APPSC Group 1 Ranker Gnanananda Reddy Success : గ్రూప్‌-1లో విజ‌యం సాధించానిలా.. మా నాన్న కోసం ఎలాగైన‌ ఈ లోటును భ‌ర్తీ చేస్తా..

నాన్న చెప్పిన ఆ మాటలే నాలో కసి పెంచాయి. ఆ మాట‌లే న‌న్ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(APPSC) ప్రతిష్టాత్మకంగా నిర్వ‌హించే గ్రూప్‌–1 పరీక్షలో విజయం సాధించేలా చేశాయ్‌.
APPSC Group 1 Ranker Gnanananda Reddy Success Story

నా పేరు జ్ఞానానంద రెడ్డి. మాది  శ్రీ సత్యసాయి జిల్లా ఎన్‌పీ కుంట మండలం మర్రికొమ్మ దిన్నె గ్రామం. మా నాన్న గారి పేరు దానంరెడ్డి పెద్దిరెడ్డి. అమ్మగారి పేరు అరుణకుమారి. మేము ముగ్గురు సంతానం నేను చివరి వాడిని. మా పెద్ద అక్క అనురాధ. చిన్న అక్క వినీష తను డిగ్రీ తర్వాత ఆరోగ్యం బాగోలేక చనిపోయింది. మా పెద్ద అక్క ఎంఎస్సీ (Msc) చదివి ప్రస్తుతం సెక్రటరెట్‌లో పని చేస్తున్నది. మా బావ గారు ఐటీసీ గుంటూరు నందు పని చేస్తున్నారు.

మా నాన్న ఒక్కడి జీతంతోనే..

నా భార్య పేరు రవళి. తను కూడా ఎంటెక్ చదివి గ్రూప్స్, సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నది. మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్న గారు మా కుటుంబంలో పెద్దవారు. మా నాన్నకి 3 అక్కలు 3 తమ్ముళ్లు ఉన్నారు. మా నాన్న కుటుంబ పెద్ద అయినందువలన కుటుంబ బాధ్య‌త‌ మొత్తం మా నాన్న మీదనే పడింది. అందువలన ప్రతి విషయంలో మేము సర్దుకుపోవాల్సి వచ్చేది. మేము చాలా ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళం. మా నాన్న ఒక్కడి జీతంతోనే మా కుటుంబం మొత్తం గడిచేది. మా అమ్మ అంగన్వాడీ టీచర్‌గా పనిచేసిన జీతం మాకు సరిపోయేది కాదు.

ఎప్పటికయినా కలెక్టర్‌గా..

అయినప్పటికీ మా అమ్మ నాన్న నా చదువు విషయంలో ఎప్పటికి తక్కువ చేసేవారు కాదు. మా నాన్న రెవిన్యూ లో పని చేయటం వలన నన్ను ఎప్పటికయినా కలెక్టర్‌గా చూడాలని కోరుకునేవారు. మా నాన్న చేసిన మంచి పనులే నాకు ప్రేరణ. పల్లెల నుంచి వచ్చేవాళ్ళు మా నాన్న గురించి గొప్పగా చెప్తుంటే.. అవే నా ఆలోచలనలో నాటుకుపోయి ఎలా అయినా మంచి కలెక్టర్ స్థాయి ఉద్యోగం తెచ్చుకొని పది మందికి సేవ చేసి మంచిపేరు తెచ్చుకోవాల‌నుకునే వాడిని. అలాగే మా నాన్న చేసిన మంచి పనులే నేను ఈ వైపు రావ‌డానికి ప్రేరణ కలిగింది.

నా ఎడ్యుకేష‌న్ : 

నేను 1 నుంచి 10 వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. నాకు డాక్టర్ కావాలనే కోరిక వలన ఇంటర్ లో బైపీసీ తీసుకున్నా. ఎంసెట్ లో నాకు మంచి ర్యాంక్ వచ్చినా.. హోంసిక్ కారణంగా బీఎస్సీ (Bsc) బయోటెక్నాలజీ చదివాను. తర్వాత ఎంఎస్సీ (Msc) JNTUలో చదివాను. Phd శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ లో జాయిన్ అయి.. సోషల్ వర్క్ నందు కమర్షియల్ సెక్స్ వర్కర్స్ & అక్రమ రవాణా మహిళల, పిల్లల బాధ‌లు గురించి పరిశోదన చేశాను. అలాగే నేను APSETలో స్టేట్ ర్యాంక్ సాధించాను. యూజీసీ నెట్ టాప్ ర్యాంక్‌తో పాటు.. జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF)లో అర్హత సాధించి నెలకి 35000 స్టైఫండ్ కేంద్రం నుంచి పొండేవాడిని. 

ఇలా చ‌దువుతూ.. సివిల్స్‌, గ్రూప్స్‌కి..

ఇలా నేను Phd చేస్తూనే సివిల్స్, గ్రూప్స్ కి చదువుకొనేవాడిని. 2016 లో సౌత్ సెంట్రల్ రైల్వే లో మొదటగా క్లర్క్ ఉద్యోగం వచ్చింది. నాకు ఇష్టం లేకపోయినా ఆర్ధిక పరిస్థితి కారణంగా.. తిరుప‌తిలో ఈ ఉద్యోగానికి జాయిన్ అయ్యాను. కానీ నాకు ఈ ఉద్యోగం సంతృప్తి లేదు. అలాగే 2017 డిసెంబర్ నందు నాకు సౌత్ వెస్ట్రన్ రైల్వేలో సూపరింటెండెంట్ ఉద్యోగం వచ్చింది. ఇది మనకి గ్రూప్-2 లాంటి కాడర్ జాబ్. తిరుపతిలో రిజైన్ చేసి బెంగళూరులో ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను.

