Telangana History Qutub-Shahi Era: తెలుగు భాషా సాహిత్యాలను ఆదరించిన కుతుబ్‌షాహీలు

కుతుబ్‌షాహీలు మతసహనాన్ని పాటించారు. ఇక్కడి ప్రజలతో మమేకమయ్యారు. కాకతీయుల మాదిరే అనేక చెరువులు, కాలువలు, బావులు తవ్వించి వ్యవసాయ రంగ అభివృద్ధికి తోడ్పడ్డారు. కుతుబ్‌షాహీల కృషి వల్ల గోల్కొండ రాజ్యం నాటి యూరప్‌ దేశాల కంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. 17వ శతాబ్దంలో గోల్కొండను సందర్శించిన పాశ్చాత్య యాత్రికులు గోల్కొండ రాజ్యాన్ని రెండో ఈజిప్టుగా వర్ణించారు. అందమైన, భారీ నిర్మాణాలున్న గోల్కొండ, హైదరాబాద్‌ నగరాలను యూరప్‌లోని ఆర్లియన్స్‌తో పోల్చారు. 

కుతుబ్‌షాహీ యుగ విశేషాలు
పాలనా విధానం

రాజు(సుల్తాన్‌) సర్వాధికారి. కుతుబ్‌షాహీలు తాము దేవుడి ప్రతినిధులమని(జుల్‌ అల్లా) చెప్పుకున్నారు. రాజుకు సలహాలు ఇవ్వడానికి మంత్రి పరిషత్‌ ఉండేది. ప్రధాన మంత్రిని పీష్వా అని పిలిచేవారు. పీష్వా తర్వాతి స్థానం మీర్‌ జుంలా(ఆర్థిక మంత్రి)ది. వీరే కాకుండా ఐనుల్‌ ముల్క్‌(యుద్ధ మంత్రి/సర్వ సైన్యాధ్యక్షుడు), మజుందార్‌(ఆడిటర్‌ జనరల్‌), కొత్వాల్‌ (పోలీస్‌ అధికారి) మొదలైన అధికారులుండేవారు.
అబుల్‌హసన్‌ తానీషా కాలంలో గోల్కొండ రాజ్యంలో ఆరు సుబా(రాష్ట్రం)లను ఏర్పాటు చేశారు. సుబాలను 36 సర్కార్లు(జిల్లాలు)గా విభజించారు. సర్కార్లను 517 పరగణా(తాలూకా)లుగా విభజించారు.

కుతుబ్‌షాహీ రాజ్యంలోని సుబాలు

ఒకటో సుబా - మహ్మద్‌నగర్, మెదక్, కౌలాస్, ముల్కనూరు.
రెండో సుబా - ఎల్గందల, వరంగల్, ఖమ్మం, దేవరకొండ.
మూడో సుబా - పానగల్, ముస్తఫానగర్‌(కొండపల్లి), భువనగిరి, అకర్‌కర్‌.
నాలుగో సుబా - కోయిల్‌ కొండ, ఘన్‌పూర్, ముర్తజానగర్‌(గుంటూరు), మచిలీపట్టణం.
అయిదో సుబా - నిజాం పట్టణం, ఏలూరు, రాజమండ్రి, సికాకోల్‌.
ఆరో సుబా - కర్ణాటక ప్రాంతం. ఇందులో 16 సర్కార్లు ఉండేవి.
రాష్ట్ర పాలకుడిని తరఫ్‌దార్‌గా, జిల్లా పాలకుడిని ఫౌజుదార్‌గా వ్యవహరించేవారు. పరగణా పాలకుడిని తహసీల్దార్‌ అని పిలిచేవారు.
గ్రామాల్లో పన్నెండు మంది ఆయగార్లు ఉండేవారని నాటి ఫర్మానాలను బట్టి తెలుస్తోంది. వారు..
పటేల్, కులకర్ణి (కరణం), చౌద్రి (వర్తకుల పెద్ద), పోతేదార్‌ (నాణేల మారకందారు), దేశ్‌పాండే (గణకుడు), నహని (మంగలి), పారిత్‌ (చాకలి), పూజారి, సుతార్‌ (వడ్రంగి), కుంభార్‌ (కుమ్మరి), జోషి (జోతిష్కుడు), వేశహార(మస్కూరి). 
సారంగు తమ్మయ 'వైజయంతీ విలాసం'అనే గ్రంథాన్ని రచించాడు. ఇందులోని వర్ణనను బట్టి దొంగలను పట్టుకుని, దొంగ సొత్తును కొనుగోలు చేసే కంసాలులను విచారించే అధికారే తలారి(తలవరి) అని తెలుస్తోంది.
కుతుబ్‌షాహీలు హిందూధర్మ సూత్రాల్లో జోక్యం చేసుకోలేదు. గోల్కొండ రాజ్యంలో 84 స్థల, గిరి, వన, జల దుర్గాలు ఉండేవి. వీటిలో ఎక్కువ భాగం తెలంగాణలో ఉండేవి. కేంద్ర సైన్యం, జాగీర్దారీ సైన్యం అని రెండు రకాల సైన్యం ఉండేది.

