Tata Consultancy Services: టీసీఎస్‌లో తగ్గిపోయిన ఉద్యోగులు! కారణం ఇదే..

దేశంలో ప్రముఖ ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌ (TCS) లో గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య (హెడ్‌కౌంట్) 6,333 పడిపోయింది. ఇది క్రితం సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 7,186 తగ్గింది. ప్రస్తుతం టీసీఎస్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,08,985.
టీసీఎస్‌లో తగ్గిపోయిన ఉద్యోగులు! కారణం ఇదే..

ఫ్రెషర్లపై దృష్టి

దీనిపై కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ మిలింద్ లక్కడ్ మాట్లాడుతూ కంపెనీ కొత్త టాలెంట్‌పై ఎక్కువగా ఖర్చు పెడుతోందని, దానికి తగిన ఫలితం లభిస్తోందని చెప్పారు. 

‘కంపెనీలో అట్రిషన్ తగ్గుతున్నట్లు చూశాం.  మా నియామకాల్లో కీలక మార్పులు  చేస్తున్నాం. ఫలితంగా మా మొత్తం నియామకం ఈ త్రైమాసికంలో అట్రిషన్ కంటే తక్కువగా ఉంది. దీని అర్థం మానవ వనరుల కోసం ఖర్చు పెడుతున్నాం. కొంచెం ఆలస్యమైనా మా అన్ని జాబ్‌ ఆఫర్లను గౌరవిస్తూ ఫ్రెషర్‌ల ఆన్‌బోర్డ్‌ను కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు.  కాగా జూన్ త్రైమాసికంలో ఐటీ అట్రిషన్ 17.8 శాతం నుంచి 14.9 శాతానికి తగ్గింది.

చదవండి: Q2 Results: ఐటీ కంపెనీలు అంతంతే.. మళ్లీ నిరాశాజనకమే!
టీసీఎస్‌ తన వర్క్‌ఫోర్స్‌లో 70 శాతం మందికి 100 శాతం వేరియబుల్ పే అందిస్తోంది. మిగిలినవారికి మాత్రం పనితీరు ఆధారంగా చెల్లిస్తోంది.

ఆఫీస్ పాలసీ గురించి.. 

“మేము గత మూడు సంవత్సరాలలో చాలా మందిని నియమించుకున్నాం. వారంతా చాలా కాలం పాటు హైబ్రిడ్ లేదా వర్చువల్ రిమోట్ (మోడ్)లో పని చేస్తున్నారు. కొత్త వర్క్‌ఫోర్స్ కంపెనీలో ఇప్పటికే ఉన్న విస్తృత వర్క్‌ఫోర్స్‌తో ఏకీకృతం కావడానికి వారంతా ఆఫీస్‌కు రావాలని గట్టిగా నమ్ముతున్నాం. కొత్తవారు టీసీఎస్‌ విలువలను అర్థం చేసుకుని నేర్చుకోవడానికి ఇది ఏకైక మార్గం” అని మిలింద్ లక్కడ్ చెప్పారు. దాదాపు 70 శాతం మంది ఉద్యోగులు ఇప్పటికే కార్యాలయాలకు రావడం ప్రారంభించారన్నారు.

#Tags