India First General Elections: ఎన్నికల ఆరంభం అదిరింది.. తొలి సాధారణ ఎన్నికల్లో ఎటు చూసినా సవాళ్లే!!

స్వాతంత్య్రం వచ్చి అప్పటికి ఐదేళ్లు కూడా దాటలేదు. దేశాన్ని కుదిపేసిన విభజన తాలూకు గాయాల పచ్చి ఇంకా ఆరనే లేదు. ఎటు చూసినా ఇంకా బాలారిష్టాలే. పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న అనేకానేక సమస్యలే.

వయోజనుల్లో చదవను, రాయను వచ్చిన వారి సంఖ్య చూస్తే అతి స్వల్పం. ఇలా.. ఒకటా, రెండా! 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికలకు ఎటు చూసినా సవాళ్లే. ఇన్ని పెను సవాళ్లనూ విజయవంతంగా అధిగమిస్తూ ఆ ఎన్నికలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. దాంతో.. ఇది అయ్యేదా, పొయ్యేదా అంటూ పెదవి విరిచిన ఎంతోమంది పాశ్చాత్య విమర్శకుల
నోళ్లు మూతలు పడ్డాయి.

తొలి ఎన్నికల ఫలితాలొచ్చేదాకా భారత్‌ రాజ్యాంగబద్ధ రాచరిక దేశంగానే కొనసాగింది! లార్డ్‌ మౌంట్‌బాటెన్‌ గవర్నర్‌ జనరల్‌గా కొనసాగారు. నెహ్రూ సారథ్యంలోని రాజ్యాంగ సభే మధ్యంతర పార్లమెంటుగా వ్యవహరించింది. ఎందుకంటే స్వాతంత్య్రం సిద్ధించిన కొన్నేళ్ల దాకా ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న దానిపై ఓ స్పష్టతంటూ లేదు. నియమ నిబంధనలు గానీ విధివిధానాలు గానీ లేవు.

అంబేడ్కర్‌ సారథ్యంలోని డ్రాఫ్టింగ్‌ కమిటీ రూపొందించిన రాజ్యాంగం 1949లో ఆమోదం పొంది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చాకే ప్రజా ప్రాతినిధ్య చట్టం ద్వారా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓ స్పష్టత ఏర్పడింది. ఆ వెంటనే తొలి ఎన్నికల నిర్వహణకు సుదీర్ఘ కసరత్తు మొదలైంది. ఆ క్రమంలో ఎన్నో సమస్యలు. మరెన్నో సవాళ్లు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు పోలింగ్‌ సిబ్బందిని, సామగ్రిని చేర్చడమైతే పెద్ద యజ్ఞాన్నే తలపించింది. ఇలాంటి అనేకానేక సవాళ్లను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది.

పార్టీలు, అభ్యర్థులకు గుర్తులు   
పార్టీలకు గుర్తులు కేటాయించాలని తొలి సార్వత్రిక ఎన్నికలప్పుడే ఈసీ నిర్ణయించింది. ఆలయం, ఆవు, జాతీయ పతాకం, రాట్నం వంటి సున్నితమైన గుర్తులు కాకుండా సులభంగా గుర్తించే ఇతర గుర్తుల వైపు మొగ్గు చూపింది. కాంగ్రెస్‌ అనగానే గుర్తుకొచ్చే హస్తం గుర్తు ఆ పార్టీకి 1980లో వచ్చింది. 1952లో కాంగ్రెస్‌ కాడెద్దుల గుర్తుపై పోటీ చేసింది. విడిపోయిన వేళ్లతో కూడిన హస్తం గుర్తు ఆలిండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ (రుయ్‌కార్‌ గ్రూప్‌)కు దక్కడం విశేషం! సోషలిస్ట్‌ పార్టీకి చెట్టు, కిసాన్‌ మజ్దూర్‌ ప్రజా పార్టీకి గుడిసె, అఖిల భారతీయ రామరాజ్య పరిషత్‌కు ఉదయించే సూర్యుడు వంటి గుర్తులు దక్కాయి.

Nominations: నామినేషన్ల సమయంలో A-ఫారం, B-ఫారం మధ్య వ్యత్యాసం ఇదే..

ఫలితాలు ఇలా..  
భారత జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)తో పాటు సోషలిస్టు పార్టీ, కిసాన్‌ మజ్దూర్‌ ప్రజా పార్టీ, అఖిల భారతీయ హిందూ మహాసభ వంటి మొత్తం 53 పార్టీలు తొలి ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే అనూహ్యమేమీ జరగలేదు. ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సారథ్యంలోని కాంగ్రెసే విజయం సాధించింది. 45 శాతానికి పైగా ఓట్లతో 489 స్థానాలకు గాను ఏకంగా 364 చోట్ల నెగ్గింది. దేశ తొలి ఎన్నికైన ప్రధానిగా కూడా నెహ్రూయే నిలిచారు. కమ్యూనిస్టు పార్టీ 16 స్థానాలు నెగ్గి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.

