TSPSC Group 3 Exams : నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్–3 పరీక్షలు.. రివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత!
వీరంతా తమ ప్రిపరేషన్‌కు తుది మెరుగులు దిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కారణం.. గ్రూప్–3 పరీక్ష తేదీలు ఖరారు కావడమే!! నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్‌సీ ప్రకటించిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో.. గ్రూప్–3 పరీక్ష తీరుతెన్నులు, పరీక్షలో విజయానికి చివరి దశ ప్రిపరేష¯Œ పై ప్రత్యేక కథనం..
● 1,375: గ్రూప్–3 ఉద్యోగాల సంఖ్య!
● 5,36,477: మొత్తం దరఖాస్తుల సంఖ్య.
● అంటే.. ఒక్కో పోస్ట్‌కు 390కు పైగా పోటీ!!
ఇంతటి తీవ్ర పోటీలో నెగ్గాలంటే.. ఇప్పటి వరకు సాగించిన ప్రిపరేషన్ శైలికి భిన్నంగా తుది మెరుగులు దిద్దుకోవాలి. ఇంతకాలం చదివిన అంశాల రివిజన్‌పై అధికంగా దృష్టిపెట్టాలి.
గ్రూప్–3 పరీక్ష స్వరూపం
గ్రూప్ 3 పరీక్షను మొత్తం మూడు పేపర్లలో నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు చొప్పున 450 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 మార్కులకు, పేపర్–2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ 150 మార్కులకు, పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ 150 మార్కులకు ఉంటాయి. పేపర్–2, 3లలో ప్రతి పేపర్‌లోనూ మూడు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు చొప్పున 150 ప్రశ్నలతో పేపర్ ఉంటుంది.
సమయం.. సమన్వయం
గ్రూప్–3 పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. అంటే.. అభ్యర్థులకు అందుబాటులో ఉన్న సమయం 50 రోజులు. ఈ సమయాన్ని ఎంతో సమన్వయంతో వినియోగించుకోవాలి. మూడు పేపర్లలో ఉన్న కామన్ టాపిక్స్‌ను గుర్తిస్తూ వాటిని ఒకే సమయంలో చదివేలా ప్లాన్ చేసుకోవాలి. ఆయా సబ్జెక్ట్‌లలోని ఉమ్మడి అంశాల ను గుర్తించి.. వాటిని అనుసంధానం చేసుకుంటూ చదవాలి. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, భారత రాజ్యాంగం విధానం, పరిపాలన, ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్.. ఇలా అన్ని అంశాలను సమన్వయం చేసుకుంటూ చదివే వీలుంది.
పునశ్చరణ
ఈ సమయంలో ముందుగా పాటించాల్సిన వ్యూహం రివిజన్(పునశ్చరణ). ఇప్పటి వరకు తాము చదివిన అంశాల అవలోకనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొత్త పుస్తకాల జోలికి వెళ్లకుండా సిలబస్‌కు సరితూగే పుస్తకాలను మాత్రమే చదవాలి. డిస్క్రిప్టివ్ విధానంలో చదువుతూ ముఖ్యాంశాలను సొంత నోట్సులో రాసుకుంటూ ప్రతి రోజూ పునశ్చరణ చేసుకోవాలి. ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్ చదివేలా సమయ పాలన పాటించాలి. రోజూ సగటున 8 నుంచి 10 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
☛ Follow our Instagram Page (Click Here)
కొత్త టాపిక్స్‌కు ఇలా
ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు తమకు కష్టంగా భావించిన అంశాలను తర్వాత చదవచ్చు అనే ఉద్దేశంతో విస్మరిస్తారు. వాటిలో ముఖ్యమైనవి కూడా ఉండొచ్చు. ఇలాంటి టాపిక్స్ విషయంలో వాటికి పరీక్షలో లభిస్తున్న ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుని.. ప్రిపరేషన్‌కు కొంత టైమ్ కేటాయించాలి. దీంతోపాటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ఉద్యమ దశలు, తెలంగాణ ఆవిర్భావ దశ, మలి ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా తెలంగాణ చరిత్రలో తెలంగాణ సామాజిక ముఖ చిత్రాన్ని తెలియజేసే అన్ని అంశాలను చదవాలి. సాహిత్యం, కళలు, వాస్తు, శిల్పం, కవులు, భౌగోళిక స్వరూపం, వనరులు, ప్రభుత్వ పథకాలు, తెలంగాణ ఏర్పాటు తర్వాత అమలు చేస్తున్న కొత్త పథకాలు.. ఇలా అన్ని అంశాలపై దృష్టి పెట్టాలి. తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ కీలకమైనవిగా గుర్తించాలి.
సొంత నోట్స్
అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభం నుంచే ఆయా సబ్జెక్ట్‌లలోని ముఖ్యమైన అంశాలతో సొంత నోట్స్ రాసుకుంటారు. ప్రస్తుత సమయంలో అభ్యర్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన పాయింట్లతో రాసుకున్న నోట్స్‌ను పదేపదే చదవాలి. ఇలా చదువుతూ అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. మతాలు, సామాజిక వర్గాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలు వంటి స్థానిక అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. అదే విధంగా ఒక అంశాన్ని చదివేటప్పుడు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి.
