TELANGANA MBBS FEES: తెలంగాణ‌లో ఎంబీబీఎస్ ఫీజులు భారీగా పెంపు... బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే సీటు...

తెలంగాణ‌లో ఎంబీబీఎస్ సీట్ల ఫీజులు భారీగా పెరిగాయి. బీ కేట‌గిరీ సీట్ల‌ను అంతంత‌మాత్రంగానే పెంచిన క‌మిటీ... సీ కేట‌గిరీ సీట్ల ఫీజును మాత్రం అమాంతం పెంచేసింది. బీ కేట‌గిరీ ఫీజుకు దాదాపు రెట్టింపు ఫీజును సీ కేట‌గిరీ సీట్ల నుంచి వ‌సూలు చేయ‌నుంది.
తెలంగాణ‌లో ఎంబీబీఎస్ ఫీజులు భారీగా పెంపు... బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే సీటు...

తెలంగాణ‌లోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల ఫీజుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఎంబీబీఎస్‌ సీట్ల ఫీజుల సవరణకు సంబంధించి తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఇచ్చిన సిఫార్సులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అనుమతించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. 2023–26 మధ్య చేరిన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యే వరకు ఇదే రుసుము కొనసాగుతుందని ఆయన తెలిపారు. 

చ‌ద‌వండి:  భారీగా మిగిలిపోతున్న మెడికల్‌ సీట్లు... ఈ సీట్ల‌నైతే ప‌ట్టించుకునేవారే లేరు... ఎందుకంటే

బీ–కేటగిరీ ఎంబీబీఎస్‌ ఫీజులు కొన్ని కాలేజీల్లో రూ. 50 వేలు పెరగ్గా కొన్ని కాలేజీల్లో తగ్గాయి. సీ–కేటగిరీ ఫీజులను బీ–కేటగిరీ ఫీజుకు రెట్టింపు చేశారు. అంటే బీ–కేటిగిరీ ఫీజు రూ. 12 లక్షలున్న కాలేజీలో సీ–కేటగిరీ ఫీజు రూ. 24 లక్షల వరకు వసూలు చేసుకోవచ్చు. మొత్తంగా సరాసరి 5 శాతం ఫీజులు పెరిగినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.

చ‌ద‌వండి: లాఠీ ప‌ట్టుకుని డ్యూటీ చేస్తూనే సొంత ప్రిప‌రేష‌న్‌తో మెడిక‌ల్ సీటు సాధించా... నా స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా

రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరంలో 56 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. 27 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 3,790 సీట్లు.. 29 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 4,700 సీట్లున్నాయి. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 35 శాతం సీట్లు బీ–కేటగిరీ, 15 శాతం సీ–కేటగిరీ సీట్లుంటాయి. వీటిని మేనేజ్‌మెంట్‌ కేటగిరీ సీట్లుగా పరిగణిస్తారు.

మిగిలిన 50 శాతం సీట్లు ఏ–కేటగిరీ (కన్వీనర్‌) కిందకు వస్తాయి. కాలేజీలవారీగా నిర్వహణ ఖర్చులు మొదలు, బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, నిర్వహణ వ్యయం తదితర వివరాలతో కూడిన ఆడిట్‌ రిపోర్టులను పరిశీలించిన టీఏఎఫ్‌ఆర్‌సీ... వాటి ఆధారంగానే ఫీజుల సవరణకు సిఫార్సు చేసింది. అయితే ప్రైవేటు కాలేజీల్లో ప్రస్తుతం ఎంబీబీఎస్‌ సీట్ల ఏ–కేటగిరీ ఫీజు రూ. 60 వేలు ఉండగా అందులో ఎలాంటి మార్పు చేయలేదు. 

చ‌ద‌వండి:  ఎంబీబీఎస్‌లో కీల‌క మార్పులు... రెండో ఏడాది నుంచి కాలేజీ మార్పు అస్స‌లు కుద‌ర‌దు... 

కాలేజీలు నిర్వహణ ఖర్చుల నిమిత్తం విద్యార్థుల నుంచి ఎటువంటి క్యాపిటేషన్‌ రుసుము వసూలు చేయరాదని కాళోజీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే తదుపరి సంవత్సరానికి సంబంధించిన ట్యూషన్‌ ఫీజు కోసం కాలేజీలు బ్యాంక్‌ గ్యారెంటీని విద్యార్థుల నుంచి తీసుకోవచ్చని స్పష్టం చేశాయి. దీనిపై గతం నుంచే విద్యార్థులు నిరసన తెలుపుతుండగా ఈ నిబంధనను ఇంకా కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పీజీ మెడికల్, డెంటల్‌ కోర్సుల ఫీజులను పెంచలేదు. 

#Tags