Bathukamma Festival History : బతుకమ్మ పండుగ చరిత్ర ఇదే..!
బతుకమ్మ సంబరాలు ఏటా పెతర అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.
తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా 2014 అక్టోబర్ 2న ఈ పండుగను అధికారికంగా నిర్వహించింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు ‘బతుకమ్మ’ పండుగను జరుపుకొని ఈ పండుగ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇప్పుడిదొక బృహత్ పండుగ.
ఇప్పటిదాకా బతుకమ్మ పండుగ మూలాలు వెలుగులోకి రాలేదు. ఈ విషయాన్ని చరిత్రకారులు, సాహితీవేత్తలు ధ్రువీకరించారు. శతాబ్దాలుగా బతుకమ్మ పండుగపై ఎన్నో జానపద గాథలు, పాటలు తెలంగాణలో ప్రచారంలో ఉన్నాయి. ఎందరో తెలుగు రీసెర్చ్ స్కాలర్లు బతుకమ్మ పండుగ ప్రాధాన్యతపై ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఈ పండుగను ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు? ఎలా మొదలైంది? లాంటి ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. ప్రపంచంలోనే ఏకైక పూల పండుగ, స్త్రీల కోసం ఉన్న పండుగ బతుకమ్మే.
కొందరు సాహితీవేత్తలు ఈ పండుగలో జైనమత అడుగుజాడలను, కాకతీయులతో ఉన్న సంబంధాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ అవి ప్రజామోదం పొందలేదు. కాకతీయులు కొంతకాలం ఆంధ్ర దేశం అంతటినీ పాలించినా ఈ పండుగ తెలంగాణాకే పరిమితం కావడం అర్థం కాని విషయం. ‘బతుకమ్మ’ చరిత్ర మూలాలు కనుక్కోవాలంటే వెయ్యేళ్ల క్రితం ‘రాజ్యపాలన చేసిన కల్యాణి చాళుక్యుల, చోళుల చరిత్రను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
బతుకమ్మ చరిత్ర..
973లో రాష్ర్టకూటుల సామంతుడైన రెండో తైలపుడు చివరి రాష్ర్టకూటరాజైన ‘కర్కుడు-2’ను ఓడించి స్వతంత్ర కల్యాణీ చాళుక్య రాజ్యం స్థాపించాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతం ఇతడి ఆధీనంలో ఉండేది. ఈ కాలంలోనే వేములవాడ చాళుక్య రాజ్యంలోని వేములవాడ ‘రాజేశ్వరాలయం’ అప్పటికే ప్రసిద్ధి చెందింది. తెలంగాణ ప్రజల ఇష్ట దైవంగా రాజేశ్వరుడు పూజలు అందుకునేవాడు. రెండో అరికేసరి(930-55) వేయించిన ‘దానశాసనం’లో ఈ దేవాలయ ప్రసక్తి ఉంది. వేములవాడ చాళుక్య రాజులు రాష్ర్టకూటుల సామంతులు. అందువల్ల చోళులు, రాష్ర్టకూటుల మధ్య యుద్ధం జరిగితే వీరు రాష్ర్టకూటుల పక్షం వహించేవారు. ఈ విధంగా రెండో పరాంతకుడు వేములవాడలోని రాజేశ్వరాలయాన్ని కూడా సందర్శించాడని శాసనాల్లో పేర్కొన్నారు.
చోళుల కాలం నాటి చరిత్ర :
రాజేంద్ర చోళుడు వేములవాడ దేవాలయాన్ని ధ్వంసం చేసిన అనంతరం వేములవాడ రాజేశ్వరుడి(బృహదీశ్వరుడి) మాహాత్మ్యం తెలుసుకుని లింగరూపంలో ఉన్న రాజేశ్వరుణ్ని కంచి నగరానికి తీసుకెళ్లాడు. తన విజయానికి గుర్తుగా తండ్రి అయిన రాజరాజచోళునికి ఈ లింగాన్ని బహూకరించాడని తెలుస్తోంది. 1006లో ఈ లింగానికి(బృహదీశ్వరుడికి) తంజావూరులో దేవాలయ నిర్మాణం ప్రారంభించాడు. 1010లో లింగ ప్రతిష్ఠాపన చేసి, గోపుర కలశాభిషేకాలు నిర్వహించినట్లు శాసనాల ద్వారా స్పష్టమవుతోంది.
