job calendar 2024: జాబ్ కేలండర్ ప్రక్రియ వేగవంతం చేస్తాం ..... 11 వేల టీచర్ పోస్టులను భర్తీ
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య సరిగా లేక పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాసేందుకు సిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రస్తుతం 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని.. కొన్ని నెలల్లో మరిన్ని పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించారు.
ఆదివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేశ్‌రెడ్డి తదితరులతో కలసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచి్చందన్నారు.
ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. 40,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇస్తాం.. ఇంకా ఉద్యోగాలకు భారీగా ఇంక్రిమెంట్స్..!
జాబ్ కేలండర్ ప్రక్రియ వేగవంతం చేస్తాం
గత పదేళ్లలో గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా బీఆర్‌ఎస్ సర్కారు నిరుద్యోగులను గాలికి వదిలేసిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని.. జాబ్ కేలండర్ విడుదల ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు.
తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. గురుకుల పీఈటీలు, అసిస్టెంట్ ఇంజనీర్లు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ లెక్చరర్లు, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి మరో 13,321 మంది ఉద్యోగుల నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుందని చెప్పారు.
షెడ్యూల్ ప్రకారం పరీక్షలు
భర్తీ సాధ్యం కాదని తెలిసినా గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచి్చందని ఆరోపించారు. తాము వాటికి మరో 6వేల పోస్టులు కలిపి 11వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే.. 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. జూలై 18 నుంచి ఆగస్టు 5వరకు పరీక్షల షెడ్యూల్ ఉందని.. ఆ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు రాసేందుకు 2.05 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు.
ఈ పరీక్షకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని.. ఖాళీగా ఉన్న మరో ఐదువేల టీచర్ పోస్టులతోపాటు మరికొన్ని పోస్టులు కలిపి త్వరలోనే మరో నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు డీఎస్సీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గతంలో పరీక్ష పెట్టారు.. లీక్ చేశారు..!
గత ప్రభుత్వం గ్రూప్–1 పరీక్షకు నోటిఫికేషన్ ఇచి్చందని.. ఆ పేపర్ లీక్ అయిందని భట్టి చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ నోటిఫికేషన్‌ను రీషెడ్యూల్ చేశామని.. ప్రిలిమ్స్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని, 31,382 మంది మెయిన్స్‌కు కూడా ఎంపికయ్యారని వివరించారు. గత ప్రభుత్వం గ్రూప్–2 పరీక్షలను మూడు సార్లు వాయిదా వేసిందని.. తాము అధికారంలోకి రాగానే ఆగస్టులో పరీక్షలు నిర్వహించేలా తేదీలు ఖరారు చేశామన్నారు.
గత సర్కారు గ్రూప్–3 కోసం డిసెంబర్ 30, 2022న నోటిఫికేషన్ ఇచ్చినా పరీక్షలు నిర్వహించలేదని.. తాము నవంబర్‌లో ఆ పరీక్ష తేదీలు ఖరారు చేశామని చెప్పారు. తెలంగాణ బిడ్డలు ఉద్యోగాలు సాధించి జీవితాల్లో స్థిరపడాలన్నదే తమ ప్రభుత్వ ఆశ, ఆలోచన అని.. డీఎస్సీకి సిద్ధమవుతున్న నిరుద్యోగులు పరీక్షలు బాగా రాసి, త్వరగా పాఠశాలల్లో చేరి పేదబిడ్డలకు పాఠాలు చెప్పాలని కోరారు.