AI & Chat GPT: ఫ్యూచర్ కెరీర్.. ప్రాంప్ట్ ఇంజనీర్!
- ఏఐ విప్లవంతో ప్రాంప్ట్ ఇంజనీర్లకు డిమాండ్
- డిగ్రీ, ప్రోగ్రామింగ్‌పై పట్టుతో కెరీర్ అవకాశాలు
- అప్‌కమింగ్ కెరీర్‌గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందనే ఆందోళన ఓవైపు నెలకొంది. కానీ.. ఏఐ టూల్స్ సమర్థవంతంగా పనిచేయాలంటే..అందుకు ప్రత్యేక నైపుణ్యాలున్న మానవ వనరులు తప్పనిసరి. మరోవైపు ఏఐలో ప్రత్యేక విభాగాలు ఆవిష్కృతం అవుతున్నాయి. ఈ కోవలో కొత్తగా వినిపిస్తున్న జాబ్ ప్రొఫైల్.. ప్రాంప్ట్ ఇంజనీర్. టెక్నాలజీ రంగంలో ప్రవేశించాలనుకునే వారు దీన్ని మరో కొత్త అవకాశంగా భావించి అడుగులు వేస్తే.. చక్కటి కెరీర్ సొంతమవుతుంది అంటున్నారు టెక్ నిపుణులు.
అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్
ప్రాంప్ట్ అంటే.. సత్వర స్పందన! వ్యక్తులు ఏఐ ద్వారా అడిగే ప్రశ్నలకు కచ్చితమైన సమాచారాన్ని సత్వరమే ఇచ్చే విధంగా సదరు టూల్స్‌ను తీర్చిదిద్దడమే.. ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఒక విభాగానికి సంబంధించి వినియోగదారులు ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చు? ఎలాంటి ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇవ్వాలి? ఏ భాషలో ప్రశ్నలు అడిగితే.. ఎలా స్పందించాలి? తదితర అంశాలను ముందుగానే గుర్తించి.. దానికి అనుగుణంగా ఏఐ టూల్స్‌ను సమర్థవంతంగా రూపొందించే వారే ప్రాంప్ట్ ఇంజనీర్లు!! అంటే.. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద్వారా కచ్చితత్వంతో కూడిన సమాధానాలను వినియోగదారులకు అందించే అవకాశం లభిస్తుంది.
చదవండి: Software Jobs: ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ఎంపిక ఇలా..
పరిష్కార మార్గంగా
ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ సంస్థలు ఏఐ ఆధారిత సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. వ్యక్తులు సైతం తమకు అవసరమైన సమచారం కోసం చాట్ జీపీటీ, గూగుల్ సెర్చ్ తదితర టూల్స్‌ను వినియోగిస్తున్నారు. తమ సందేహాల్ని ప్రశ్నగా అడిగినప్పుడు..చాట్ జీపీటీ, ఏఐ టూల్స్ ద్వారా అవసరమైన సమాచారం కళ్ల ముందు ప్రత్యక్షమవుతోంది. కొన్ని సందర్భాల్లో మనం అడిగే ప్రశ్నలు లేదా సమాచార ఇన్‌పుట్ సరిగా లేకపోతే కచ్చితత్వంతో కూడిన సమాధానం లభించదు. దీంతో సంబంధిత వ్యక్తులు గందరగోళానికి గురయ్యే పరిస్థితి నెలకొంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా తెరపైకి వచ్చిన సాంకేతికతే.. ప్రాంప్ట్ ఇంజనీరింగ్.
ఏఐ టూల్స్ డిజైనింగ్
ప్రాంప్ట్ ఇంజనీరింగ్‌లో.. ఏఐ టూల్స్ డిజైనింగ్, స్ట్రక్చరింగ్, ప్రోగ్రామింగ్, కోడింగ్‌లను రూపొందించడం చాలా కీలకం. ఇందులో నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, నేచురల్ లాంగ్వేజ్ అండర్ స్టాండింగ్ వంటి వాటిని వినియోగిస్తారు. ఆయా భాషలకు సంబంధించిన అంశాలను లోతుగా విశ్లేషిస్తారు. వీటన్నింటి ద్వారా ఏఐ మోడల్స్ ఆధారంగా వినియోగదారులు అడిగే ప్రశ్నలకు కచ్చితత్వంతో కూడిన సమాచారం, సమాధానం ఇచ్చేలా సదరు ఏఐ టూల్స్‌ను రూపొందిస్తారు.
ఈ రెండు నైపుణ్యాలు
ప్రాంప్ట్ ఇంజనీరింగ్‌లో కెరీర్ కోరుకునే వారికి ప్రధానంగా రెండు నైపుణ్యాలు ఉండాలి. అవి.. ప్రోగ్రామింగ్, డేటా అనాలిసిస్. ఎందుకంటే.. ఏఐ టూల్స్ సమర్థంగా పని చేయాలంటే.. అందుకు తగిన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్‌ను రూపొందించాల్సి ఉంటుంది. అదే విధంగా.. ఆయా సంస్థలకు సంబంధించిన సేవలు, ఉత్పత్తులు, వినియోగదారుల డేటాను విశ్లేషించాల్సి ఉంటుంది. ఈ విశ్లేషణ ఆధారంగా సదరు ఉత్పత్తులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని సిద్ధం చేయడానికి వీలవుతుంది. అందుకే ప్రాంప్ట్ ఇంజనీర్‌గా కెరీర్ కోరుకునే వారికి డేటా అనాలిసిస్ నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయి. దీంతోపాటు ప్రోగ్రామింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, టీమ్ వర్కింగ్ నైపుణ్యాలుంటే.. ప్రాంప్ట్ ఇంజనీర్‌గా మరింత సమర్థవంతంగా రాణించే అవకాశం ఉంటుంది.