అంబేడ్కర్‌కు ఓటమి..   
రాజ్యాంగ రూపశిల్పి బీఆర్‌ ఆంబేడ్కర్‌కు తొలి ఎన్నికలు చేదు అనుభవమే మిగిల్చాయి. నార్త్‌ సెంట్రల్‌ బోంబే స్థానం నుంచి షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ ఫెడరేషన్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన తన సహాయకుడే అయిన కాంగ్రెస్‌ అభ్యర్థి నారాయణసబోద కజ్రోల్కర్‌ చేతిలో 15,000 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు! సోషలిస్ట్‌ పార్టీ మద్దతున్నా సీపీఐ అభ్యర్థి డంగే అంబేడ్కర్‌కు వ్యతిరేకంగా బలంగా ప్రచారం చేశారు. దీనికి నెహ్రూ గాలి తోడవడంతో కజ్రోల్కర్‌ నెగ్గారు. 1954లో బండారా లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లోనూ మరోసారి కాంగ్రెస్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. చివరికి జన్‌సంఘ్‌ సాయంతో అంబేడ్కర్‌ రాజ్యసభలో అడుగుపెట్టారు.

► దేశ తొలి ఎన్నికల ప్రక్రియ 1951 అక్టోబర్‌ 25న మొదలైంది. 1952 ఫిబ్రవరి 21 దాకా ఏకంగా నాలుగు నెలల పాటు కొనసాగింది.
► అప్పట్లో మొత్తం 489 లోక్‌సభ స్థానాలుండేవి.
► 17.3 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు.
► 53 పార్టీల తరఫున 1,874 మంది బరిలో నిలిచారు.
► అప్పట్లో భారత్‌లో అక్షరాస్యత కేవలం 16.6 శాతమే!
► దేశవ్యాప్తంగా 1,32,560 పోలింగ్‌ స్టేషన్లు, 1,96,084 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు.

Jamili Elections: 'ఒకే దేశం-ఒకే ఎన్నిక'.. హంగ్ వస్తే?

► ముందుగా హిమాచల్‌ప్రదేశ్‌లో తొలి దశలో పోలింగ్‌ జరిగింది.
► మొత్తమ్మీద 51 శాతం పోలింగ్‌ నమోదైంది. 8,86,12,171 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
► అప్పట్లో ఓటరుగా నమోదయ్యేందుకు కనీస వయో పరిమితి 21 ఏళ్లుగా ఉండేది.
► అప్పటికి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఓటింగ్‌ ప్రక్రియ 1952 ఎన్నికలు రికార్డులకెక్కాయి. నాటినుంచి నేటిదాకా ఈ రికార్డు భారత్‌పేరిటే కొనసాగుతూ వస్తోంది.

ఒకే ఒక్కడు.. 
తొలి ఎన్నికల క్రతువు దిగ్విజయంగా సాగిందంటే అందుకు ప్రధాన కారకుడు దేశ తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుకుమార్‌ సేన్‌. ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ అధికారి అయిన ఆయన 1950లో సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. అనేక ప్రతికూలతలను అధిగమిస్తూ దేశాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేశారు. ఏకంగా 36 కోట్ల జనాభా, 17 కోట్ల పై చిలుకు అర్హులైన ఓటర్లు! వారందరికీ ఓటరు కార్డుల జారీ, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్ల వంటి అనేకానేక సవాళ్లను సేన్‌ విజయవంతంగా ఎదుర్కొన్నారు.
84 శాతానికి పైగా ప్రజలు నిరక్షరాస్యులే కావడంతో వారిని గుర్తించి, ఓటర్లుగా నమోదు చేయించడమే ఓ భారీ యజ్ఞాన్ని తలపించింది. 1951 జనగణన ఆధారంగా లోక్‌సభ స్థానాలను ఖరారు చేశారు. రాజస్తాన్‌లోని జైసల్మేర్, జోద్‌పూర్‌ వంటి ప్రాంతాలకైతే ఎన్నికల సామగ్రి తరలింపునకు ఒంటెలను వాడాల్సి వచ్చింది!

