Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రించిన అవార్డులు ఇవే..

దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రతిష్ఠాత్మక అవార్డులైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్‌ ప్రకటించింది. వివిధ రంగాల్లో అందించిన సేవలకు గాను ఈ గౌరవం లభిస్తుంది. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వరించింది.

అయితే తెలుగు సినీరంగంలో ఈ అవార్డ్ ఇప్పటివరకు ఒక్కరికే మాత్రమే వచ్చింది. ఆయనెవరో కాదు నట దిగ్గజం, దివంగత అక్కినేని నాగేశ్వరరావు. తాజాగా ఇప్పుడు మన మెగాస్టార్‌ను వరించింది.  దీంతో అయితే దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఈ అవార్డు కేవలం ఇద్దరికీ మాత్రమే దక్కింది.

తెలుగు సినీ చరిత్రలో తన పేరును శాశ్వతంగా..
మొదట 2011లో నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు దక్కింది. ఈ లెజెండరీ నటుడు 67 ఏళ్ల సినీ కెరీర్‌లో 150కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగు సినీ చరిత్రలో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్న మహోన్నత వ్యక్తి అక్కినేని. ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ భూషణ్ అవార్డు, పద్మశ్రీ అవార్డు, కలిమామణి, రఘుపతి వెంకయ్య అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (7 సార్లు), జాతీయ స్థాయిలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాళిదాసు లాంటి ఎన్నో విలువైన అవార్డులను అందుకున్నారు. 

మెగాస్టార్‌కు వ‌చ్చిన అవార్డులు ఇవే..

తాజాగా ఆ ఘనత కేవలం మెగాస్టార్‌కు మాత్రమే దక్కింది. తెలుగు సినీ రంగంలో ఏఎన్‌ఆర్‌ తర్వాత అరుదైన ఘనత దక్కించుకున్న నటుడిగా చిరంజీవి నిలిచారు. అంతకుముందే మెగాస్టార్‌కు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. సినీ రంగానికి మెగాస్టార్ చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది. ఇక 1987లో స్వయం కృషి సినిమా, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇంద్ర సినిమాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నారు. అలాగే శుభలేఖ (1982), విజేత (1985), ఆపద్బాంధవుడు (1992), ముఠామేస్త్రి (1993), స్నేహంకోసం (1999), ఇంద్ర (2002), శంకర్ దాదా ఎంబీబీఎస్ (2004) చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 2006లో సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవి స్పెషల్ అవార్డును ఫిలింఫేర్ అవార్డుల్లో భాగంగా అందుకున్నారు. అంతే కాకుండా 2010లో ఆయనకు ఫిలింఫేర్ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006లో చిరంజీవికి ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ..

'కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. ఈ సమయంలో నాకు ఏం మాట్లాడాలో కూడా మాటలు రావడం లేదు. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబ  సభ్యుల అండ దండలు, నీడలా నాతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగా నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నా.' అంటూ భావోద్వేగానికి గురయ్యారు. వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. 'నాకు దక్కిన ఈ గౌరవం మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ  ఆప్యాయతల కు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను.

నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి  నా శక్తిమేరకు ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరం అయినప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. మీరు నా పై చూపిస్తున్నకొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తుంది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది. నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి,  ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు' అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇది చూసిన అభిమానులు మెగాస్టార్‌కు అభినందనలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

#Tags