Center for Entrepreneurship on Industry 4.0: స్టార్టప్‌ల కల్పతరువు విశాఖ.. 5 స్టార్టప్‌లతో ఎంవోయూలు

దొండపర్తి (విశాఖ దక్షిణ): అంకుర సంస్థలకు విశాఖపట్నం కల్పతరువుగా మారుతోంది. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకమైన ‘సెంటర్‌ ఫర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఆన్‌ ఇండస్ట్రీ 4.0’ కేంద్రాన్ని ఉక్కు నగరం టౌన్‌షిప్‌లో ఏర్పాటైంది.
కేంద్రాన్ని ప్రారంభిస్తున్న స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌

దీనిని స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌ జూలై 6న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానంగా ఇండస్ట్రీ 4.0 ప్రాజెక్టుతో విశాఖ స్టార్టప్‌ హబ్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. తద్వారా అనేక మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు జిల్లా ఆర్థికాభివృద్ధికి బాటలు పడతాయన్నారు. ఎంఈఐటీవై, ఎస్‌టీపీఐ, ఎస్‌టీపీఐ నెక్ట్స్, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భాగస్వామ్య ఉమ్మడి నిధులతో స్టీల్‌ప్లాంట్‌లో ఇంకుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు ఈ ప్రాజెక్ట్‌ చేపట్టినట్టు చెప్పారు.

చదవండి: ఈ దేశాల నుంచి స్టార్టప్‌ల్లోకి పెట్టుబడులు.. పన్ను లేదు

ఈ సెంటర్‌లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రోబోటిక్స్, డ్రోన్లు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, వర్చువల్‌ రియాలిటీ, అగ్‌మెంటెడ్‌ రియాలిటీ వంటి అంశాలపై ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలు చేపడుతున్నట్టు వివరించారు. ఇది భారతీయ ఆటోమేషన్‌ పరిశ్రమకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. ఎగుమతుల పెరుగుదలకు దోహదం చేస్తూనే, ఆటోమేషన్‌ పరికరాల దిగుమతుల తగ్గుదలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌తో పాటు దేశంలో ఉన్న ఇతర పరిశ్రమల సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా 175 స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. 

చదవండి: T-Hub: అంకుర సంస్థలకు ‘సింగిల్‌ విండో’

5 స్టార్టప్‌లతో ఎంవోయూలు 

ఈ ప్రాజెక్టులో భాగంగా జూలై 6న 5 స్టార్టప్‌ సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) జరిగాయి. ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ సీఈవో అనిల్‌కుమార్, ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ వి.కృష్ణమోహన్, ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ సీవీడీ రామ్‌ప్రసాద్, ఆర్‌ఐఎన్‌ఎల్‌ డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌) ఏకే బాగ్చి సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. స్టార్టప్‌లకు మార్గదర్శక సేవలు అందించే ఎలక్ట్రో ఆప్టికల్‌ సిస్టమ్, ఐఐఎం వైజాగ్, లోటస్‌ వైర్‌లెస్‌ వంటి కల్పతరు భాగస్వాములతో కూడా ఒప్పందాలు జరిగాయి. ఆర్‌ఐఎన్‌ఎల్‌ జీఎం పి.చంద్రశేఖర్, ఎస్‌టీపీఐ అడిషనల్‌ డైరెక్టర్‌ సురేష్‌ భాతా, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులు పాల్గొన్నారు. 

చదవండి: Startup School India (SSI): కలల బడిలోకి...

#Tags