Engineering Colleges: ఈ కోర్సుల్లో 40 శాతం కంటే తక్కువే అడ్మిషన్లు.. ఈ కోర్సుల వైపే విద్యార్థులు ఆసక్తి..
2015 నాటికి రాష్ట్రంలో 234 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, ప్రస్తుతం వాటి సంఖ్య 159కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఉండే కాలేజీలే ఎక్కువగా మూతపడుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 48 కాలేజీలుంటే, ఇప్పుడు వాటి సంఖ్య 11కు తగ్గింది. ఖమ్మం జిల్లాలో 28 ఉంటే, ఇప్పుడు 8 మాత్రమే ఉన్నాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 11కుగాను ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలాయి. ఇలా ప్రతీ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఆఖరుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ 2015లో 74 కాలేజీలుంటే, 20 కాలేజీలు మాయమై 54 మిగిలాయి. ఇటీవల ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో మరికొన్ని కాలేజీలు కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని ఉన్నత విద్యామండలి అధికారులు అంటున్నారు.
చదవండి: AI & Chat GPT: ఫ్యూచర్ కెరీర్.. ప్రాంప్ట్ ఇంజనీర్!
ఎందుకీ పరిస్థితి?
సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో డిమాండ్ బాగా తగ్గింది. ఈ కోర్సుల్లో 40 శాతం కంటే తక్కువే అడ్మిషన్లు జరుగుతున్నాయి. కొన్ని కాలేజీల్లో మెకానికల్, సివిల్ బ్రాంచీల జోలికే వెళ్లడం లేదు. 2023 ప్రవేశాల్లో దాదాపు 30 కాలేజీల్లో సివిల్ బ్రాంచ్‌లో సగానికి పైగానే సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 58 శాతం కంప్యూటర్ కోర్సుల్లోనే ప్రవేశాలుంటున్నాయి. సీఎస్‌ఈ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సుల వైపే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
ఇంటర్మీడియట్ విద్యకు ఎక్కువ మంది హైదరా బాద్‌ను ఎంపిక చేసుకుంటుండగా, ఆ తర్వాత ఇంజనీరింగ్ విద్యనూ ఇక్కడే పూర్తి చేయాలని భావిస్తున్నారు. చదువుకునే సమయంలోనే పార్ట్ టైం ఉద్యోగం వెతుక్కునే అవకాశం నగరంలో ఉందని భావిస్తున్నారు. అరకొర విద్యార్థులతో జిల్లాల్లో కాలేజీలను నడిపే పరిస్థితి లేదని నిర్వాహకులు అంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులకు మౌలిక వసతుల కల్పనపై ఖర్చు చేయడానికి ఇష్టపడటం లేదు. దీంతో విద్యార్థులు ఆ కాలేజీల వైపు వెళ్లే పరిస్థితి లేదు. అందువల్ల అవి క్రమంగా మూతపడుతున్నాయి.
చదవండి: Humane AI Pin: ఇకపై అరచేతిలో సమాచారం.. ఏఐ పిన్ ఎలా పనిచేస్తుందంటే..
ప్రైవేటు వర్సిటీలొస్తే మరీ ప్రమాదం
ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు కేంద్ర విద్యాశాఖ ఆహ్వానం పలుకుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీలోని ప్రధాన కాలేజీలు ఇక్కడ బ్రాంచీలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులను ఆకట్టుకునేందుకు అవి ప్రయత్నిస్తాయని నిపుణులు చెబుతు న్నారు. ఈ పోటీని మన ఇంజనీరింగ్ కాలేజీలు తట్టుకునే అవకాశం తక్కువనే వాదన విన్పిస్తోంది.
ఇప్పటికే రాష్ట్రంలోని 80 శాతం కాలేజీల నాణ్యత పెంచాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రాష్ట్రానికి సూచించింది. న్యాక్ అక్రిడిటేషన్ పరిధిలోకి వస్తేనే అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ తరహా పోటీని తట్టుకునే ప్రైవేటు కాలేజీలు 20కి మించి లేవు. ఇంజనీరింగ్ విద్యలోనూ మార్పులు వస్తున్నాయి. బోధన ప్రణాళికను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ భవిష్యత్‌లో మరికొన్ని కాలేజీలు మూతపడేందుకు కారణాలవుతాయని అంటున్నారు.
పోటీ పెరిగితే మనుగడ
ప్రైవేటు యూనివర్సిటీలు పెరుగు తున్నాయి. కొత్త కోర్సుల దిశగా అవి దూసుకెళ్తున్నాయి. భవిష్యత్ లోనూ ఇదే ట్రెండ్ కన్పిస్తుంది. ముఖ్యంగా కంప్యూటర్ కోర్సులకే ప్రాధాన్య మిస్తున్నారు. జిల్లాల్లోని ప్రైవేటు కాలేజీలు ఈ పోటీని తట్టుకునేలా లేవు. ఇందుకు తగ్గట్టుగా ముందుకెళ్లే పరిస్థితి రావాలి. అప్పుడే వాటికి మనుగడ ఉంటుంది.
– ప్రొఫెసర్ డి.రవీందర్, ఉస్మానియా వర్సిటీ వీసీ