DSP Inspire Success Story : ఈ లేడీ పోలీస్ కేసు టేకప్ చేశారంటే.. నిందితుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తినట్లే.. ఈమె సక్సెస్ స్టోరీ ఇదే..
ఈమె గుంటూరు ఏఎస్పీ సుప్రజ. బాధితుల పక్షాన నిలిచి, వారి కన్నీళ్లు తుడిచి, న్యాయం చేయడమే కాకుండా సిబ్బందికి అన్నివిషయాల్లో చోదోడు వాదోడుగా ఉంటూ ‘సుప్రజ’ల పోలీస్‌గా పేరు గడించారు. ఈ నేపథ్యంలో ఏఎస్పీ సుప్రజ సక్సెస్ స్టోరీ మీకోసం..
కేసు విచారణ చేపడితే.. నిందితులకు శిక్షపడే వరకు..
ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం.. సిబ్బంది కష్టసుఖాల్లో వారికి అండగా నిలుస్తారు.. అడ్మినిస్ట్రేషన్ లో ఆమె పెట్టింది పేరు.. కేసు విచారణ చేపడితే.. నిందితులకు శిక్షపడే వరకు విశ్రమించరు. అవినీతి మచ్చ లేకుండా.. మూడేళ్ల పాటు జిల్లా ప్రజలకు ఎన్నో సేవలందించిన గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ కె.సుప్రజ అటు అధికారులు.. సిబ్బంది.. ఇటు ప్రజల నుంచి ఎన్నో మన్ననలు పొందారు. జిల్లా అడ్మిన్ ఏఎస్పీగా ఉన్న సుప్రజను ఏసీబీకి బదిలీ చేస్తూ.. జనవరి 31వ తేదీన(బుధవారం) ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరు ఈస్ట్, వెస్ట్, ట్రాఫిక్ డీఎస్పీగా పనిచేయటంతో పాటు, ఏఎస్పీగా ఆమె సమర్ధవంతగా విధులు నిర్వర్తించారు. అనేక కేసుల్లో విచారణాధికారిగా బాధితుల పక్షాన నిలిచి, నిందితులకు జైలు శిక్షలు పడేలా కృషి చేశారు.
కరోనా కల్లోల సమయంలో..
2020లో కోవిడ్ సమయంలో గుంటూరు జిల్లా అడ్మిన్ ఏఎస్పీగా కె.సుప్రజ బాధ్యతలు స్వీకరించారు. కరోనా కల్లోల సమయంలో సిబ్బందికి రావాల్సిన పలు నగదు అంశాల్లో ఆమె కీలకంగా వ్యవహరించి అవి వారికి చెందేలా చూశారు. గుంటూరు జిల్లా రూరల్, అర్బన్ విభజన అంశంలో కీలక పాత్ర పోషించారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా పూర్తిస్థాయిలో దృష్టి సారించి, మన్ననలు పొందారు.
ఇలాంటి కేసును కూడా..
జిల్లా అడ్మిన్‌గా బాధ్యతలు చేపట్టక ముందు అనేక కేసుల్లో విచారణాధికారిగా ఉన్న ఏఎస్పీ సుప్రజ నిందితులకు శిక్షలు పడటంలో ఎంతో పట్టుదలతో ముందుకు సాగారు. గుంటూరు ఈస్ట్ డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో నేపాల్‌కు చెందిన ఒక కుటుంబం స్వెట్టర్లు అమ్ముకునేందుకు గుంటూరుకు వచ్చిన సమయంలో వారి ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ కుటుంబం స్థానిక వ్యక్తులకు భయపడి ఇక్కడ నుంచి నేపాల్‌కు తిరిగి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ సుప్రజ, ఇక్కడి సిబ్బందిని నేపాల్‌కు పంపి, వారిని తిరిగి ఇక్కడకు పిలిపించి కేసు నమోదు చేయటంతో పాటు, నిందితుడి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కృషి చేశారు.
82 మంది నిందితులను.. ఒకే సారి..