రాజరాజచోళుడు బృహదీశ్వరుడికి కృతజ్ఞతా పూర్వకంగా బంగారు కమలాలను సమర్పించాడు. ఈ బృహదీశ్వరాలయాన్ని వేములవాడ చాళుక్య దేశంపై జరిగిన దండయాత్రలో దోచుకున్న ధనంతో నిర్మించామని తమిళ శాసనాల్లో చోళరాజులు ప్రకటించుకున్నారు.
వేములవాడ భీమన్న గుడిలోని శివలింగం, బృహదీశ్వరాలయంలోని శివలింగం ఒకేలా ఉంటాయి. తంజావురులోని బృహదీశ్వరాలయం దక్షిణ భారతదేశంలోనే ఎత్తయిన ‘విమానం’(విమానం అంటే గోపురం లేదా దేవాలయ ద్వారం) ఉన్న దేవాలయం దీన్ని ‘ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.
బతుకమ్మ పండుగకు బృహదీశ్వరాలయం, వేములవాడ రాజన్న ఆలయాలతో సంబంధం ఏమిటి? చోళ, చాళుక్యుల చరిత్రను ఎందుకు ప్రస్తావించామనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వేములవాడ నుంచి శివలింగాన్ని దౌర్జన్యంగా తంజావూరుకు తరలించి, అక్కడ గొప్ప దేవాలయం నిర్మించడం చోళులకు గర్వకారణమైన విషయమే కావొచ్చు. కానీ అది తెలంగాణ ప్రజలకు బాధను కలిగించింది. చోళులు బృహదేశ్వరుడిని తీసుకెళ్లినందుకు నిరసనగా సృష్టికి కారణభూతమైన శక్తిస్వరూపాన్ని బృహతమ్మ (బతుకమ్మ)గా పూజించారు. అదే ‘బృహత్’ బృహతమ్మ లేదా బతుకమ్మగా ప్రాచుర్యం పొందింది.
బృహత్ అమ్మ, బ్రతుకమ్మ..
బతుకమ్మను బృహతమ్మ రూపాంతరంగా భావిస్తూ తంజావూరు దేవాలయానికి బృహత్ అనే పదం వినియోగించారు. బృహత్ అనే పదాన్ని బృహతమ్మ (గొప్ప అమ్మ) అనే పేరుతో ఉపయోగించారు.‘బృహత్ కథ’ అనే సంస్కృత గ్రంథం భారతీయ ప్రాచీన గాథలకు, అనేక కథలు, కావ్యాలు, నాటకాలకు మూలమైంది. దీన్ని రచించిన గుణాఢ్యుడు (మెదక్ జిల్లా) తెలంగాణ తొలికవి. బృహత్ కథను పైశాచీ నామంతో రచించాడు.
రెండో శతాబ్దంలో ‘పిరంగదై’ పేరుతో తమిళంలోకి కూడా ఈ గ్రంథాన్ని అనువదించారు. రామాయణం, మహాభారతంతో సమాన ప్రతిపత్తి ఉన్న గొప్ప గ్రంథం ఇది. అనేక మంది కవులకు ‘బృహత్‌కథ’ కావ్య వస్తువుగా ఉండేది. ప్రాచీనమైన బృహత్‌ధారణ ఉపనిషత్ లేదా బృహదారణ్య ఉపనిషత్ పేరులో కూడా బృహత్ అనే పద వినియోగం కనిపిస్తుంది. బృహత్ పదాన్నే బృహతమ్మ లేదా బతుకమ్మగా ప్రజలు ఉపయోగించారని భావించాలి.
బృహతమ్మ(బతుకమ్మ) ఉద్యమం..
