NEET Ranker Real Life Story : నీట్‌లో మంచి ర్యాంక్ కోసం.. ఈ తండ్రి త‌న కూతురి కోసం ఏం చేసాడంటే...?

నీట్‌.. ఇది భారతదేశంలోనే అతిపెద్ద అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్ష. ఈ ప‌రీక్ష‌ల్లో మంచి ర్యాంక్ వ‌స్తేనే.. ఎంబీబీఎస్‌(MBBS)లో ప్ర‌వేశం క‌ల్పిస్తారు. చాలా మంది విద్యార్థుల కల.. నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మంచి మెడిక‌ల్ కాలేజీలో జాయిన్ అవ్వ‌ల‌నుకుంటారు.

ఈ నీట్ ప‌రీక్ష‌కు.. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు పోటీప‌డి రాస్తున్నారు. దీనిలో ఉత్తీర్ణత సాధించడం అంత సులభం కాదు. అయితే.. కొంత మంది పేదింటి బిడ్డ‌లు నీట్ పరీక్షలో... టాప్ మార్కులు సాధించి.. ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంటారు. స‌రిగ్గా ఇలాగే.. పేద కుటుంబానికి చెందిన 'చారుల్ హోనారియా' అనే విద్యార్థి నీట్‌లో మంచి మార్కులు సాధించి... మంచి మెడిక‌ల్ కాలేజీలో సీటు పొందారు. ఈ నేప‌థ్యంలో.. నీట్ టాప‌ర్‌ చారుల్ హోనారియా స‌క్సెస్ స్టోరీ మీకోసం...

కుటుంబ నేప‌థ్యం :

Charul Honariya NEET Ranker Story in Telugu

ఉత్తరప్రదేశ్‌లోని కర్తార్‌పూర్‌లో ఓ చిన్న గ్రామానికి చెందిన వారు చారుల్ హోనారియా. చారుల్ హోనారియా తండ్రి షౌకీన్ సింగ్. ఈయ‌న‌ ఒక సాధారణ రైతు. వ‌చ్చిన‌ తక్కువ ఆదాయంతోనే ఇంటిని నడుపుతున్నారు. వీళ్ల‌ది ఏడుగురు సభ్యుల కుటుంబం. వీళ్ల‌ను జాగ్రత్తగా చూసుకోవడం చారుల్ తండ్రికి అంత తేలికైన పని కాదు. అయితే అతను తనకు వ‌చ్చిన త‌క్కువ ఆదాయంతోనే... త‌న‌ కుమార్తె చారుల్ చదువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చ‌దివించారు. చారుల్ తండ్రి నెలకు కేవలం 8 వేల రూపాయలు మాత్రమే సంపాదించేవాడు. అయితే.., తన కూతురు మంచి డాక్టర్ కావాలని అతనికి చాలా కోరిక ఉండేది. చారుల్ కూడా తన తండ్రి  కలను.. నిజం చేసుకోవడానికి చాలా కష్టపడింది. 

చిన్న వయసులోనే.. పెద్ద క‌ల‌లు..
చారుల్ 10వ తరగతి నుంచే నీట్ పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించింది. ఆమె చిన్న వయసులోనే పెద్ద కలలు కనడం ప్రారంభించింది. మొదట్లో.. చారుల్‌కి ఇంగ్లీష్‌తో కొంచెం ఇబ్బంది ఉండేది. కానీ ఆమె ఆ సమస్యను కూడా పరిష్కరించ‌కుంది. 

క‌నీసం...
చారుల్ నివసించిన గ్రామంలో... క‌నీసం ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు. మంచి రోడ్లు, విద్యుత్, విద్యా సౌకర్యాలు లేవు. అయినప్పటికీ.. ఆమె తన గ్రామంలోని ప్రజలకు మంచి వైద్యురాలిగా సేవ చేయాలనే కోరిక మాత్రం బ‌లంగా ఉంది. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో ఆమె అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఆమె మాత్రం ఎప్పుడు తన లక్ష్యాన్ని చేరుకునే వరకు పోరాడుతూనే ఉంది.

కూతురికి క‌నీసం ఫోన్ కొనడానికి కూడా డబ్బులు లేవ్‌..

త‌న తండ్రికి ఎన్నో ఆర్థిక సమస్యలు. సరైన వనరులు లేకపోవడం వంటి ఏదో ఒక సమస్య ఆమెను వేధిస్తూనే ఉన్నాయి. స‌రిగ్గా లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ తరగతులు వినడానికి టెర్రస్‌పై కూర్చోవాల్సిన పరిస్థితి. అయితే ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని.., ఆమె తండ్రి త‌న వ‌ద్ద‌ డ‌బ్బులు లేకుంటే... అప్పు చేసి మ‌రి ఆమెకు స్మార్ట్‌ఫోన్ కొనిపించారు. 2019లో జరిగిన నీట్ పరీక్షలో చారుల్ ఉత్తీర్ణత సాధించలేకపోయింది. కానీ ఆమె దీనితో నిరుత్సాహపడలేదు. ఆమె కొత్త ఉత్సాహంతో తదుపరి పరీక్షకు సిద్ధమైంది.

10వ తరగతి నుంచి స్కాలర్‌షిప్ పొందుతూ..

10వ తరగతి నుంచి స్కాలర్‌షిప్ పొందుతూ చదువు కొనసాగించిన చారుల్.., ఆర్థిక సమస్యల కారణంగా తదుపరి శిక్షణను కొనసాగించలేకపోయారు. కానీ ఆమె 'విద్యా జ్ఞాన్ శాల'లో ఉచిత విద్యను పొందారు. 

2019లో నీట్ పరీక్షలో ఫెయిల్ అయిన తర్వాత... ఆమె 'దక్షిణ కోచింగ్' సెంటర్ నుంచి స్కాలర్‌షిప్ పొందారు. మళ్లి నీట్‌కు ప్రిపేర్ అయ్యారు. 2020లో జ‌రిగిన నీట్ పరీక్షలో ఈమె ఏకంగా 720కి 680 మార్కులు సాధించి.. జాతీయ స్థాయిలో మంచి ర్యాంక్ సాధించారు. అంతే కాదు.. ఈ ర్యాంక్‌తో.. చారుల్‌కు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సీట్ వ‌చ్చింది. ఆమె 2020-2025 బ్యాచ్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. చారుల్ హోనారియా నీట్‌లో మంచి ర్యాంక్ కోసం చేసిన పోరాటం నిజంగా ఎంతో మంది విద్యార్థుల‌కు స్ఫూర్తినిస్తుంది.

#Tags