TS CETs 2024: సెట్స్‌పై ఉన్నతాధికారులు సమీక్ష.. ఎంసెట్‌పై ప్రత్యేక దృష్టి..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ‌ రాష్ట్ర పరిధిలోని ఉమ్మడి ప్రవేశ పరీ క్షల (సెట్స్‌)పై త్వరలోనే స్పష్ట త రానుంది.

ఇప్పటికే విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతాధికారులు స మీక్ష చేపట్టి వివిధ రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఓ నివేదిక రూపొందించారు. సెట్స్‌కు కన్వీనర్లను నియమించే అంశాన్ని, ఏ పరీక్ష ఏ యూనివర్శిటీకి ఇవ్వాలనే దానిపై ప్రాథమిక అవగాహనకు వచ్చారు.

వాస్తవానికి డిసెంబర్‌ చివరి నాటికే ఉమ్మడి ప్రవేశ పరీ క్షలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్‌ చైర్మ న్‌ను ప్రభుత్వం తొలగించడం, ఇంకా కొత్తవారి నియామకం జరగకపోవడంతో  విశ్వవిద్యాల యాల అధికారులు సెట్స్‌పై తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

చదవండి: Engineering Colleges: ఈ కోర్సుల్లో 40 శాతం కంటే తక్కువే అడ్మిషన్లు.. ఈ కోర్సుల వైపే విద్యార్థులు ఆసక్తి..

ఎంసెట్‌పై ప్రత్యేక దృష్టి:

ఉన్నత విద్య పరిధిలో ఎంసెట్‌ ప్రధానమైంది. ఆ తర్వాత ఎడ్‌సెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్‌ ఇలా అనేక ప్రవేశ పరీక్షలుంటాయి. ఎంసెట్‌ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఎంసెట్‌ షెడ్యూల్‌ను ఖరారు చేసిన తర్వాత యూనివర్శిటీలు కాలేజీల అనుబంధ గుర్తింపుపై దృష్టి పెడతాయి.

కాలేజీల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ వంటి అంశాలను పరిశీలిస్తాయి. గతంలో ఈ ప్రక్రియ ఆలస్యమవ్వడం వల్ల కౌన్సెలింగ్‌ తేదీల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇది అనేక ఇబ్బందులకు దారి తీస్తోంది. జేఈఈ కౌన్సెలింగ్‌ పూర్తయిన వెంటనే ఆఖరి దశ కౌన్సెలింగ్‌ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. వీలైనంత వరకూ మే మొదటి వారంలోనూ ఎంసెట్‌ నిర్వహణ పూర్తి చేయాలని, సరిగ్గా 15 రోజుల్లో ఫలితాలు వెల్లడించాలనే యోచనలో ఉన్నారు.

చదవండి: Prof R Limbadri: టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాన్ని పెంచుకోవాలి

ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలోనే...

ఉన్నత విద్యా మండలి చైర్మన్, సభ్యుల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంసెట్, ఇతర సెట్స్‌పై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చాయి.

పరీక్షల నాటికి నియామకాలు జరుగుతాయనీ, అప్పటి వరకూ నిర్ణయాలన్నీ ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలో ఉంటాయని ప్రభుత్వవర్గాలు స్పష్టం చేశాయి. కాగా,  త్వరలోనే విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్షించే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే అధికారులు శాఖాపరమైన పూర్తి సమాచారంతో సిద్ధమయ్యారు.

సీఎం సమీక్షా సమావేశంలో సెట్స్‌పై స్పష్టత వస్తుందనీ, వచ్చే వారంలో సెట్స్‌ తేదీలను ప్రకటించే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  

#Tags