అలాగే లాలాపేట పీఎస్ పరిధిలో ఒక వృద్ధుడు చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడేలా ఆమె కేసును నడిపించారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మేడికొండూరు బాలిక కిడ్నాప్, రేప్ కేసులో నెలల తరబడి పని చేసి స్వయంగా రంగంలోకి దిగిన ఏఎస్పీ 82 మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. వెస్ట్ డీఎస్పీగా ఉన్న సమయంలో చేపట్టిన ఈ కేసులో పురోగతి సాధించటంతో అడ్మిన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా, కేసు నిర్వహణ, చార్జిటు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించటంతో పాటు, ఆమెను అభినందించింది.
1250కిపైగా బైండోవర్ చేసి వెన్నులో వణుకు..
మూడేళ్ల పాటు గుంటూరు అడ్మిన్ ఏఎస్పీగా పనిచేసిన సుప్రజ.. ఒక మూడు నెలల పాటు గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఆ సమయంలో గుంటూరు రేంజ్ ఐజీ జి.పాలరాజు ఆదేశాలతో ఆమె చేపట్టిన అడ్మిని్రస్టేషన్ అద్భుతమనే చెప్పాలి. జిల్లాలో ఉన్న 1600 రౌడీషీటర్లుకు సంబంధించి, ఆధిపత్య పోరు, నేరాలు జరుగుతున్న సమయంలో స్వయంగా ప్రతి స్టేషన్‌కు వెళ్లిన ఆమె రౌడీషీటర్‌లకు తమదైన శైలిలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న 8 మంది రౌడీషీటర్లును జిల్లా బహిష్కరణ చేసి, వారిపై పీడీ యాక్టును ప్రయోగించిన ఘనత ఏఎస్పీ సుప్రజదే. వారిలో 1250కిపైగా బైండోవర్ చేసి వెన్నులో వణుకు పుట్టించారు.
☛ Sirisha, SI : నన్ను ఆఫ్‌ట్రాల్ కానిస్టేబుల్ అన్న ఆ ఎస్పీతోనే..
రాత్రి పది గంటలకల్లా దుకాణాలను మూసి వేయించడంతో పాటు, విజుబుల్ పోలీసింగ్ నిర్వహించి, అర్ధరాత్రి ప్రయాణాలు చేసే ఎంతోమందికి ధైర్యాన్ని కల్పించారు. కేవలం ఆ మూడు నెలల వ్యవధిలో 3 వేల మందికిపైగా బహిరంగ మద్యపానానికి పాల్పడుతున్న మందుబాబులను పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఓ కేసు విషయంలో అన్నీ తానై..
పన్నెండేళ్ల బాలికకు తీరని అన్యాయం.. కొంతమంది మోసగాళ్ల చేతికి చిక్కి వ్యభిచార కూపంలో మగ్గిపోయింది. ఆఖరుకు ఎలాగో తప్పించుకుని ఒక మహిళా అధికారి వద్దకు చేరుకుంది. బాలిక పట్ల మృగాళ్లు వ్యవహరించిన తీరు.. పలువురు మహిళలు చేయించిన అఘాయిత్యాలను చూసిన ఆ అధికారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎలాగైనా సరే నిందితులకు శిక్షలు పడేదాక విశ్రమించకూడదని నిర్ణయం తీసుకున్నారు. కేసు విచారణలో చూపిన ప్రతిభకు గాను గుంటూరు జిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ కొర్లకుంట సుప్రజకు కేంద్ర ప్రభుత్వం ‘సెంట్రల్ హోం మినిస్టర్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్’ అవార్డును ప్రకటించింది. గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గతేడాది 12 ఏళ్ల బాలికను అపహరించి, వ్యభిచార కూపంలోకి దించిన కేసు విచారణ బాధ్యతలను అప్పటి వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా ఉన్న ప్రస్తుత ఏఎస్పీ కె.సుప్రజకు అప్పగించారు.
