Medical seat: భారీగా మిగిలిపోతున్న మెడికల్ సీట్లు... ఈ సీట్లనైతే పట్టించుకునేవారే లేరు... ఎందుకంటే
దేశంలో గత మూడేళ్లలో మొత్తం 860 ఎంబీబీఎస్, 12,758 పీజీ మెడికల్ సీట్లు మిగిలినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా వెల్లడించింది. అలాగే గత ఎనిమిదేళ్లలో 36,585 బీడీఎస్ సీట్లు మిగిలినట్లు తెలిపింది. 2016–23 మధ్యకాలంలో మొత్తం 1,89,420 బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 36,585 మిగిలిపోయాయి. 2017–23 మధ్య 38,487 ఎండీఎస్ సీట్లు ఉంటే వాటిల్లో 5 వేలకుపైగా ఖాళీగా ఉండిపోయాయి. తెలంగాణలోనూ గతేడాది 200కుపైగా పీజీ మెడికల్ సీట్లు మిగిలిపోగా, దాదాపు 30 వరకు ఎండీఎస్ సీట్లు మిగిలినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు చెప్పాయి.
ఇవీ చదవండి: లాఠీ పట్టుకుని డ్యూటీ చేస్తూనే సొంత ప్రిపరేషన్‌తో మెడికల్ సీటు సాధించా... నా సక్సెస్ జర్నీ సాగిందిలా
ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు మెడికల్ పీజీ చేయాలని కోరుకుంటారు. తద్వారా స్పెషలిస్టు వైద్యులుగా తమ కెరీర్‌ను మలుచుకుంటారు. అందువల్ల క్లినికల్ విభాగంలోని సీట్లకు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కోట్లు కుమ్మరించి చేరుతుంటారు. ఒక్క సీటు కూడా మిగలదు. కానీ నాన్ క్లినికల్ పీజీ సీట్లను పట్టించుకునే నాథుడే లేడు.
ఇవీ చదవండి: ఎంబీబీఎస్‌లో కీలక మార్పులు... రెండో ఏడాది నుంచి కాలేజీ మార్పు అస్సలు కుదరదు... పరీక్ష పేపర్లలోనూ అమలు
ఉపాధి లేని కోర్సులతో సీట్ల మిగులు
2020–21 విద్యా సంవత్సరంలో 83,275 యూజీ, 55,495 పీజీ మెడికల్ సీట్లు అందుబాటులో ఉండగా, 2021–22లో 91,927 యూజీ, 60,202 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంబీబీఎస్ సీట్లలో కొన్ని మిగలడానికి ప్రధాన కారణం ఎన్‌ఆర్‌ఐ కోటా ఫీజులు భారీగా ఉండటమేనని చెబుతున్నారు. కొన్ని బీ కేటగిరీ సీట్లకూ భారీగానే ఫీజులు వసూలు చేస్తున్నారు. మధ్యతరగతి తల్లిదండ్రులకు వైద్యరంగంలో ప్రైవేట్ కాలేజీ ఫీజులే ప్రధాన అడ్డంకిగా చెబుతున్నారు. తెలంగాణలో మాత్రం గతేడాది ఒక్క ఎంబీబీఎస్, బీడీఎస్ సీటు కూడా మిగలలేదు.
ఇక పీజీ మెడికల్ సీట్ల విషయానికి వస్తే.. నాన్ క్లినికల్ కోర్సుల్లో అనాటమీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ప్యాథాలజీ, మైక్రో బయోలజీ, ఎస్పీఎం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వంటివి ఉన్నాయి. ఈ కోర్సులు చేసినవారికి ప్రధానంగా మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీగా చేయడానికి వీలుంటుంది. ఫోరెన్సిక్ మెడిసిన్ వంటి వాటికి ఇతరత్రా అవకాశాలుంటాయి. కానీ, క్లినికల్ కోర్సుల మాదిరి నాన్ క్లినికల్ సబ్జెక్టులకు డిమాండ్ ఉండదు. అయితే కొన్నేళ్లుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఈ కోర్సులు చేసినవాళ్లు ఖాళీగా ఉంటున్నారు.
ఇవీ చదవండి: నీట్‌లో ఇకపై ఫిజిక్స్ మార్కుల ఆధారంగా ర్యాంకుల ప్రకటన... ఎప్పటినుంచంటే....!
క్లినికల్ విభాగాలైన జనరల్ మెడిసిన్, రేడియాలజీ, నెఫ్రాలజీ, న్యూరో, ఆర్థో, గైనిక్ తదితర కీలకమైన వాటిపైనే దృష్టిసారిస్తున్నారు. బయట ప్రాక్టీస్ చేయడానికి, కార్పొరేట్ ఆసుపత్రుల్లో భారీ జీతాలు పొందడానికి క్లినికల్ మెడికల్ కోర్సులే ఉపయోగపడతాయి. దీంతో నాన్ క్లినికల్ సీట్లను తగ్గించి క్లినికల్ సీట్లనైనా పెంచితే బాగుంటుందని ఎంబీబీఎస్ విద్యార్థులు కోరుతున్నారు.