠశాలల్లో 1,428 ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్స్ స్క్రీన్లు, 485 స్మార్ట్ టీవీలు సమకూర్చింది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 60 మంది విద్యార్థులకు 65 అంగుళాల సైజ్‌గ ల ఒక స్మార్ట్ టీవీ, 6 నుంచి 10 తరగతులకు సెక్షన్‌కు ఒకటి చొప్పున ఐఎఫ్‌పీ స్క్రీన్ ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలల్లో ఏపీ ఫైబర్ నెట్ 4జీ ఇంటర్నెట్ సర్వీస్ కేబుల్ సౌకర్యం కల్పించింది. ప్రస్తు తం స్మార్ట్ బోధన దిగ్విజయంగా సాగుతోంది.
చదవండి: Counselling: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో నాల్గో విడత కౌన్సెలింగ్.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
ఐఎఫ్‌పీ ప్రయోజనాలు ఇవీ..
ఐఎఫ్‌పీని బ్లాక్ బోర్డు, వైట్ బోర్డులా కూడా వాడుకోవచ్చు. ఈ బోర్డుపై రాసిన నోట్స్‌ను సేవ్ చేయవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా దీనిని కంప్యూటర్ మాదిరిగా వినియోగించుకునే వీలూ ఉంటుంది. అలాగే ఫోన్ లేదా ట్యాబ్‌లో ఉన్న మెటీరియల్‌నూ స్క్రీన్‌పై చూపించే అవకాశముంటుంది. ప్రస్తుతం జరుగుతున్న ఫార్మేటివ్ అసెస్‌మెంట్–2 పరీక్షల ప్రశ్నపత్రాలు ఆన్‌లైన్ ద్వారా స్క్రీన్లపై ప్రదర్శించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
మరో నెలలో రెండో విడత స్క్రీన్ల అమరిక
రెండో విడత మనబడి నాడు–నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లోనూ స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో 707 ప్రభుత్వ పాఠశాలల్లో 1,444 ఐఎఫ్‌పీ స్క్రీన్లు, 779 స్మార్టు టీవీలు ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం విద్యుదీకరణ, ఎర్తింగ్, ఆండ్రాయిడ్ బాక్స్, ల్యాండ్ కేబుల్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరో నెలరోజుల్లో స్మార్ట్ తెరలు తరగతి గదిలో అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీలు ఎలా ఉపయోగించాలనే విషయమై ఉపాధ్యాయులకు అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ స్మార్ట్ తెరలకు అండ్రాయిడ్ బాక్స్‌ల ద్వారా బైజూస్ కంటెంట్ ఆఫ్‌లైన్‌లో బోధించే అవకాశం కూడా ఉంది.
పఠనాసక్తి పెరుగుతుంది
సర్కారు బడుల్లో డిజిటల్ విప్లవం పరుగులు పెడుతోంది. ఇప్పటికే తొలి విడతలో ఏర్పాటుచేసిన అన్ని స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీల ద్వారా పాఠ్యాంశాల బోధన విజయవంతంగా సాగుతోంది. దీనివల్ల విద్యార్థుల్లో పఠనాసక్తి పెరుగుతోంది.
– ఎన్.పూర్ణ చంద్రరావు, బైజూస్ జిల్లా కో–ఆర్డినేటర్
చదవండి: Intermediate Admissions: అనూహ్యంగా పెరిగిన ఇంటర్ అడ్మిషన్లు
పాఠాలు బాగా అర్థమవుతున్నాయి
స్మార్ట్ టీవీల ద్వారా బోధించడం వల్ల పాఠాలు బాగా అర్థమవుతున్నాయి. గతంలో బోర్డుపై రాసి తుడిపేయడం వల్ల మళ్లీ టీచర్‌ని అడగాలంటే ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మళ్లీ అడిగినా టీచర్లు సులభంగా స్క్రీన్‌పై చూపించి చెబుతున్నారు.
– మేళం నాగలక్ష్మి, 6వ తరగతి, వెంకటాయపాలెం
బోధన సులభతరం
డిజిటల్ బోధన వల్ల ఉపాధ్యాయుల పని సులువైంది. స్క్రీన్‌పై చూపించి చెప్పడం వల్ల విద్యార్థులు వెంటనే అర్థం చేసుకుంటున్నారు. ఇది గొప్ప విప్లవాత్మక మార్పు.
– ఎం.భద్రయ్య, ఎన్‌ఎస్ ఉపాధ్యాయుడు, ఫణిదం
డిజిటల్ విప్లవం
బోధనకు స్మార్ట్ స్క్రీన్లు రెండోవిడతలో 707 పాఠశాలలకు.. ఇప్పటికే మొదటి విడతలో అమర్చిన తెరలు, టీవీలు ఆండ్రాయిడ్ బాక్స్, ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా డిజిటల్ పాఠశాలు
జిల్లాకు మంజూరైన స్క్రీన్లు, స్మార్ట్ టీవీలు ఇలా..
మొదటి విడత | రెండో విడత | మొత్తం | |
పాఠశాలల సంఖ్య | 446 | 707 | 1,153 |
ఐఎఫ్‌పీ స్క్రీన్లు | 1,428 | 1,444 | 2,872 |
స్మార్ట్ టీవీలు | 485 | 779 | 1,264 |