Education Department: టీచర్ల సర్దుబాటు షురూ

రాప్తాడు రూరల్‌: విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు అవసరమైన స్కూళ్లను మిగులు (సర్‌ప్లస్‌) టీచర్లతో సర్దుబాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 18 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూలై 31 నాటికి ఉండే విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. ఇందుకోసం జిల్లాస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆమోదంతో అవసరమైన స్కూళ్లకు టీచర్లను సర్దుబాటు చేయనున్నారు. ఈ కమిటీకి అనంతపురం కలెక్టర్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌ కో చైర్మన్‌గా, అనంతపురం డీఈఓ కన్వీనర్‌గా, శ్రీసత్యసాయి డీఈఓ మెంబరుగా ఉంటారు.

చదవండి: ZP High School: అటు చదువులోను.. ఇటు క్రీడల్లోనూ నంబర్‌ వన్‌

ముందుగా స్కూల్‌ కాంప్లెక్స్‌పాఠశాలల నుంచి..
ముందుగా ఆయా స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని స్కూళ్లలో మిగులుగా ఉన్న టీచర్లను సర్దుబాటు చేస్తారు. అక్కడ లేకపోతే మండల పరిధిలో చేస్తారు. అక్కడ అందుబాటులో లేకపోతే పక్క మండలం నుంచి సర్దుబాటు చేస్తారు. అక్కడా అవకాశం లేకపోతే డివిజన్‌, ఆ తర్వాత పక్క డివిజన్‌ నుంచి సర్దుబాటు చేస్తారు. అవసరమైతే ఒక యాజమాన్యం నుంచి మరో యాజమాన్యం పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. హైస్కూల్‌ ప్లస్‌గా అప్‌గ్రేడ్‌ అయిన ఉన్నత పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉండేలా సర్దుబాటు చేస్తారు. మునిసిపల్‌ పాఠశాలలకు మునిసిపల్‌ పాఠశాలల నుంచే సర్దుబాటు చేయాలి. అక్కడ అందుబాటులో లేకపోతే ఇతర యాజమాన్యాల నుంచి సర్దుబాటు చేసుకోవచ్చు.

చదవండి: ZP High School: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా

కసరత్తు చేస్తున్నాం
విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి టీచర్లు తక్కువగా ఉండే స్కూళ్లలో బోధనకు ఇబ్బందులు లేకుండా మిగులుగా ఉన్న స్కూళ్ల నుంచి సర్దుబాటు చేస్తాం. ఈ ప్రక్రియ ప్రారంభమైంది. కసరత్తు చేస్తున్నారు. రేపటిలోగా పూర్తి చేస్తాం. స్కూళ్ల వారీగా విద్యార్థుల సంఖ్య, టీచర్ల సంఖ్యను పరిశీలిస్తున్నాం. ఏ ఒక్క స్కూల్‌లోనూ బోధనకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.
– ఎం.సాయిరామ్‌, డీఈఓ, అనంతపురం

టీచర్ల కొరత ఉన్న స్కూళ్లకు ‘మిగులు’ సర్దుబాటు స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలో తొలి ప్రాధాన్యత రేపటిలోగా ప్రక్రియ పూర్తికి విద్యాశాఖ ఉత్తర్వులు 16ఏటీపీసీ72ఏ–సాయిరామ్‌
 

#Tags