CUET UG 2024 Revised Admit Card: సీయూఈటీ-యూజీ పరీక్షలు రాస్తున్న వారికి అలర్ట్‌.. ఎగ్జామ్‌ సెంటర్స్‌లో మార్పులు

కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) యూజీ 2024 పరీక్షలు మొదలయ్యాయి. ఈనెల 15-18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)అడ్మిట్‌ కార్డులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలోని పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులకు ఎన్టీఏ కీలక ప్రకటన జారీ చేసింది.

ఎగ్జామ్‌ సెంటర్స్‌ మార్పులు
కొన్ని కారణాల వల్ల ఢిల్లీలోని పరీక్షా కేంద్రాలను మార్చాల్సి వచ్చిందని, అభ్యర్థులు సవరించిన అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా కోరింది. డిల్లీ మినహా మరే ఇతర పరీక్ష కేంద్రాలను మార్చలేదని, అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. అభ్యర్థులు అఫీషియల్‌ వెబ్‌సైట్‌ https://exams.nta.ac.in/CUET-UG/ లో మారిన పరీక్షా కేంద్రాలను చెక్‌ చేసుకోవాల్సిందిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది.

ఆ అడ్మిట్‌ కార్డులు చెల్లవు
మరిన్ని వివరాల కోసం 011 - 40759000/011 - 69227700 నంబర్లకు ఫోన్‌ లేదా cuet-ug@nta.ac.in ద్వారా ఈ-మెయిల్‌ చేయాల్సిదిగా కోరింది.అడ్మిట్‌ కార్డుపై విద్యార్థులు తమ ఫొటో, సంతకం, బార్‌కోడ్‌ను చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. అవి లేకపోతే అడ్మిట్‌ కార్డులు చెల్లవని, వీటిలో ఏ ఒక్కటి మిస్‌ అయినా  మరోసారి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపారు.

దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు CUET-PG పరీక్షను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో 27 సబ్జెక్టులకు ఈ పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 354 పట్టణాలు, విదేశాల్లోని 26 పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
 

#Tags