చ‌ద‌వండి: TS History for Group 1 & 2: తెలంగాణ చరిత్ర... తొలి కాకతీయులు అవలంభించిన మతం?

ఆర్థిక పరిస్థితులు

గోల్కొండ రాజ్యంలో సారవంతమైన తీర భూములు ఉండేవి. ప్రజల ప్రధాన సాంస్కృతిక ధోరణులను సమన్వయ పరచడానికి, సాంఘిక అసమానతలను అదుపు చేయడానికి సూఫీ ఉద్యమం తోడ్పడింది. నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. గోల్కొండ సుల్తాన్లు, వారి అధికారులు హుస్సేన్‌సాగర్, ఇబ్రహీంపట్నం, బద్వేల్‌ లాంటి చెరువులను తవ్వించారు. ఇవే కాకుండా అనేక కాలువలు, బావులను తవ్వించి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. నీటి వనరులకు మరమ్మతు చేయడానికి, ఆయకట్టు భూములకు నీరు అందించడానికి వడ్డెరలను నియమించి, వారికి మేరలు ఏర్పాటు చేశారు. గోల్కొండ సుల్తాన్ల కృషి వల్ల భూములు విస్తృతంగా సాగులోకి వచ్చాయి. రైతులు వరి, జొన్న, రాగి, పెసర, వేరుశెనగ, కందులతోపాటు పత్తి, పొగాకు, ఆముదం తదితర పంటలను పండించేవారు. అప్పటికే పోర్చుగీసువారు మన దేశంలో పొగాకును ప్రవేశపెట్టారు. పత్తి, పొగాకు పంటల వల్ల ప్రభుత్వ ఖజానాకు అధిక ఆదాయం లభించేది. సంత్రాలు, అంజూర, జామ, నారింజ, మామిడి, అరటి, నిమ్మ, దానిమ్మ లాంటి పండ్ల తోటలను పెంచేవారు.
పదిహేడో శతాబ్దంలో గోల్కొండ రాజ్యంలో మేలిరకం ఇనుము, ఉక్కు ఉత్పత్తి అయ్యేవి. వీటితో కత్తులు, బాకులు మొదలైన యుద్ధ పరికరాలను తయారుచేసేవారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన డమాస్కస్‌ కత్తుల తయారీలో గోల్కొండ ఉక్కును ఉపయోగించారు. నిర్మల్, ఇందూరు పట్టణాలు ఆయుధ పరిశ్రమకు కేంద్రంగా ఉండేవి. గోల్కొండ రాజ్యం వజ్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. గోల్కొండ వజ్రాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. అబ్దుల్లా కుతుబ్‌షా కాలంలో నూతన వజ్రాల గనులు కనుగొన్నారు. వస్త్ర పరిశ్రమకు ఓరుగల్లు పేరొందింది. ఖమ్మం జిల్లాలోని నాగులపంచలో లభించే నీలిరంగును విదేశాలకు ఎగుమతి చేసేవారు. 17వ శతాబ్దం తొలినాళ్లలో 'మిరప' గురించి తెలంగాణ ప్రజలకు తెలిసింది.

సాంఘిక పరిస్థితులు

కుతుబ్‌షాహీల సంస్కృతి తెలంగాణ సంస్కృతిగా రూపుదిద్దుకుంది. ఇతర తెలుగు ప్రాంతాల కంటే మరింత భిన్నమైన సంస్కృతి తెలంగాణలో రూపొందింది. కులీ కుతుబ్‌షా తెలంగాణ ప్రజల వస్త్రాలంకరణను అనుసరించి, వారి అభిమానం చూరగొన్నాడు.
హైదరాబాద్‌ నగరంలో సుమారు పది లక్షల మంది నివసించేవారు. మొగలులు, ఇరానీలు ఇక్కడస్థిర నివాసం ఏర్పరచున్నారు. హైదరాబాద్‌లో వేశ్యావృత్తి ఉండేది. నాట్యకత్తెలకు ఆదరణ పెరిగింది. అబ్దుల్లా కుతుబ్‌షాతో సహజీవనం చేసిన తారామతి, ప్రేమావతి గొప్ప నాట్యకత్తెలుగా పేరొందారు. కుల వ్యవస్థ కొనసాగింది. కుల కట్టుబాట్లు అధికమయ్యాయి. అనేక ఉపకులాలు స్థిరపడ్డాయి. బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. సతీసహగమన దురాచారాన్ని రూపుమాపడానికి కుతుబ్‌షాహీలు ప్రయత్నించారు.

