TS DSC, TET Candidates Demands : తెలంగాణ డీఎస్సీ, టెట్ అభ్య‌ర్థుల డిమాండ్లు ఇవే.. ఈ నిబంధనలు తొల‌గించాల్సిందే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : డీఎస్సీ పరీక్షకు ముందే టెట్‌ నిర్వహించాలని చాలా మంది అభ్య‌ర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాల నోటిఫికేష‌న్లు లేక చాలా మంది నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వం పునరాలోచన చేసి టెట్‌ నిర్వహించాలని కోరుతున్నారు. ఎందుకంటే.. డీఎస్సీకి టెట్‌ గండం మెగా డీఎస్సీకి పోటీపడతున్న పలువురు అభ్యర్థులకు టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ గండం పొంచి ఉంది. డీఎస్సీకి ముందు టెట్‌ను నిర్వహించకపోవడంతో టీచర్‌ కొలువులపై ఆశలు వదులుకునే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ఇటీవలే డీఎడ్‌, బీఎడ్‌ పూర్తిచేసిన వారు ఈ రెండు కోర్సుల్లో ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నవారు టెట్‌ లేకపోవడంతో డీఎస్సీకి హాజరయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు. 

టెట్‌ రాసి క్వాలిఫై కాని వారు..

ఇటీవలే 11,062 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ పేరుతో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది సర్కారు. అయితే గతంలో డీఎస్సీకి ముందు టెట్‌ను నిర్వహించేవారు. కానీ ఇప్పుడు టెట్‌ లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీచేశారు. దీంతో గతంలో టెట్‌ రాసి క్వాలిఫై కాని వారు ఇటీవలి కాలంలో డీఎడ్‌, బీఎడ్‌ పూర్తిచేసినవారు తమకు అవకాశం కల్పించాలని రోడ్డెక్కారు. ఇటీవలే అభ్యర్థులంతా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ (డీఎస్‌ఈ)ను ముట్టడించారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో తమ ఆందోళలను తీవ్రతరం చేశారు.

గతంలో క్వాలిఫై కాక మరో చాన్స్‌ కోసం వేచిచూస్తున్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. టెట్‌ లేకుండా నేరుగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయడం వీరికి ఆశనిపాతంగా మారింది. వేలకు వేలు పోసి రాత్రింబవళ్లు డీఎస్సీ కోసం సన్నద్ధమవుతున్న వారిప్పుడు చదువులు పక్కనపెట్టి న్యాయం కోసం రోడ్డెక్కావల్సి వస్తున్నది. 

సుమారు 4 లక్షల మంది టెట్‌ కోసం..

గతంలో నిర్వహించిన టెట్‌కు వివిధ కారణాల వల్ల అనేకమంది గైర్హాజరయ్యారు. 2 లక్షల మంది దాకా అర్హత సాధించలేదు. వారితో పాటు కొత్తగా ఉత్తీర్ణులైనవారితో కలిపి సుమారు 4 లక్షల మంది టెట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2016లో ఒకసారి టెట్‌ జరిగింది. ఆ తర్వాత 2017లో టెట్‌ నిర్వహించి, టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఐదేండ్ల తర్వాత 2022 జూన్‌లో టెట్‌ పరీక్ష నిర్వహించారు. 2023 ఆగస్టులో టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి సెప్టెంబర్‌ 15న పరీక్ష నిర్వహించారు. పేపర్‌-1కు 2,23,582 మంది హాజరయ్యారు. వారిలో 82,489 (36.89 శాతం) మంది మాత్రమే అర్హత సాధించారు. పేపర్‌-2కు 1,90,047 అభ్యర్థులు హాజరవగా 29,073 (15.30 శాతం) మంది అర్హత సాధించారు.

☛ DSC 2024 : డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు అలర్ట్..

రెండు విరుద్ధమైన నిబంధనలు ఒకే నోటిఫికేషన్‌లో..

బీఎడ్‌ ఫైనల్‌ ఇయర్‌, ఫైనల్‌ సెమిస్టర్‌ చదువుతున్నవారు స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్నిచ్చారు. డీఎడ్‌ రెండో సంవత్సరంలోని వారు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నాటికి అన్ని రకాల అర్హతలనూ పొంది ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు. కానీ టెట్‌ విషయానికి వచ్చేసరికి టెట్‌లో అర్హత సాధించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. అంటే అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేనాటికే టెట్‌లో క్వాలిఫై ఉండాలి. దీనికి కొనసాగింపుగా డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తులో టెట్‌ మార్కులు అప్‌లోడ్‌ చేయాలన్న నిబంధన విధించారు. ఇలా రెండు విరుద్ధమైన నిబంధనలు ఒకే నోటిఫికేషన్‌లో గమనార్హం. 

☛ TS DSC 2024 District Wise Posts Details : జిల్లాల వారీగా 11062 టీచర్ల‌ పోస్టుల ఖాళీల వివరాలు ఇవే.. ముఖ్య‌మైన తేదీలు ఇలా..

అభ్య‌ర్థుల డిమాండ్లు ఇవే..
☛ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే వయోపరిమితిని 46 ఏండ్లకు పెంచింది. మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తుందన్న నమ్మకం లేదు. అప్పటికి మా వయోపరిమితి పూర్తవుతుంది. కనుక ఇప్పుడే అవకాశం కల్పించాలి.
☛ తెలంగాణ గురుకుల రిక్రూట్‌మెంట్‌లో ఫలితాలు ప్రకటించిన తర్వాత టెట్‌ మార్కులు అప్‌లోడ్‌ చేసే అవకాశాన్నిచ్చారు. ఇదే విధానాన్ని తాజా డీఎస్సీకి వర్తింపజేయాలి.
☛ గతంలో టెట్‌ ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంది. అనేక మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఈ దృష్ట్యా టెట్‌ను నిర్వహించాలి.
☛ అవకాశముంటే టెట్‌, డీఎస్సీ రెండింటిని ఒకేసారి నిర్వహించాలి.
లేదంటే డీఎస్సీ ఇప్పుడు నిర్వహించినా.. ఫలితాలు ఆపి టెట్‌ను నిర్వహించి, టెట్‌ ఫలితాలు ప్రకటించి, ఆ తర్వాత తుది ఫలితాలు ప్రకటించాలి.

☛ School Assistant Exam 2024 Syllabus & Exam pattern : తెలంగాణ‌లో 2629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేష‌న్‌.. సిల‌బ‌స్ ఇదే..

గ‌త ఏడాది నిర్వహించిన టెట్‌లో 15 శాతమే.. 

టెట్‌ పరీక్ష ఎప్పుడూ అభ్యర్థులను టెన్షన్‌ పెడుతున్నది. ముఖ్యంగా ఎస్‌ఏ జీవశాస్త్రం, భాషాపండితులు తమకు సంబంధం లేని సబ్జెక్టులను టెట్‌ కోసం చదవాల్సిరావడంతో, వాటిపై అవగాహన లేక తీరా పరీక్షల్లో బోల్తా పడి టెట్‌లో క్వాలిఫై కాలేకపోతున్నారు. ఇక పేపర్‌-2లో 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క 2022 మినహా ఎప్పుడూ 30 శాతం లోపే అభ్యర్థులే ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది నిర్వహించిన టెట్‌లో 15 శాతమే ఉత్తీర్ణత నమోదయ్యింది. ఈ నేపథ్యంలోనే టెట్‌ను మరోసారి నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

☛ తెలంగాణ డీఎస్సీ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

#Tags