చదవండి: Job Trends: స్కిల్ ఉంటేనే.. కొలువు!
అకడమిక్ నేపథ్యం
ప్రాంప్ట్ ఇంజనీరింగ్‌లో కెరీర్ కోరుకునే వారికి అకడమిక్‌గా టెక్నికల్ నేపథ్యం ఉంటే మేలు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లలో బీటెక్ పూర్తి చేసిన వారు ఈ జాబ్ ప్రొఫైల్‌కు సరితూగుతారని పేర్కొనొచ్చు. వీరికి ప్రోగ్రామింగ్, కోడింగ్‌పై పట్టు ఉంటుంది. కాబట్టి వీరు ప్రాంప్ట్స్(సత్వర స్పందనలు) రూపకల్పనలో ముందంజలో నిలిచే ఆస్కారం ఉంటుంది.
సర్టిఫికేషన్స్ తోడుగా
ప్రాంప్ట్ ఇంజనీర్‌గా కెరీర్ కోరుకునే వారు నిర్దేశిత సర్టిఫికేషన్స్ పూర్తి చేయడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. నెట్‌వర్క్ సెక్యూరిటీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, సర్టిఫైడ్ సెలీనియం ప్రొఫెషనల్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, యాక్సెసబిలిటీ టెస్టింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, పైథాన్, డేటా సైన్స్ వంటి విభాగాల్లో సర్టిఫికేషన్స్ పూర్తి చేసుకుంటే.. ప్రాంప్ట్ ఇంజనీరింగ్‌లో కెరీర్స్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కోర్సులను ఉడెమీ, కోర్సెరా, ఎడ్యురేక వంటి సంస్థలు అందిస్తున్నాయి. అదే విధంగా పలు ఐటీ సంస్థలు తమ సిబ్బందికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాయి.
పెరుగుతున్న డిమాండ్
ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఏఐ టెక్నాలజీ, చాట్‌బోట్, ఇతర వర్చువల్ అసిస్టెంట్ టూల్స్ వినియోగం పెరుగుతోంది. దీంతో ప్రాంప్ట్ ఇంజనీర్స్కు కెరీర్ అవకాశాలు విస్తృతమవుతున్నాయి. ఏఐ కాంట్రాక్ట్ రివ్యూ ఫర్మ్స్, ఫిన్‌టెక్, ఎడ్ టెక్, సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రాంప్ట్ ఇంజనీర్లకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. లింక్డ్‌ఇన్ సర్వే ప్రకారం-ఈ ఏడాది చివరినాటికి చాట్‌బోట్, చాట్ జీపీటీ, ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను వినియోగించే వారి సంఖ్య 2.5 బిలియన్లకు చేరుకోనుంది. ఆయా సంస్థలు ప్రాంప్ట్ ఇంజనీర్లను భారీ స్థాయిలో నియమించుకునే అవకాశముంది.
చదవండి: Engineering Jobs: స్టార్టప్ ఆఫర్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
నెంబర్ 1 న్యూ జాబ్
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ నివేదిక ప్రకారం-2023లో కొత్త ఉద్యోగాల్లో నెంబర్ 1 జాబ్‌గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నిలిచింది. 2025 నాటికి మొత్తం ఏఐ ఉద్యోగాల్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కొలువుల వాటా 30 శాతం మేరకు ఉంటుందని వెల్లడైంది.
వేతనాలు ఆకర్షణీయం
ప్రాంప్ట్ ఇంజనీర్లకు సంస్థలు ఆకర్షణీయ వేతనాలను అందిస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌లో ఏడాదికి రూ.ఆరు లక్షల వరకు; రెండు నుంచి అయిదేళ్ల అనుభవంతో మిడిల్ లెవల్‌లో కనిష్టంగా రూ.ఆరు లక్షలు గరిష్టంగా రూ.12 లక్షల వార్షిక వేతనం పొందే అవకాశం ఉంది.
- ముఖ్యమైన సర్టిఫికేషన్స్: నెట్‌వర్క్ సెక్యూరిటీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, సర్టిఫైడ్ సెలీనియం ప్రొఫెషనల్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, యాక్సెసబిలిటీ టెస్టింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింVŠ , పైథాన్, డేటా సైన్స్.
- అవసరమైన నైపుణ్యాలు: డేటా అనాలిసిస్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, నేచురల్ లాంగ్వేజ్ స్కిల్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, నేచురల్ లాంగ్వేజ్ అండర్ స్టాండింగ్ స్కిల్స్, రీసెర్చింగ్ స్కిల్స్.