చ‌ద‌వండి: Telangana History for Groups: కలకాలం నిలిచి ఉండే కాకతీయుల ప్రాభవం

మత పరిస్థితులు

ఈ కాలంలో తెలుగు ప్రజలు స్మార్త, శైవ, వైష్ణవ మతాలను అనుసరించేవారు. ఈ మతాల మధ్య విభేదాలు తీవ్రంగా ఉండేవి. కుతుబ్‌షాహీలు ప్రజల మత విశ్వసాలను, ఆచార వ్యవహారాలను గౌరవించేవారు. దేవాలయాలకు భూములు దానం చేసేవారు. ప్రతిభను బట్టి తెలుగువారికి అనేక ఉన్నత పదవులిచ్చేవారు. అనేక మంది తెలుగు వారు మీరాసిదార్లుగా, జాగీరుదార్లుగా, దేశ్‌ముఖ్‌లుగా, దేశ్‌పాండేలుగా ఉండటమే అందుకు నిదర్శనం. ఈ ఆదరణ వల్ల తెలుగువారు, ముస్లింలు కలిసిపోయి ఒక సహజీవన సంస్కృతి రూపొందింది. తెలుగుముస్లిం మిశ్రమ సంస్కృతి ఏర్పడింది. ఒకరి ఆచారాలు, సంప్రదాయాలను మరొకరు అనుసరించారు. మొహర్రం(పీర్ల) పండుగను తెలుగువారు తాదాత్మ్యతతో జరుపుకొనేవారు. దర్గాలకు వెళ్లేవారు. కందూరు చేసుకునేవారు. అదే విధంగా తెలుగు పండుగలు, ఆచార వ్యవహారాలను ముస్లింలు ఆదరించేవారు.
షబ్‌ఏ రాత్‌ పండుగలో దీపాలు అలంకరించడం దీపావళి నుంచి వచ్చింది. వసంతోత్సవాల్లో రాజులు, ముస్లిం ప్రజలు పాల్గొనేవారు. తిరుపతికి వెళ్లేవారు. అక్కడి బీబీనాంచారమ్మ అలా వెలిసిందే. ముస్లింలలో మంగ్‌నా(నిశ్చితార్థం), వధూవరులను తలుపు దగ్గర ఆపి పరిహాసాలాడటం, వధూవరుల మధ్య అడ్డంగా తెరకట్టడం, తలంబ్రాలు పోసుకోవడం ఇవన్నీ తెలుగువారి ఆచారాల నుంచి వచ్చినవే. వాస్తు శిల్పాల్లోనూ ఈ మిశ్రమ విధానం కనిపిస్తుంది.
కుతుబ్‌షాహీలు పర్షియా నుంచి వచ్చారు. వీరు షియా తెగకు చెందినవారు. తమ మత సంప్రదాయం ప్రకారం పరమత సహనం పాటించారు. సున్నీలను, తెలుగువారిని చిన్నచూపు చూడలేదు. మతయుద్ధాలు చేయలేదు. కులీకుతుబ్‌షా మొహర్రం పండుగను ప్రవేశపెట్టాడు. ఇతడే పీర్ల చావడులను, హుస్సేనీ ఆలంను నిర్మించాడు. షియాలు, సున్నీల మధ్య వైషమ్యాలు కొంత కాలం కొనసాగాయి. బహమనీల కాలంలో ముస్లింలు, ఉర్దూభాష తెలంగాణకే పరిమితం కాగా, కుతుబ్‌షాహీల కాలంలో ఇతర తెలుగు ప్రాంతాలకు కూడా విస్తరించడం నూతన పరిణామం.

కుతుబ్‌షాహీల చిత్రకళ

కులీకుతుబ్‌షా, ఇతర నవాబులు ఢిల్లీ నుంచి చిత్రకారులను రప్పించి పోషించారు. మొగల్‌ చిత్రకారుల సాన్నిహిత్యంతో కొత్త శైలి రూపుదిద్దుకుంది. దాన్నే దక్కన్‌ కలం అంటారు. దక్కనీ శైలి సృష్టికర్త మీర్‌ హసీం. అబ్దుల్లా, తానీషాల కాలంలో ఈ శైలి మరింత వృద్ధి చెందింది.