అన్నీ తానై ఏపీ, తెలంగాణ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వయంగా విచారణ జరిపారు. తన నాలుగు నెలల పసిబిడ్డను తీసుకుని.. ఆఖరుకు ఆమె ప్రయాణిస్తున్న వాహనంలోనే ఆ చిన్నారికి ఊయల కట్టి వెళ్లిన పరిస్థితులున్నాయి. కేసులో వ్యభిచారం చేయించిన నిర్వాహకులు, వ్యభిచారానికి పాల్పడిన 80 మంది నిందితులను అరెస్ట్ చేశారు. డీఎస్పీ నుంచి ఏఎస్పీగా పదోన్నతి పొందాక సైతం ఈ కేసును పూర్తిస్థాయిలో సుప్రజతోనే విచారణ చేయించాలని కోర్టు ఆదేశించటంతో పాటు, కేసులో భారీ పురోగతి సాధించిన ఆమెను న్యాయస్థానం అభినందించింది. ఈ కేసులో సుమారు 500 పేజీల చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. మరో బాలికకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్న పట్టుదలతో ఉన్నతాధికారుల సహకారంతో విచారణ చేసినట్టు ఏఎస్పీ సుప్రజ చెప్పారు.
విధి నిర్వహిణలో ఎన్నో అవార్డులు... ప్రశంసలు
విధి నిర్వహిణలో విశేష ప్రతిభ కనబరిచి.. అవినీతి మచ్చలేని అధికారిగా ఏఎస్పీ సుప్రజ మంచిపేరు సంపాదించుకున్నారు. నేపాల్ చిన్నారి రేప్ కేసు ఘటనలో స్వయంగా నేపాల్ ప్రభుత్వ ప్రతినిధులు గుంటూరు వచ్చి ఆమెను సత్కరించటంతో పాటు, అక్కడ ఆమెకు ప్రకటించిన అవార్డును అందజేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ‘ది బెస్ట్ ఇన్విస్టిగేషన్’ అవార్డును అందుకున్నారు. ముఖ్యంగా బాలికలు, మహిళలకు సంబంధించి చేపట్టిన కేసుల్లో విశేష ప్రతిభ చూపిన ఆమె ఆరుగురికి యావజ్జీవ శిక్షలు పడేందుకు పాటుపడ్డారు. అనేక అవార్డులు చేపట్టి.. విధి నిర్వహణలో ఎలా ఉండాలో చేసి చూపించారు.
DSP Yegireddi Prasad Rao : ఆయన కష్టాలను కళ్లారా చూశాడు..డీఎస్పీ అయ్యాడు..
2015లో గ్రూప్-1 అధికారిగా విధుల్లోకి..
ఆడపిల్ల పెద్ద చదువులు చదివితే, అందులోనూ పోలీసు అయితే పెళ్లి సంబంధాలు రావని ఎవరెంతగా నిరుత్సాహపరిచినా లక్ష్య పెట్టకుండా కష్టపడి చదివారు. 2015లో గ్రూప్-1 అధికారిగా విధుల్లో చేరారు. చేరిన తొలి రోజు నుంచే సామాన్యులకు రక్షణగా నిలిచారు. ఏడు నెలల వ్యవధిలో 74 మందిపై రౌడీషీట్లు తెరిచి నేరస్థులకు సింహస్వప్నంగా నిలిచారు. ఉత్తమ పిసిఆర్ అవార్డు విజేత అయ్యారు.
గర్భిణిగా ఉండి కూడా...
కడప జిల్లా నందలూరుకు చెందిన కోర్లకుంట సుప్రజ.. గర్భిణిగా ఉండి కూడా కరోనాకు వెరవకుండా సుప్రజాసేవ నిర్వహించినందుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ గౌతమ్ నవాంగ్ నుంచి ఉత్తమ డీఎస్పీగా అవార్డు అందుకున్నారు.
రెండు ఘటనల గురించి..
రెండు ఘటనల గురించి చెబుతాను. కర్నూలు జిల్లాలో పనిచేసేటప్పుడు గ్రామ సర్పంచ్ తన భార్య తప్పిపోయిందని ఫిర్యాదు చేశాడు. నాకెందుకో అతని మీద అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయించాను. అతనికున్న రాజకీయ పలుకుబడితో అధికారులు, నాయకులు నాపై ఒత్తిడి తెచ్చినప్పటికీ, అతని నేరాలను నిరూపించి అరెస్టు చేశాము. గుంటూరు ఈస్ట్‌లో విధులు నిర్వహించేటప్పుడు నా కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న ఓ కాల్‌మనీ మోసగాడిని అరెస్టు చేసి అతడి దగ్గర నుంచి 40 లక్షలు రికవరీ చేసాను. అప్పుడు అనేక ఒత్తిళ్లు ఎదురైనా వెనక్కి తగ్గలేదు.
