AP Private Schools Free Seats Admissions Notification- ప్రైవేట్ స్కూల్స్‌లో పేద పిల్లలకు 25% ఉచిత సీట్లు, నోటిఫికేషన్ విడుదల
శ్రీకాకుళం : పేద విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో చదివే అవకాశాన్ని రాష్ట్ర ప్రభు త్వం కల్పిస్తోంది. విద్యా సంవత్సరం(2024–25)కి సంబంధించి ప్రవేశాలకు ముందస్తుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘విద్యాహక్కు చట్టం–2009 సెక్షన్ 12(1)–సి’ని అనుసరించి ప్రైవేట్ పాఠశాల ల్లో విద్యనందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పేద విద్యార్థులకు.. 25 శాతం ఉచిత సీట్లు
ప్రభుత్వ నిర్ణయంతో విద్యాహక్కుచట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు 1వ తరగతిలో ప్రవేశాలు కల్పించాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. వాస్తవానికి విద్యాహక్కుచట్టం –2009 ప్రకారం ఏటా ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఇవ్వాల్సి ఉన్నా గత పాలకులు దీన్ని పట్టించుకోలేదు.
ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో 398 ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. ఐబీ, ఐసీఎస్‌ఈ, సీబీఎస్సీ, స్టేట్ సిలబస్ అమలవుతున్న పాఠశాలల్లో 25 శాతం సీట్లు 1వ తరగతి విద్యార్థులకు కేటాయించాల్సి ఉంది. ప్రయివేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నెల 6 నుంచి సీఎస్‌ఈ వెబ్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాలని పాఠశాల విద్య కమిషనర్ మార్గదర్శకాలు జారీ చేశారు.
ఇదీ షెడ్యూల్..
● ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
● సీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌పోర్టలో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఐబీ, ఐఈఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, స్టేట్ సిలబస్ అమలయ్యే ప్రయివేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
● దరఖాస్తుతోపాటు తల్లిదండ్రుల ఆధార్/ఓటర్/ రేషన్/ భూహక్కు /ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డు/పాస్‌పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్స్/ విద్యుత్ బిల్లు/ రెంటల్ అగ్రిమెంట్ కాపీల్లో ఒకదానిని జత చేయాలి.
● మార్చి 20 నుంచి 22 వరకు అర్హులైన విద్యార్థులను గుర్తిస్తారు.
● ఏప్రిల్ 1న లాటరీ ద్వారా అర్హుల మొదటి విడత జాబితా తయారుచేస్తారు.
● ఏప్రిల్ 2 నుంచి 10 వరకు విద్యార్థుల అడ్మిషన్లు ఖరారు చేస్తారు.
● ఏప్రిల్ 15న లాటరీ ద్వారా రెండో విడత జాబితాను వెల్లడిస్తారు.
● ఏప్రిల్ 16 నుంచి 23 వరకు ఆయా పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు ఖరారు చేస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి..
విద్యాహక్కుచట్టం ప్రకారం పేద విద్యార్థులకు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించింది. ఇది పేద, మధ్య తరగతి విద్యార్థులకు వరమనే చెప్పాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– కె.వెంకటేశ్వరరావు, డీఈవో, శ్రీకాకుళం