చ‌ద‌వండి: Telangana History for Competitive Exams: కాకతీయుల కాలం సాహిత్యానికి స్వర్ణయుగం

భాషా సాహిత్యాలు

ఈ కాలంలో ఉర్దూ 'దక్కనీ ఉర్దూ'గా పేరొందింది. దాని ప్రాభవం ఉచ్ఛస్థితికి చేరింది. హైదరాబాద్‌లో 38వేల పుస్తకాలున్న గ్రంథాలయం ఉండేది.
కుతుబ్‌షాహీలు తెలుగులో శాసనాలు వేయించారు. తెలుగు భాషను, కవులను, సంస్కృతిని ఆదరించారు. ఉర్దూలో కవిత్వం రాశారు. జమ్షీద్‌ కుతుబ్‌షా(154350) స్వయంగా కవి. గజల్‌లు, గేయాలు రాశాడు. ఇబ్రహీం కుతుబ్‌షా(155080) విజయనగర రాజుల దగ్గర ఏడేళ్లపాటు ఆశ్రయం పొందాడు. ఆ సమయంలోనే తెలుగు నేర్చుకున్నాడు. తెలుగు సాహిత్యంలో మల్కిభరాముడిగా ప్రసిద్ధి చెందాడు. ఇతడి దర్బారులో ఉమర్‌ షా మహ్మద్‌ అంజూ, అమీర్‌ ఇమాదుద్దీన్, మహమూద్‌ షిరాజి, జావీ నవీసుల్, జమాఖాసిం బేగ్‌ షిరాజి, హుస్సేన్‌ కులీమీర్జా మొదలైన పండితులుండేవారు. అద్దంకి గంగాధరుడు, మరింగంటి సింగరాచార్యులు, కుందుకూరి రుద్రకవి తదితర తెలుగు కవులను ఇబ్రహీం కుతుబ్‌షా పోషించాడు. తెలుగు వనిత అయిన భాగీరథిని ఇతడు వివాహమాడాడు. తారిఖ్‌ కుతుబ్‌షాహి గ్రంథ రచయిత కుర్షాబిన్‌ కబ్బాదుల్‌ హుసేన్‌ ఇతడి కాలానికి చెందినవాడే.
ఈ యుగంలో కనిపించే తొలి కవి చరిగొండ ధర్మన. ఇతడు పెద్దన, సూరన, నందిఘంట కవుల కంటే ముందే రుతువర్ణన, నాయికా వర్ణన, వేటవర్ణన లాంటి అష్టాదశ వర్ణనలు చేశాడు. దీన్ని బట్టి ధర్మనను ప్రబంధ కవిత్వ మార్గదర్శకుడిగా చెప్పవచ్చు. కల్పిత కథ ఆధారంగా ఇతడు చిత్రభారతాన్ని రచించాడు. గయోపాఖ్యానం, కృష్ణార్జున యుద్ధం లాంటి యక్షగానాలు రావడానికి చిత్ర భారతమే మూలం. మహబూబ్‌నగర్‌(చరిగొండ సీమ)కు చెందిన ధర్మన్న కరీంనగర్‌ జిల్లాలోని ధర్మపురి వెళ్లి, ఎనుముల పెద్దన దగ్గర ఆశ్రయం పొందాడు. చిత్రభారతాన్ని అతడికే అంకితమిచ్చాడు. ఇందులో నాటి చారిత్రకాంశాలు కనిపిస్తాయి. చరిగొండ ధర్మన్న సోదరుడు చరిగొండ నరసింహకవి. ఇతడు కూడా కవే. పింగళి సూరన కంటే ముందే సూరన అనే మరో కవి కల్పిత కావ్యం(ధనాభిరామం) రాశాడు. 
పోశెట్టి లింగ కవి నవచోళ చరిత్ర, మల్హణ చరిత్ర, శంకర దాసమయ్య చరిత్ర, వీర సంగమయ్య దేవ చరిత్ర, శిష్య ప్రబోధం అనే ద్విపద కావ్యాలను రాశాడు. పోశెట్టి అనే పేరు ఇప్పటికీ తెలంగాణలో వాడుకలో ఉంది. ఈ కావ్యంలోని కైకిలి(దినసరి కూలి),కొండెంగ, మోటు, ఉరువడి, పుటిక, తునక తదితర పదాలు తెలంగాణాలోనే వాడుకలో ఉన్నాయి. అందువల్ల ఇతడు తెలంగాణకు చెందినవాడే కావచ్చు.
