Climate Change: మానవ జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్న వాతావ'రణం'.. నిరాశ్రయులవనున్న 4.50 కోట్ల మంది!!

వాతావరణ మార్పులు మానవ జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి.

కట్టుబట్టలతో ఆవాసాలను వదులుకుని వలసలు పట్టాల్సిన దుస్థితిలోకి నెట్టేస్తున్నాయి. భారతదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు గ్లోబల్‌ వార్మింగ్‌ దుష్ప్రభావాల బారిన పడుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

అధిక ఉష్ణోగ్రతలు, అనావృష్టి, సముద్ర మట్టం పెరుగుదల, వరదలు, ఇతర కాలుష్యాల విపత్తుల కారణంగా ఉన్న ప్రాంతాలను వదులుకుని వలస దారులు వెతుక్కుంటున్నారు. 2019లో దాదాపు 50 లక్షల మంది దేశంలో వివిధ ప్రదేశాల్లో తలదాచుకున్నట్టు గ్లోబల్‌ రిపోర్ట్‌ ఆన్‌ ఇంటర్నల్‌ డిస్‌ప్లేస్‌మెంట్‌ నివేదిక పేర్కొంది. 

2050 నాటికి 4.50 కోట్ల మంది నిరాశ్రయులు..
2050 నాటికి 4.50 కోట్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యే అవకాశం ఉందని క్లైమేట్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ – దక్షిణాసియా నివేదిక తాజాగా ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. 2021 – 22 నుంచి దేశంలో గ్లోబల్‌ వార్మింగ్‌ 11 శాతం పెరిగిందని అమెరికాలోని కొలరాడోకు చెందిన యేల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ క్లైమేట్‌ కమ్యూనికేషన్‌ రిసెర్చ్‌ సంస్థ ప్రకటించింది. 

గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల కలిగే నష్టాలు ఇవి..  
➣ విపరీతమైన వేడి, కరువు, సముద్ర మట్టం పెరుగుదల, వరదలు వంటి వాతావరణ మార్పుల కారణంగా వలసలు పెరుగుతాయి.  
➣ వ్యవసాయం దెబ్బతినడంతో దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వేరే ప్రాంతాలకు వలస పోతారు.  
➣ మొక్కలు, జంతు జాతులకు ముప్పు వాటిల్లుతుంది. 
➣ తీవ్రమైన వేడి తరంగాలు వంటి పర్యావరణ ప్రమాదాలు తలెత్తుతాయి.

Wayanad Landslides: పర్యావరణ విధ్వంసం.. దీనికి మనిషి దురాశే కారణం!

➣ ముఖ్యంగా ప్రజల జీవనానికి కరువు, నీటి కొరత, తీవ్రమైన వాయు కాలుష్యం, తీవ్రమైన తుపానులు, వరదలు ఆటంకం కలిగిస్తాయి.
➣ వాతావరణ విపత్తులతో వలసల ప్రభావం మహిళలపై తీవ్రంగా పడుతోంది. కుటుంబంలోని పురుషుడు వలస వెళ్ళినప్పుడు స్త్రీలు వ్యవసాయం, కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యతలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.  
➣ కుటుంబాలతో సహా వలస వెళ్లిన వారు సొంత భూమితో సంబంధాన్ని కోల్పోతున్నారు. 

భారత్‌ సహా దక్షిణాసియాకు ప్రమాద ఘంటికలు
వాతావరణ ప్రేరిత వలసలు దక్షిణాసియాను కుదిపేస్తున్నాయి. ప్రజల కష్టాలను పెంచి వలసలకు దారితీస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్‌లో నదులు కోతకు గురవుతున్నాయి. పాకిస్తాన్, భారతదేశంలో వరదలు పోటెత్తుతున్నాయి. నేపాల్‌లో హిమానీ నదాలు కరుగుతున్నాయి. 

ఫలితంగా భారత్, బంగ్లాదేశ్‌లలో సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంత ప్రజలు ఆవాసాలు కోల్పోవాల్సి వస్తోంది. శ్రీలంకలోని వరి, టీ ఎస్టేట్‌లపై సాధారణంకంటే భారీ వర్షాలు, తుఫానులు  విరుచుకుపడటంతో ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. 

పెరుగుతున్న ఉష్ణోగ్రత 
భారత్‌లోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతోంది. మానవుల వల్ల కలిగే గ్లోబల్‌ వార్మింగ్‌ దశాబ్దానికి 0.26 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. గత దశాబ్దంలో ఉష్ణోగ్రత 1.14 డిగ్రీల నుంచి 1.19 డిగ్రీల సెల్సియస్‌ పెరిగింది. గత ఏడేళ్లలో భారత తలసరి బొగ్గు ఉద్గారాలు 29% పెరిగాయి. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులు ప్రజల జీవన విధానాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

Lunar Water: చందమామపై నీటి జాడలు ఉన్నాయా?

#Tags