☛ APPSC Group-1 Ranker Success : ఆ బ‌డికి వెళ్లాలంటే.. భ‌యం.. ఆ చిన్న‌ పూరి గుడిసెలో చ‌దువు.. చివ‌రికి గ్రూప్-1 ఉద్యోగం కొట్టానిలా..

మళ్లీ నా ఆలోచనలో మార్పు.. ఎందుకంటే..?
రెండు సంవత్సరాలు తర్వాత మళ్లీ నా ఆలోచనలో మార్పు. నా ఆశయం ఇది కాదు మనం ప్రజల మధ్య ఉండి వారికీ మంచి చేసే అత్యున్నత ఉద్యోగం పొంది మా నాన్న గారి కలలు నిజం చేయాలి అనుకున్నాను. 

మా నాన్నని బ్రతికించలేకపోయాం.. కానీ..

ఇంతలోపు మా నాన్న గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చి 20 రోజులు బెంగళూరు నారాయణ హృదలయంలో అడ్మిట్ చేసాం. రోజుకి రూ.1.5 ల‌క్ష‌ల చొప్పున‌ ఇలా 20 రోజులు ఉంచాం. కానీ చివరికి మా నాన్నని బ్రతికించలేకపోయాం. మా నాన్న‌కు దాదాపు రూ. 30 లక్షల వ‌ర‌కు ఖర్చు చేశాం. దీని కార‌ణంగా మాకు మళ్లీ ఆర్ధిక సమస్యలు మొదలయ్యాయి. ఒక పక్క నాన్న లేని లోటు మరోపక్క అప్పులు భారం ఏం చేయాలో తెలియక దాదాపు 16 నెలలు నిద్రలేదు. ఎవరికీ చెప్పుకోలేని బాధ‌తో నాలోనేను అనుభవించాను. నేను డీలా పడిపోతే నన్ను నమ్మిన నా కుటుంబం రోడ్డున పడుతుందని పట్టుదలతో బాధ‌ను నాలో దిగమింగుకొని మళ్లీ చదవటం ప్రారంభించాను.

☛ Three Sisters Government Jobs Success : చదువుల మ‌హారాణులు.. అక్క డీఎస్పీ.. చెల్లెలు డిప్యూటీ క‌లెక్ట‌ర్.. మ‌రో చెల్లెలు కూడా..

నా విజయంలో కీలక పాత్ర..
ఈ సమయంలో నాకు ఏపీపీఎస్సీ గ్రూప్‌-1లో వ‌రుస‌గా రెండు సార్లు విజ‌యం సాధించిన‌.. శ్రీరామచంద్ర సార్ లాంటి గైడ్ దొరికాడు. నన్ను ఈయ‌న‌ సరైన మార్గంలో నడిపించాడు. మంచి మెలుకువలు నేర్పించాడు. అలాగే నా విజయంలో ఈయ‌న‌ కీలక పాత్ర పోషించాడు. చివరకి నేను గ్రూప్-1లో విజయం సాధించి అసిస్టెంట్ కమీషనర్‌గా కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యాను. 

☛ ఏపీపీఎస్సీ గ్రూప్స్ 1 &2 స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ గెడైన్స్, ప్రీవియస్ పేపర్స్, విజేతల అనుభవాలు, సలహాలు.. ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి

గ్రూప్‌-1లో విజ‌యం సాధించా.. కానీ నాకు మాత్రం ఒకటే లోటు..

మా ఊరు మండలం జిల్లా మొత్తం నాకు కావలసిన వాళ్ళు సంతోషపడినారు. కానీ నాకు మాత్రం ఒకటే లోటు ఈ సమయంలో మా నాన్న లేరని, ఎలాగైన‌ ఇంతటితో ఆగకుండా ఐఏఎస్ సాధించి మా నాన్న కలను సాకరం చేస్తాను. మా నాన్న జ్ఞాపర్థం అనాధశ్రమం నిర్మించాలని.., అలాగే తల్లిదండ్రులు లేని పిల్లల చదువులకి నా వంతు సహాయం చేయాలనీ అనుకుంటున్నాను. నిరుద్యోగులకి నేను చెప్పడలచుకున్నది ఒక్కటే మన సంకల్పం గొప్పది అయితే మనకి ఇలాంటి కష్టాలు వచ్చినా మన గమ్యాన్ని చేరుకోగలం.

☛ APPSC Group 1 Ranker Mutyala Sowmya Interview : మొద‌టి ప్ర‌య‌త్నంలోనే గ్రూప్‌-1 ఉద్యోగం సాధించానిలా.. నేను చ‌దివిన పుస్త‌కాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు..
సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ఇచ్చే క‌రెంట్ అఫైర్స్‌, సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ఇచ్చే మాక్ టెస్టులు, సాక్షి ఎడిటరియం కాలమ్స్ నా విజ‌యంలో ప్రముఖ పాత్ర నా విజయంలో పోషించాయి. అలాగే నేను యోజన, కురుక్షేత్ర బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్, డైలీ న్యూస్ పేపర్స్ నేను క్రమం తప్పకుండ చదివాను.

#Tags