AP DSC Notification: ఏపీలో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్.. దరఖాస్తులు, పరీక్షలు, ఫలితాలు ఎప్పుడంటే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

మొత్తం 6,100 పోస్టుల భర్తీకి డీఎస్సీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీ), 2,299 స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ), 1,264 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్‌ పోస్టులు ఉన్నాయి. టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)తో పాటు డీఎస్సీ–2024 నోటిఫికేషన్లకు ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్ర‌వ‌రి 8వ తేదీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈనెల 12న ఇవ్వనుంది. టెట్, డీఎస్సీకి పాఠశాల విద్యా­శాఖ వెబ్‌సైట్‌ https://cse.ap.gov.in ద్వారా చేసుకోవాలి. ఈ మేరకు ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠ­శాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్, కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ వివరాలు వెల్లడిం­చారు.

నోటిఫికేషన్‌ ఇచ్చిన రోజు నుంచే ఆయా పరీక్షలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. మొత్తం ప్రక్రియను పూర్తి చేసి, ఏప్రిల్‌ చివరి నాటికి అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇస్తామని, వారు వచ్చే విద్యా సంవత్సరంలో బోధన కూడా చేపడతారని మంత్రి బొత్స తెలిపారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ ఖరారు చేశామన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి పరీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ నేపథ్యంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసినవారికి, గతంలో టెట్‌ అర్హత సాధించలేని వారికి అవకాశం కల్పించేందుకు టెట్‌ కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గతంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. 

CM Revanth Reddy- 15 రోజుల్లో 15వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

వివిధ విద్యా సంస్థల పరిధిలో 6,100 పోస్టులు..
ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నాటికి ఖాళీ అయ్యే పోస్టులతో కలిపి మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, మున్సిపల్‌ కార్పొరేషన్, ఏపీ మోడల్‌ స్కూళ్లు, ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఆశ్రం), ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో మొత్తం అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు.

తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 14,219 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఈ ఐదేళ్లల్లో విద్యపై రూ.73 వేల కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. రాష్ట్రంలో పేదింటి పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తే వారు ఉజ్వల భవిష్యత్‌ను అందుకుంటారో సీఎం వైఎస్‌ జగన్‌కు బాగా తెలుసని చెప్పారు. అందుకే ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ, టోఫెల్‌ను అందుబాటులోకి తెచ్చారన్నారు. కొద్దిరోజుల క్రితం ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ (ఐబీ) సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నామని గుర్తు చేశారు. 

విద్యార్థుల మేలు కోసం కొత్త నిర్ణయం..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మేలు చేసే మరో మంచి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం మధ్యలో రిటైర్‌ అయితే విద్యార్థులకు బోధన సమస్య తలెత్తుతోందన్నారు. కొత్తవారిని నియమించినా విద్యార్థులు అలవాటు పడేందుకు సమయం పడుతోందని వివరించారు. ఈ ప్రభావం విద్యార్థుల ఫలితాలపై పడుతున్నట్టు గుర్తించామన్నారు. దీన్ని అధిగమించేందుకు విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులు రిటైర్‌ అయితే, ఆ విద్యా సంవత్సరం మొత్తం వారినే కొనసాగించే యోచన చేస్తున్నామన్నారు. దీనివల్ల విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరం మొత్తం ఒకే టీచర్‌ బోధన అందుతుందని చెప్పారు. ఇప్పటికే ఈ విధానం కేరళలో అమల్లో ఉందని, త్వరలో దీనిపై విధివిధానాలు ప్రకటిస్తామన్నారు.  

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో టెట్, డీఎస్సీ..
పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ.. ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలు రెండింటినీ ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)గా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తామన్నారు. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాలను ఎంపిక చేశామని తెలిపారు. రాష్ట్రం బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంల్లో ఏర్పాటు చేస్తామన్నారు.

డీఎస్సీ రాయాలనుకునే జనరల్‌ అభ్యర్థులకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 ఏళ్ల వయోపరిమితి ఉంటుందని చెప్పారు. ఈసారి డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు నాలుగు దశల్లో ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ (ఐబీ), టెక్నాలజీ ట్రైనింగ్, టోఫెల్, బోధన సామర్థ్యంపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందులో సర్టిఫికెట్లు సైతం ప్రదానం చేస్తామన్నారు. కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 7 లక్షల మంది పరీక్ష రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

689 Posts In Forest Department- రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే అటవీశాఖలో ఉద్యోగాల భర్తీ

#Tags