Best Teacher Awards 2023: ముగ్గురికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

కాకినాడ సిటీ/అన్నవరం/కొత్తపల్లి: జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారాలకు ఎంపిక చేసింది. వీరిలో ఒకరు కాకినాడ రూరల్‌ మండలం తూరంగి జెడ్పీ ఉన్నత పాఠశాల గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయిని కడలి విజయ దుర్గ. నాడు–నేడు కింద పాఠశాలలో చేసిన పెయింటింగ్స్‌, సోలార్‌ ప్యానల్‌ పనులు ఆకట్టుకుంటున్నాయి. మాథమెటిక్స్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. సుమారు రూ.5 లక్షల విలువైన సామగ్రిని పాఠశాలకు ఇప్పించడంలో కీలక భూమిక పోషించారు. వివిధ సాంస్కృతిక, క్రీడా పోటీలలో విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సాహం అందించారు. ఉత్తమ క్రీడాకారులను తయారు చేయడంలో తన వంతు కృషి చేశారు. విజయదుర్గ 2013లో ప్రధానోపాధ్యాయునిగా బాధ్యతలు తీసుకున్నారు. 2017 వరకు కొమరిగిరి జెడ్పీ ఉన్నత పాఠశాలలోను, 2017 నుంచి 2019 వరకు కాకినాడలో సర్వశిక్షాఅభియాన్‌లో జీసీడీవోగా పనిచేసి 2019 నుంచి తూరంగి జెడ్పీ ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్నారు.

ఇటు బోధన..ఆటు సేవాపథం
ఆరెంపూడి ఎంపీపీ ప్రైమరీ స్కూల్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ రావిపల్లి ఉమాదేవి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. 1996లో కెరీర్‌ ప్రారంభించారు. శంఖవరం మండలంలోని పలు స్కూల్స్‌లో సుమారు 23 సంవత్సరాల పాటు సేవలందించారు. అన్నవరంలోని బీసీ కాలనీ స్కూల్‌ లో పనిచేసేటపుడు అక్కడ ప్రజలనుంచి రూ.60 వేలు విరాళాలు సేకరించి విద్యార్దుల కోసం బెంచీలు, రెండు స్టీలు అలమారాలు, విద్యార్దులు మధ్యాహ్నం భోజనం చేసేందుకు ప్లేట్లు కొనుగోలు చేశారు. 2017–19లో ‘ ఆనందలహరి ’ (అల) పఽథకం కింద విద్యార్దులలో నైపుణ్యం, చైతన్యం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టారు. 2018లో జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. తనను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేయడం ప ట్ల ఉమాదేవి సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు ఎంఎల్‌ఎ పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్‌ తనను అన్ని విదాలా ప్రోత్సహించారని తెలిపారు.

చ‌ద‌వండి: Best Teacher Awards 2023: సీఎం జగన్‌ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పుర‌స్కారం

ఇంగ్లిష్‌ బోధనలో అందెవేసిన చేయి
కొత్తపల్లి మండలం నాగులపల్లి బాలికల జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఇంగ్లిష్‌ టీచర్‌ వందే జగన్‌మోహన్‌ రాష్ట్ర ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యారు. గతేడాది ఈయన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. పాతిక సంవత్సరాలుగా కాకినాడ రూరల్‌, నేమాం, మల్లంలలోని పాఠశాలల్లో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. 2005 అక్టోబర్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. ప్రతి విద్యార్ధి ఇంగ్లీష్‌ భాషను సులభంగా అర్ధం చేసుకోవడమే కాకుండా సరళంగా మాట్లాడేలా 12 మంది సహ టీచర్లతో కలిసి ఒక పుస్తకాన్ని తయారు చేశారు. మొదటి విడతగా తుని, కాకినాడ రూరల్‌, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పాఠాశాలలకు అందజేశారు. ఏటా పేద విద్యార్ధులకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌, ఆర్ధిక సాయం అందిస్తున్నారు. 2019లో జగన్‌ యూ ట్యూబ్‌ వీడియో ఛానల్‌ను ప్రారంభించారు.

#Tags