తాజా విధానాలు
ఇప్పటి వరకు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి సిలబస్ ప్రకారం చదువుతున్న అభ్యర్థులు.. ప్రభుత్వ తాజా విధానాలపై దృష్టి పెట్టడం మేలు చేస్తుంది. పరీక్షలో ప్రభుత్వ విధానాలపై కనీసం 15 నుంచి 20ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో సామాజిక సమస్యలు, వాటిపై ప్రభుత్వాలు చేసిన విధానాలపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం ప్రభుత్వ విధానాలపై ప్రచురితమైన అధికారిక డాక్యుమెంట్లను పరిశీలించాలి. ఇందులో మహిళా సాధికారత వంటివి ముఖ్యమైనవి. మహిళల సాధికారత కోసం జాతీయస్థాయిలో రకరకాల పథకాలు తెచ్చారు. మైనారిటీ, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమం కోసం విధానాలు తెచ్చారు. వీటిపై దృష్టిపెట్టాలి.
☛ Join our WhatsApp Channel (Click Here)
పరీక్ష రోజు ఇలా
ఎన్ని సంవత్సరాలు కష్ట పడినా.. ఎన్ని పుస్తకాలు అధ్యయనం చేసినా.. పరీక్ష రోజున అందుబాటులో ఉన్న వ్యవధిలో చూపే ప్రతిభే విజయాన్ని నిర్దేశిస్తుందని గుర్తించాలి. పరీక్ష హాల్లో ప్రశ్న పత్రాన్ని పూర్తిగా చదివేందుకు కొంత సమయం కేటాయించాలి. కనీసం పది నిమిషాలపాటు ప్రశ్న పత్రం పరిశీలించాలి. ఫలితంగా ప్రశ్న పత్రం క్టిష్లత స్థాయిపై ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత సులభంగా భావించిన ప్రశ్నలకు ముందుగా సమాధానం ఇవ్వాలి. అనంతరం ఓ మోస్తరు క్లిష్టత ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. చివరగా తమకు అత్యంత క్లిష్టంగా భావించిన ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. ఇలా ప్రస్తుతం రివిజన్ నుంచి ఎగ్జామ్ హాల్లో వ్యవహరించే తీరు వరకూ.. స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగాలి.
పరీక్షలో ముఖ్యమైన అంశాలు
పేపర్–1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్
● కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి భారతదేశ ప్రమేయం, అదే విధంగా భారత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉన్న అంశాలపై దృష్టిపెట్టాలి. చరిత్రలో కీలక సంఘటనలు, అవి చోటు చేసుకున్న సంవత్సరాలపై పట్టు సాధించాలి. అదే విధంగా చరిత్రలో ముఖ్యమైన యుద్ధాలు, అందుకు దారితీసిన పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకోవాలి.
● ఎకానమీ కోసం బేసిక్స్‌తోపాటు ఇటీవల కాలంలో ఆర్థిక విధానాలు, అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, లబ్ధిదారులు, పథకాల లక్ష్యం వంటి అంశాలను అధ్యయనం చేయాలి.
● సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బేసిక్ సైన్స్ అంశాలతోపాటు నిజ జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర, ఈ రంగంలో తాజా పరిణామాలు, వాటి వల్ల ప్రయోజనాలు వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
● జాగ్రఫీలో భౌగోళికంగా ప్రాధాన్యం సంతరించుకున్న ప్రాంతాలు, ఖనిజ వనరులు, సహజ వనరులు, నదీ తీర ప్రాంతాలు, అడవులు–రకాలు, పంటలు–అవి ఎక్కువగా పండే ప్రాంతాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. జనరల్ ఎబిలిటీలో రాణించేందుకు దత్తాంశాల విశదీకరణ, టేబుల్స్, గ్రాఫ్స్‌ను పరిశీలించి.. వాటిలోని ముఖ్యాంశాలను గుర్తించే
విధంగా అధ్యయనం చేయాలి.
☛ Join our Telegram Channel (Click Here)
పేపర్–2
హిస్టరీ, పాలిటీ, అండ్ సొసైటీ పేరిట ఉన్న పేపర్–2 కోసం తెలంగాణ హిస్టరీలో తెలంగాణ సంస్కృతి, కవులు, కళలు, శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసఫ్‌జాహీలు, సాయుధ రైతాంగ పోరాటం తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి. పాలిటీ విభాగానికి సంబంధించి భారత రాజ్యాంగం ప్రధాన చట్టాలపై పట్టు సాధించాలి. అధికరణలు, ప్రకరణలు, సవరణల గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా ప్రాథమిక హక్కులు,ఆదేశిక సూత్రాలు, ప్రభుత్వ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థలపై పట్టు పెంచుకోవాలి. వీటితోపాటు రాజ్యాంగ పరమైన సంస్థలు, వాటి విధుల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా రాజ్యాంగంపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి.
పేపర్–3 కోసం
ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ పేరిట ఉండే పేపర్–3 కోసం దేశ, రాష్ట్ర ఆర్థిక విధానాలపై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలి. తెలంగాణ ఎకానమీని అధ్యయనం చేయాలి.రాష్ట్రంలో ఆయా వర్గాల కోసం అమలు చేస్తున్న నూతన విధానాల గురించి తెలుసుకోవాలి. వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, గిరిజనుల కోసం తెచ్చిన విధానాలు, పథకాలపై అవగాహన అవసరం. జాతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కోర్ ఎకానమీ అంశాలు మొదలు తాజా ఆర్థిక విధానాల వరకు అన్నింటినీ తెలుసుకోవాలి. బడ్జెట్ గణాంకాలు, తాజా ఆర్థిక సర్వే గణాంకాలపై పట్టుసాధించాలి.
☛Follow our YouTube Channel (Click Here)