NEET 2024 Results: ‘నీట్‌’పై టెన్షన్‌.. వెల్లడించిన ఫలితాలు ఉంచుతారా? రద్దు చేస్తారా?

సాక్షి, హైదరాబాద్‌: వైద్యవిద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) పరీక్ష ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో టెన్షన్‌ మొదలైంది.

ప్రవేశ పరీక్ష సందర్భంగా లోపాలు తలెత్తడం... ఫలితాల వెల్లడి సమయంలో మార్కుల్లో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో ఏం జరుగుతుందా అన్న చర్చ జరుగుతోంది. అవకతవకలు జరిగినట్లు భావిస్తున్న అనేకమంది విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దేశవ్యాప్తంగా వందలాది మంది కోర్టుల్లో పిటిషన్లు వేశారు.

చదవండి: NEET UG 2024 Topper Sucess Story : బేకరి వర్కర్‌ కుమార్తె.. నీట్‌లో 720/720 మార్కులతో టాపర్‌గా

దీంతో అసలు నీట్‌ ఫలితాలు ఇవే 

ఉంటాయా? వాటిని రద్దు చేస్తారా? మళ్లీ నీట్‌ పరీక్ష ఏమైనా పెడతారా? అన్న ఆందోళనలు విద్యార్థుల్లో నెలకొన్నాయి. మరోవైపు నీట్‌ ఫలితాలపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఒక కమిటీని ఏర్పాటు చేయడంతో సందిగ్ధ పరిస్థితి నెలకొంది. రద్దు ఉండకపోవచ్చని... దానివల్ల విద్యార్థులు మరింత నష్టపోతారని అధికారులు అంటున్నారు.  

ఎన్‌టీఏపై విమర్శల వెల్లువ 

మే 5న నీట్‌ పరీక్ష జరగ్గా, ఫలితాలను జూన్‌ 14న ప్రకటిస్తామని ఎన్‌టీఏ ముందుగానే ప్రకటించింది. కానీ జూన్‌ 4న దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తుంటే... అదే రోజు చడీచప్పుడు కాకుండా నీట్‌ ఫలితాలను ఎన్‌టీఏ ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. అంత హడావుడిగా ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందనే విమర్శలు వస్తున్నాయి.

చదవండి: NEET UG Exam 2024 Mass Copying Issue : నీట్ 2024..ఒకే ప‌రీక్ష‌ సెంటర్‌లో 6 మందికి ఫస్ట్‌ ర్యాంక్‌..ఎలా..? ఎన్‌టీఏ ఇచ్చిన క్లారిటీ ఇదే..

తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, పక్కదారి పట్టించేందుకు ఆరోజు విడుదల చేశారన్న చర్చ జరుగుతోంది. అలాగే ఫలితాలను చూసుకునేందుకు విద్యార్థులకు ముందే అవకాశం కల్పించారు. అయితే, ఆలిండియా ర్యాంకులు.. మార్కులు.. ఫలితాల సమగ్ర సమాచారాన్ని మాత్రం ఆరోజు మరింత ఆలస్యం చేసి ఇచ్చారు. ఇలా అనుమానాలకు తావిచ్చేలా ఎన్‌టీఏ వ్యవహరించిందన్న చర్చ జరుగుతోంది.   

హైదరాబాద్‌లోనూ ఆలస్యం  

ఇక పలువురు విద్యార్థులకు ఎన్‌టీఏ గ్రేస్‌ మార్కులు ఇచ్చిన అంశంపైనా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నీట్‌ పరీక్ష సమయం 3 గంటల 20 నిమిషాలు. కొన్ని కేంద్రాల్లో ప్రశ్నాపత్రాల అందజేతలో ఆలస్యం, చిరిగిన ఓఎంఆర్‌ పత్రాలు తదితర కారణాల నేపథ్యంలో సమయం వృథా అయ్యిందంటూ కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

అదేవిధంగా పంజాబ్, ఢిల్లీ, ఛతీస్‌గఢ్, హరియాణ న్యాయస్థానాల్లో రిట్‌ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలను ఎన్‌టీఏ సమీక్షించి వారికి గ్రేస్‌ మార్కులు ఇచ్చినట్లు తెలిపింది. అలాగైతే దేశంలో అనేకచోట్ల విద్యార్థులకు ఆలస్యంగా పరీక్ష పేపర్‌ ఇచ్చారు. వారిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని మెరీడియన్‌ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలోని ఒక రూంలో ప్రశ్నపత్రాన్ని 20 నిమిషాలు ఆలస్యంగా ఇచ్చారు. ఆ గదిలో గడియారం ఆగిపోవడం... తప్పుగా చూపించడకపోవడంతో ఆలస్యం చేశారు.

తప్పు సిబ్బందిదే అయినా కానీ విద్యార్థులకు అదనపు సమయం ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు అనేకమంది ప్రశ్నలు రాయలేకపోయారు. అంత సమయం పోవడం వల్ల తమకు మార్కులు తగ్గుతాయని, రావాల్సిన సీటు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. మరి వారికెందుకు గ్రేస్‌ మార్కులు కలపలేదని ప్రశ్నిస్తున్నారు. 

#Tags