కర్నూలు జిల్లాలో అడవుల్లో..
గుంటూరు ఈస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఐదు నెలల గర్భిణిని. పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరుగుతున్న బస్సు గుంటూరు దాటి వెళ్లిపోతోందని విన్నాను. వాహనంలో వేగంగా ఛేజింగ్ చేసి బస్సు ఆపించి, కిటికీలో నుంచి దూకి పారిపోతున్న నిందితులను వెంటాడి పట్టుకున్నాము. నలభై కిలోల గంజారుు స్వాధీనం చేసుకున్నాము. కర్నూలు జిల్లాలో అడవుల్లో పలు నక్సలైట్ డంప్‌లు స్వాధీనం చేసుకునే సమయంలోనూ కొన్ని సాహసాలు చేయాల్సి వచ్చింది.
ఓ యువతి ఏడుస్తూ..
నా ప్రసవం అనంతరం ఓ రాత్రి పదిన్నర సమయంలో కార్యాలయంలో ఉండగా ‘బాబు పాల కోసం ఏడుస్తున్నాడు (బాబుకు నా పాలే ఫీడ్ చేస్తాను). వెంటనే రమ్మని’ అమ్మ ఫోన్ చేయడంతో బయటకు వచ్చాను. ఓ యువతి ఏడుస్తూ వాకిట్లో కనిపించింది. లోపలకు పిలిచాను. భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింట్లో ఉన్నానని, అయినా నిఘా పెట్టి వేధిస్తున్నాడని ఆమె చెప్పడంతో లోతుగా విచారణ జరిపి ఆమె భర్తను అరెస్ట్ చేశాం. అలాగే ఓ 80 సంవత్సరాల వృద్ధుడు ఒకటిన్నర సంవత్సరాల బాలికపై దారుణంగా లైంగిక దాడి చేసిన ఘటనలో అతడిని అరెస్టు చేశాము. దిశా పోలీస్టేషన్ డిఎస్పీగా పలువురు మహిళలకు అండగా నిలబడ్డ సంఘటనలు కూడా అనేకం సంతృప్తినిచ్చాయి.
నా భర్త ఐఆర్‌ఎస్ ప్రేమ్‌కుమార్ సహకారం వల్లనే..
లాక్‌డౌన్ సమయంలో.. గర్భిణిగా ఉండడంతోపాటు ఇంట్లో రెండు సంవత్సరాల కుమార్తె ఉన్నా ఎన్నో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలోనూ పని చేశాను. ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ వార్డులు, అనాథల షెల్టర్ ల ఏర్పాట్ల పర్యవేక్షణ, నిర్వహణ నా దేశానికి చేసిన సేవగా భావిస్తున్నాను. ఇక నేను నా విధులను సక్రమంగా నిర్వర్తించగలుగుతున్నానంటే అదంతా నా భర్త ఐఆర్‌ఎస్ ప్రేమ్‌కుమార్, కుటుంబ సభ్యుల సహకారం వల్లనే అన్నది నిజం.
Tags
- dsp supraja guntur
- dsp supraja solve cases news
- dsp supraja inspire story
- dsp supraja family
- dsp supraja real life story
- dsp supraja success story
- dsp supraja motivational story
- Competitive Exams Success Stories
- Success Stroy
- Success Story
- police officer success stroy
- police officer success story in telugu
- guntur dsp supraja solve cases
- guntur dsp supraja solve cases news in telugu
- Guntur DSP Supraja Perecherla Minor Girl Incident
- Guntur DSP Supraja Story
- Guntur DSP Supraja News
- Failure to Success Story
- Inspire
- Sakshi Education Success Stories
- Success Story