రాజేంద్రచోళుడు వేములవాడ బృహత్ శివలింగాన్ని తంజావూరుకు తరలించాక తెలంగాణ ప్రజలు తమ ఆక్రోశాన్ని ఒక ఉద్యమంగా మార్చి చోళ రాజులకు తమ నిరసనను తెలిపే ప్రయత్నమే ‘బతుకమ్మ’ సృష్టికి దారితీసింది. తెలంగాణ నుంచి లింగాకారమైన శివుడు వెళ్లిపోయిన తర్వాత ఇక్కడున్న పార్వతిని ఊరడించే ప్రయత్నంలో భాగంగా పూలతో(సృష్టి) మేరు పర్వతంలా బతుకమ్మను పేర్చారు. దానిపై పసుపు గౌరమ్మను రూపొందించి, దసరా సందర్భంలో తొమ్మిది రోజులు ఆటపాటలతో పదేపదే తలుస్తూ.. చివరగా తిరిగి రమ్మంటూ నీళ్లలో వదలడం ఒక పండుగగా మారింది.
బహుశా దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక అకృత్యానికి, అన్యాయానికి అహింసా పూర్వక సత్యాగ్రహాలతో నిరసన తెలిపిన ఏకైక ప్రక్రియ బతుకమ్మ.
బతుకమ్మ పాట..
బతుకమ్మ పండుగ సందర్భంగా వివిధ రకాల పాటలు పాడతారు. అందులో ఒక ప్రాచీన చోళరాజును ప్రస్తుతించడం కనిపిస్తుంది. చోళదేశ రాజైన ధర్మాంగుడు నూరునోములు నోమి నూరు మందిని పొందాడట. ఆ పాటలోని ప్రథమార్థం ఇలా ఉంటుంది..
‘శ్రీ లక్ష్మిదేవియు ఉయ్యాలో సృష్టి బతుకమ్మయే ఉయ్యాలో
పుట్టినా రీతి జెప్పే ఉయ్యాలో భట్టు నరసింహాకవి ఉయ్యాలో
ధరచోళదేశము ఉయ్యాలో ధర్మాంగుడనరాజు ఉయ్యాలో
ఆ రాజు భార్యయు ఉయ్యాలో అది సత్యవతియండ్రు ఉయ్యాలో
నూరు నోములు నోమి ఉయ్యాలో నూరు మందిని గాంచే ఉయ్యాలో
వారు శూరులయ్యి ఉయ్యాలో వైరులచే మృతురైరి ఉయ్యాలో...
ఈ పాటలో కనిపించిన ‘చోళదేశం, నూరునోముల సృష్టి, బతుకమ్మయే’ అనే పదాలు బతుకమ్మ ఉద్యమానికి దగ్గరగా ఉన్నాయి. వేములవాడ బృహదీశ్వరుణ్ని తరలించింది చోళరాజు. బహుశా రాజరాజచోళుడి తండ్రి రెండో పరాంతక చోళుడు రాజేశ్వర నోము నోచి దేవుడి అనుగ్రహంతో పొందిన కుమారుడికి దేవుడి పేరుమీద ‘రాజరాజ’ అని నామకరణం చేసి ఉండాలి. మరోచోట పూబోణి పదం బతుకమ్మకు ప్రతిరూపంగా కనిపిస్తుంది. బహుశా బతుకమ్మ ఉద్యమ తీవ్రతను గ్రహించిన చోళరాజులు నరసింహ కవి లాంటి కవులతో వారికి అనుగుణంగా తెలంగాణ ప్రజల ఉక్రోషాన్ని మరిపించేలా ఉయ్యాల పాటలను రాయించి ప్రజల మధ్య వ్యాప్తి చెందించారని భావించవచ్చు. ఇన్నేళ్ల బతుకమ్మ పాటల్లో చోళుల కథ జీవించి ఉండటం మరో విశేషం. దీన్ని సాహిత్య పరమైన రుజువుగా భావించవచ్చు.
ప్రతాపరుద్రుడి కాలంలో కాకతీయులు మేడారం రాజుతో యుద్ధం చేశారు. సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజుకు మద్దతుగా.. తెలంగాణ ప్రజలు వారిని దేవతలుగా భావించి మరో పద్ధతిలో సత్యాగ్రహాన్ని వెలిబుచ్చారు. రెండేళ్లకు ఒకసారి లక్షల సంఖ్యలో ఒక చోట చేరి దాదాపు 700 ఏళ్ల తర్వాత కూడా తమ ఆగ్రహాన్ని ఒక తీర్థం రూపంలో వెలిబుచ్చడం తెలంగాణ చరిత్రలో మరో మరుపురాని సంఘటన. బతుకమ్మ ఉత్సవమే సమ్మక్క-సారక్క జాతరకు మూలాధారంగా భావించవచ్చు. మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది.