డాటరాఫ్, వైఫాఫ్‌..!
ఓటర్ల నమోదు సందర్భంగా ఓ సన్నివేశం అప్పట్లో పరిపాటిగా మారింది. ఎన్నికల సిబ్బందికి తమ పేరు చెప్పేందుకు మహిళలు ససేమిరా అనేవారు. అపరిచితులకు తమ పేర్లను చెప్పేందుకు వారు వెనుకాడేవారు. ఫలానా వారి భార్య అనో, కూతురు అనో మాత్రమే చెప్పేవారు. దాంతో విధిలేక ఓటర్‌ లిస్టులో వారి పేర్లను కూడా అలాగే నమోదు చేయాల్సి వచ్చింది. కానీ ఇలా పేర్లు లేకుండా ఓటరు కార్డులు జారీ చేసేందుకు ఈసీ నిరాకరించింది.
అసలు పేర్లతో ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. నాడు 8 కోట్ల మహిళా ఓటర్లు ఉంటే, 20–80 లక్షల మంది తమ అసలు పేర్లను వెల్లడించేందుకు అంగీకరించలేదు. దాంతో వాటిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. నాడు తీసుకున్న నిర్ణయం కఠినమైనదే అయినా, ఫలితాలను ఇప్పుడు చూస్తున్నామని, పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొంటున్నట్టు ఢిల్లీ మాజీ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ చంద్రభూషణ్‌ కుమార్‌ పేర్కొనడం గమనార్హం.

Article 370: ఆర్టికల్‌ 370 రద్దు.. మొదటిసారి శ్రీనగర్‌కు ప్రధాని మోదీ

అభ్యర్థికో బ్యాలెట్‌ బాక్సు..!
84 శాతం మంది నిరక్షరాస్యులే. దాంతో ఓటేయాల్సిన అభ్యర్థిని వారు గుర్తించడమెలా అన్నది పెద్ద సమస్యగా నిలిచింది. ఒక్కో అభ్యర్థికీ ఒక్కో రంగు బ్యాలెట్‌ బాక్సు కేటాయించడం ద్వారా దీన్ని అధిగమించారు. ఆ రంగుపైనే సదరు అభ్యర్థి పేరు, గుర్తు ముద్రించారు. ప్రచార సమయంలో ప్రతి అభ్యర్థీ తన బ్యాలెట్‌ బాక్సు రంగు ఫలానా అంటూ ప్రముఖంగా ప్రస్తావించేవాడు!

ఎన్నికలు.. విశేషాలు..
► 1993లో మొదటిసారి ఓటర్‌ ఐడీని ప్రవేశపెట్టారు.  
► ఈవీఎం మెషిన్లపై అభ్యర్థుల ఫొటోలను 2015 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పెట్టారు.  
► నోటా (నన్‌ ఆఫ్‌ ద ఎబోవ్‌/పైన ఎవరూ కాదు) ఆప్షన్‌ను తొలిసారి 2013లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నుంచి (ఛత్తీస్‌గఢ్, మిజోరాం, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌) అమల్లోకి తీసుకొచ్చారు. పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పీయూసీఎల్‌) దాఖలు చేసిన పిటిషన్‌ ఆధారంగా నోటా అమలుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరికీ ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాను ఎంపిక చేసుకోవచ్చు.   
► దేశ తొలి మహిళా చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా ఎస్‌.రమాదేవి 1990 నవంబర్‌ 26 నుంచి 1990 డిసెంబర్‌ 11 వరకు పని చేశారు.  

► ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం దేశంలో 7 జాతీయ పార్టీలు, 27 రాష్ట్ర పార్టీలు, 2,301 నమోదు చేసుకున్న గుర్తింపు లేని పార్టీలు ఉన్నాయి.
► 31,83,325 ఓటర్లతో దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా మాల్కాజ్‌గిరి ఉంది. 46,909 మంది ఓటర్లతో లక్షద్వీప్‌ అతి చిన్న లోక్‌సభ స్థానంగా ఉంది.
► విస్తీర్ణపరంగా 1,73,266 చదరపు కిలోమీటర్లతో లద్దాఖ్‌ అతిపెద్ద లోక్‌సభ స్థానం. 10 కి.మీ. విస్తీర్ణంతో చాందినీ చౌక్‌ అతి చిన్న నియోజకవర్గంగా ఉంది.
► లోక్‌ఐసభకు యూపీ అత్యధికంగా 80 మంది ఎంపీలను పంపుతోంది. అంతేగాక దేశానికి ఎనిమిది మంది ప్రధానులను కూడా అందించింది.

► 2009లో బిహార్లోని హాజీపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి జేడీ (యూ)కు చెందిన రాంసుందర్‌ దాస్‌ 88 ఏళ్ల వయసులో గెలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గిన అతి పెద్ద వయసు్కనిగా రికార్డు సృష్టించారు.  
► 2014లో లోక్‌సభ సభ్యునిగా నెగ్గిన అతి పిన్న వయస్కునిగా (26 ఏళ్లు) దుష్యంత్‌ చౌతాలా రికార్డులకెక్కారు. హరియాణాలోని హిసార్‌ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు.   

women's day quiz: భారతదేశంలో మహిళ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసింది ఎవరు?

#Tags