ఆసూరి మరింగంటి సింగరాచార్యులు దశరథ రాజనందన చరితను రచించాడు. ఇది తెలుగు సాహిత్యంలో తొలి నిరోష్ఠ్య రచన. ఇతడే తొలిసారిగా అచ్చ తెలుగులో సీతాకల్యాణం అనే నిరోష్ఠ్య రచన చేశాడు. తొలి త్య్రర్ధి, చతురర్ది (నలరాఘవయాదవపాండవీయం) రచన కూడా ఇతడిదే. తిరునామరచనకు కూడా సింగరాచార్యులే ఆద్యుడు. ఇతడు ఇబ్రహీం కుతుబ్‌షా నుంచి అగ్రహారాన్ని పొందాడు.
మల్కిభరాముడి(ఇబ్రహీం కుతుబ్‌షా) మరో ఆస్థాన కవి అద్దంకి గంగాధరుడు (152580). ఇతడిని రామరాజభూషణుడితో పోల్చవచ్చు. ఇతడు 'తపతీ సంవరణోపాఖ్యానం'ను రచించి, ఇబ్రహీం కుతుబ్‌షాకు అంకితమిచ్చాడు. ఈ కావ్యంలో మల్కిభరాముడి ప్రేమ కథను వర్ణించాడు. ఈ శృంగార కావ్యంలో సమకాలీన సాంఘిక విశేషాలెన్నో కనిపిస్తాయి.
సిద్ధరామకవి, గంగాధరుడి సమకాలికుడు. ఇతడు ప్రభుదేవర వాక్యం అనే వేదాంత వచన గ్రంథాన్ని రచించాడు. స్తుతి వచన ప్రక్రియకు ఆద్యుడు కృష్ణమాచార్యుడు. శివస్తుతి వచనాలకు ఆద్యుడు గంగాధరయ్య. వీరిద్దరూ తెలంగాణ వారే. మరింగంటి జగన్నాథాచార్యులు(శ్రీరంగనాథవిలాసం), అప్పలాచార్యులు కూడా మల్కిభరాముడి వద్ద ఆశ్రయం పొందారు. 
కందుకూరి రుద్రకవి ఈ యుగంలోని అగ్రశ్రేణి కవుల్లో ఒకడు. ఇబ్రహీం కుతుబ్‌షా దేవరకొండ దుర్గపాలకుడిగా ఉన్నప్పుడే ఇతడికి కుతుబ్‌షాతో పరిచయం ఉంది. కుతుబ్‌షా రాజైన తర్వాత అతడి నుంచి రెంటచింతల (ద్వితింత్రిణి)ను అగ్రహారంగా పొందాడు. ఇతడు నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని కందుకూరుకు చెందినవాడని తెలుస్తోంది. ఇతడు 'సుగ్రీవ విజయం'ను రచించాడు. దీన్ని తొలియక్షగానంగా భావిస్తారు. నిరంకుశోపాఖ్యానం, జనార్ధనాష్టకం, బలవదరీ శతకం, జనార్ధనాష్టక స్తోత్రం, గువ్వలచెన్నని శతకం తదితర గ్రంథాలను రుద్రకవి రచించాడు. ఇతడి రచనల్లో నిరంకుశోపాఖ్యానం ముఖ్యమైంది. ఇది శృంగార ప్రధాన సాంఘిక కావ్యం. ఇందులో నాటి సాంఘిక జీవనాన్ని చిత్రీకరించారు. మల్కిభరాముడి అనుచరుడైన అమీన్‌ఖాన్‌ తొలి అచ్చతెలుగు కావ్యకర్త పొన్నిగంటి తెలగనను ఆదరించాడు. అప్పటి వరకు కవులు అచ్చ తెలుగులో పద్యాలు మాత్రమే రాశారు. కావ్యాలను రాయలేదు. తెలగన అచ్చ తెలుగు కావ్యం రాసి, పాల్కుర్కి దేశిమార్గాన్ని సుసంపన్నం చేశాడు. 

డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, 'తెలంగాణ చరిత్ర' రచయిత

చ‌ద‌వండి: Telangana History for Competitive Exams: కుతుబ్‌షాహీ యుగం.. మల్కిభరాముడిగా పేరొందిన కుతుబ్‌షాహీ రాజు?

#Tags