చరిత్రలో ఏ అంశమైనా సంపూర్ణ నిర్ధారితం కానీ, సత్యం కానీ కాకపోవచ్చు. తగిన ఆధారాలు దొరకనప్పుడు కొంత ఊహ ఉంటుంది. ఊహకు ఓ ఆధారం ఉంటుంది. ఆధారం మీద ఓ ఊహ ఉంటుంది. కాబట్టి వెయ్యేళ్ల నాటి బృహతమ్మనే నేటి బతుకమ్మ. ఈ బతుకమ్మనే తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసింది. తెలంగాణ ప్రజలకు ఆరాధ్య దైవంగా కలకాలం నిలిచిపోయింది.
బతుకమ్మ.. తొమ్మిది రోజులు.. తొమ్మిది నైవేద్యాలు ఇలా..
☛ మొదటి రోజు- ఎంగిలిపూల బతుకమ్మ
☛ రెండో రోజు- అటుకుల బతుకమ్మ
☛ మూడో రోజు- ముద్దపప్పు బతుకమ్మ
☛నాలుగో రోజు- నానే బియ్యం బతుకమ్మ
☛ ఐదో రోజు- అట్ల బతుకమ్మ
☛ ఆరవ రోజు- అలిగిన బతుకమ్మ
☛ ఏడో రోజు- వేపకాయల బతుకమ్మ
☛ఎనిమిదవ రోజు- వెన్నముద్దల బతుకమ్మ
☛ తొమ్మిదో రోజు- సద్దుల బతుకమ్మ
ముఖ్యంగా పల్లెల్లో అయితే పోటా పోటీగా భిన్న రుచులను తయారు చేసి మరీ వడ్డిస్తారు. ఇంట్లో చేసుకున్న ఏ వంటకమయినా.. మరో నలుగురికి పంచి వారితో తినిపించడం బతుకమ్మ పండుగలో కనిపించే సంతోషకరమైన సన్నివేశం. తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరంలో కనిపించే ముఖ్యమైన ప్రసాదాలు ఇవి.
మొదటి రోజు : ఎంగిలిపూల బతుకమ్మ..
బతుకమ్మ మొదటి రోజు పెతర అమావాస్య నాడు జరుపుకొంటారు. ఆరోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని తలచి మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా వ్యవహరిస్తారు. ఆరోజు నువ్వుల సద్దిని అందరితో పంచుకుంటారు.
రెండో రోజు : అటుకుల బతుకమ్మ..
రెండో రోజు అటుకుల ప్రసాదం చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు కలిపి అమ్మవారికి ఇష్టంగా వడ్డించే నైవేద్యం ఇది.
మూడో రోజు : ముద్దపప్పు బతుకమ్మ..
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్ద పప్పు, పాలు, బెల్లంతో వేడివేడిగా నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
నాలుగో రోజు : నానబియ్యం బతుకమ్మ..
నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ. నాన బెట్టిన బియ్యంను పాలు, బెల్లంతో కలిపి ఉడికింది ప్రసాదంగా తయారు చేస్తారు.
ఐదో రోజు : అట్ల బతుకమ్మ..
ఐదోరోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశలను అమ్మవారికి నైవేద్యంగా వడ్డిస్తారు.
ఆరవ రోజు : అలిగిన బతుకమ్మ
ఆరో రోజు అలిగిన బతుకమ్మగా జరుపుకొంటారు. ఆరోజు అమ్మవారికి అలకగా చెప్పుకుంటారు. ఉపవాసం పాటిస్తారు
ఏడో రోజు : వేపకాయల బతుకమ్మ..
ఏడోరోజు వేపకాయల బతుకమ్మ. బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఎనిమిదవ రోజు : వెన్నెముద్దల బతుకమ్మ..
ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి వెన్నముద్దల నైవేద్యంగా వడ్డిస్తారు.
తొమ్మిదో రోజు : సద్దుల బతుకమ్మ..
బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజును సద్దుల బతుకమ్మగా జరుపుకొంటారు. తొమ్మిదోరోజు పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు.