TS ICET 2024: ఐసెట్‌కు భారీగా దరఖాస్తులు.. 15 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా దరఖాస్తులు

కేయూ క్యాంపస్‌: తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం 2024–2025లో ప్రవేశాలకు గానూ నిర్వహించనున్న టీఎస్‌ ఐసెట్‌–2024కు ఈ ఏడాది భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి.

గత పదిహేనేళ్లలో ఎన్నడూ లేనివిధంగా రికార్డుస్థాయిలో దరఖాస్తులొచ్చాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుండగా ఆదివారం వరకు 84,750 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 75,520 దరఖాస్తులు రాగా, ఈసారి ఆ సంఖ్య కంటే 9,230 దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి.

రూ.500 అపరాధ రుసుముతో సోమవారం వరకు చివరి గడువు ఉంది. ఇంకా కూడా దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని టీఎస్‌ ఐసెట్‌ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ఆచార్యులు నర్సింహాచారి వెల్లడించారు.

మే 28వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను సంబంధిత వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. 

చదవండి: AP ICET 2023 Counselling: కావలసిన సర్టిఫికేట్‌లు ఇవే... కాలేజీ ప్రెడిక్టర్ కోసం ఇక్కడ చూడండి!

ఆన్‌లైన్‌లోనే పరీక్ష.. జూన్ 28న ఫలితాలు 

ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్ట్‌ విధానంలో జూన్‌ 5వ తేదీన మొదటి సెషన్‌ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని నర్సింహాచారి ఆదివారం తెలిపారు.

6వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30గంటల వరకు ఒక సెషన్‌ను నిర్వహిస్తారని వివరించారు. మొత్తంగా మూడు సెషన్‌లలో ఈ ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

ప్రాథమిక కీని జూన్‌ 15వ తేదీన వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఆ కీపై అభ్యంతరాలను జూన్‌ 16 నుంచి 19వరకు స్వీకరిస్తామన్నారు. ఫైనల్‌ కీతో పాటు టీఎస్‌ఐసెట్‌ ప్రవేశపరీక్ష ఫలితాలను జూన్‌ 28న విడుదల చేస్తామని నర్సింహాచారి వెల్లడించారు.  

#Tags