25% Seats For Students In Private Schools: ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో పేద పిల్లలకు 25శాతం సీట్లు, ఇలా దరఖాస్తు చేసుకోండి

గుంటూరు ఎడ్యుకేషన్‌: పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లలకు ప్రభుత్వం విద్యాహక్కుచట్టం ద్వారా కార్పొరేట్‌ పాఠశాలల్లో పైసాఖర్చు లేని ఉచిత విద్యను అందిస్తోంది. చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తూ గత రెండేళ్లుగా ఆయా కుటుంబాలకు చెందిన పిల్లలకు ఫీజులు చెల్లిస్తోంది. తాజాగా 2024–25 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. విద్యాహక్కుచట్టం–2009 ద్వారా నిర్భంద విద్యను అందించేందుకు జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికై తల్లిదండ్రులు మార్చి 14వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

విద్యాహక్కుచట్టం ద్వారా ప్రవేశాలు..

పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు పైసా ఖర్చు లేని కార్పొరేట్‌ విద్య కలను సాకారం చేసిన ప్రభుత్వం వేలాది రూపాయలను వెచ్చించి, కార్పొరేట్‌ పాఠశాలల్లో విద్యను పొందే స్తోమత లేని నిరుపేదలకు అండగా నిలిచింది. కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుతున్న ధనిక వర్గాల పిల్లలతో సమానంగా పేద పిల్లలు చదువుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయానికి అనుగుణంగా నిర్భంధ విద్యాహక్కుచట్టం అమల్లో భాగంగా బడుగు, బలహీన వర్గాలు ఉచిత విద్యను హక్కుగా పొందుతున్నారు.

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ–సమగ్రశిక్ష ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేశాయి. అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాల పిల్లలకు స్టేట్‌, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్‌లు అమలు చేస్తున్న పాఠశాలల్లో విద్యాహక్కుచట్ట ప్రకారం 25 శాతం సీట్లను కేటాయించాల్సి ఉంది.

మార్చి 14వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..

http://cse.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చిన్నారుల జనన ధ్రువీకరణ పత్రంతో పాటు చిరునామా ధ్రువీకరణకు తల్లిదండ్రుల ఆధార్‌కార్డు, రేషన్‌, విద్యుత్‌ బిల్లు, ఉపాధి హామీ జాబ్‌కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రెంటల్‌ అగ్రిమెంట్‌ కాపీలలో ఏదైనా ఒకటి జతపర్చాలి. టోల్‌ ఫ్రీం నంబరు: 18004258599 ద్వారా ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయంలోనూ ఉచిత విద్య కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మార్చి 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించిన తరువాత గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అనంతరం అర్హులైన విద్యార్థుల జాబితా తయారు చేసి విద్యాశాఖకు పంపుతారు. అర్హులైన విద్యార్థులకు లాటరీ పద్ధతిలో సీట్లను కేటాయించనున్నారు.

పైసా ఖర్చులేకుండా..

పేద విద్యార్థులకు పైసా ఖర్చులేని ఉచిత విద్య అందించేందుకు విద్యాహక్కుచట్టం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాల్సి ఉంది. పిల్లల చదువులకు వేలాది రూపాయలను వెచ్చించలేని నిరుపేద, బడుగు, బలహీన వర్గాలు ప్రభుత్వం కల్పిస్తున్న సదవకాశాన్ని అందిపుచ్చుకోవాలని విద్యాశాఖాధికారులు సూచిస్తున్నారు. విద్యాహక్కుచట్టం ద్వారా ఒక్కసారి ఎంపికై న విద్యార్థులు పాఠశాల విద్య ముగిసేవరకు పైసా ఖర్చులేని ఉచిత విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో ఎక్కువమంది తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఆన్‌లైన్‌లో 975 దరఖాస్తులు రావడంతో వాటిలో అర్హులైన విద్యార్థులకు సీట్లు కేటాయించారు.

జిల్లాలో 5వేల సీట్లు...

విద్యాహక్కుచట్టం కింద ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించేందుకు గుంటూరు జిల్లావ్యాప్తంగా 501 ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలతో ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాయి. వీటిలో 5వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది ఇదేవిధంగా ప్రవేశం పొందిన విద్యార్థులు వచ్చే విద్యాసంవత్సరానికి రెండో తరగతిలోకి వెళ్లనున్నారు.

 

ఫీజులు చెల్లించే బాధ్యత తీసుకున్న ప్రభుత్వం విద్యాహక్కుచట్టం ద్వారా ఒకటో తరగతిలో ప్రవేశాలు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న ప్రభుత్వం మార్చి14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ స్టేట్‌, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయింపు గుంటూరు జిల్లాలోని 501 ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో అందుబాటులో ఐదువేల సీట్లు గతేడాది పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించిన ప్రభుత్వం అర్హులైన పేద, బడుగు, బలహీన వర్గాలకు పుష్కలంగా సీట్లు ఒక్కసారి ఎంపికై తే పైసా ఖర్చులేని ఉచిత పాఠశాల విద్య

పేద కుటుంబాల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి
విద్యాహక్కు చట్టం ద్వారా ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య సదుపాయాన్ని పేద కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలి. పేద, బడుగు, బలహీనవర్గాల కుటుంబాల్లోని పిల్లలకు పైసా ఖర్చు లేకుండా ఉచిత విద్య అందించేందుకు అర్హులైన వారికి ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. ఎక్కువ మంది ప్రయోజనం పొందేలా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నాం

– జి.విజయలక్ష్మి,

#Tags