NEET-UG 2024: నీట్‌ అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి

హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): కేంద్ర ప్రభుత్వం నీట్‌ అవకతవకలపై సీబీఐతో కాకుండా సుప్రీంకోర్టు జ్యుడీషియల్‌ కమిటీతో విచారణ జరిపించాలని పౌరహక్కుల నేత, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు.

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందని నీట్‌లో జరిగిన అక్రమాలకు ఈ విద్యా విధానమే కారణమని ఆయన ఆరోపించారు.

బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ జూన్ 23న‌ నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిటీ కార్యనిర్వాహక కార్య దర్శి ప్రొఫెసర్‌ కె.లక్ష్మీనారా యణ, ఉపాధ్యక్షుడు కె.నారాయణలతో కలిసి హరగోపాల్‌ మాట్లాడారు.

చదవండి: Free NEET Awareness Seminar: నీట్‌పై ఉచిత అవగాహన సదస్సు

నీట్‌ అక్రమాల వల్ల 24 లక్షలమంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, నీట్‌ పరీక్షలను పూర్తిగా రద్దు చేసి గతంలో మాదిరిగా వీటి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఆగస్టు 15లోగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, టీచర్ల కొరత వంటి సమస్యలను పరిష్కరించి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని సూచించారు. సమావేశంలో డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, అశోక్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

#Tags