Telangana CM Revanth reddy : త్వరలోనే భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం ఇలా..! ఇంకా..
గత కొంత కాలంగా ప్రభుత్వ పాఠశాలు నిర్వీర్యం అవుతున్నాయన్నారు. పిల్లలను స్కూల్స్‌లో చేర్పించకపోతే.. ఆ పాఠశాలలు మూతపడుతుందన్నారు. అలాగే బడిబాట కార్యాక్రమం ద్వారా పిల్లల తల్లిదండ్రులకు టీచర్లు అవగాహన కల్పించాలి. గతంలో ఐఏఎస్, ఐపీఎస్, సీఎంలు, కేంద్రమంత్రులు ప్రభుత్వ స్కూల్స్‌లోనే చదివి ఉన్నత స్థానంలోకి వచ్చారు అన్నారు.
స్కూళ్లలో టీచర్లు లేరని..
కొంత కాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. స్కూళ్లలో టీచర్లు లేరని విద్యార్థులు రావట్లేదని విద్యార్థుల్లేరని బడులు మూసివేస్తున్నారు. ఇది కోడి ముందా, గుడ్డు ముందా అన్నట్లుగా తయారైంది. ప్రభుత్వం టీచర్లను పెట్టకపోతే.. విద్యార్థులు రారు.. విద్యార్థులు రావడం లేదనే నెపంతో సింగిల్ టీచర్ పాఠశాలలన్నింటినీ మూసివేసే పరిస్థితి కొనసాగింది. కొన్ని బడుల్లో విద్యార్థుల కన్నా టీచర్ల సంఖ్యే ఎక్కువగా ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకొనే తక్షణమే 11వేల పైచీలుకు పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం.
సింగిల్ టీచర్ బడుల్ని మూసేయడానికి వీల్లేదని.. మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ బడులను నిర్వహించడం ద్వారా పేదలు, దళితులు, గిరిజనులకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. మారుమూల ప్రాంతాల్లోనూ మెరుగైన విద్యనందించడమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.80వేలు ఖర్చుపెడుతోంది. ప్రభుత్వం పెట్టే ఖర్చులో అధికశాతం టీచర్ల వేతనాలకే పోతోంది.
పిల్లలను చేర్పించకపోతే.. పాఠశాల మూతబడుతుందని తల్లిదండ్రులకు చెప్పాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన నాకు వాటి విలువ బాగా తెలుసు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగించాం. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా వారికే ఇచ్చి నిధులు గ్రీన్ ఛానెల్ ద్వారా విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించాం. రూ.2వేల కోట్లు.. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ బడులను బాగు చేసేందుకు ఖర్చు చేస్తున్నాం అన్నారు.
ప్రతి విద్యార్థికీ అమ్మఒడే తొలి పాఠశాల. రెసిడెన్షియల్ స్కూళ్లలో చిన్న చిన్న పిల్లల్ని చేర్పించడం ద్వారా వారిని అమ్మఒడికి దూరం చేస్తున్నారు. దీనివల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధబాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక నివేదికలో తేలింది. ఇదో సామాజిక సమస్యగా మారే ప్రమాదం ఉంది. గతంలో ఒకే సిలబస్‌ను ఏళ్ల తరబడి అమలు చేసేవారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చలేదు. ఇకపై విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సిలబస్ మారుస్తాం. విలువైన సూచనలు ఎవరు చేసినా తప్పక పాటిస్తాం.
ఇప్పుడు 10/10 జీపీఎస్ సాధించిన విద్యార్థులు మళ్లీ ఇంటర్‌లోనూ బాగా రాణించాలి. ప్రతి ఒక్కరూ డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నా అని సీఎం రేవంత్ ఆకాంక్షించారు.
పోస్టుల వివరాలు ఇవే..
విద్యాశాఖ త్వరలోనే డీఎస్సీ ఆన్‌లైన్ ఎగ్జామ్ షెడ్యూల్‌ను రిలీజ్ చేయనుంది. ఇందుకు ఆ దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జులై 17 నుంచి 31 వరకూ డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. 11,062 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ విద్యా శాఖ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ పోస్టుల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టులు 537 అత్యధికంగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో కేవలం 21 మాత్రమే ఉండగా…. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 176 ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 26 పోస్టులు మాత్రమే ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా ఎస్టీటీలు 209గా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 383 ఎస్జీటీ ఖాళీలు ఉన్నాయి. హన్మకొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 158 ఉండగా.. ఎస్జీటీ ఉద్యోగాలు 81 ఉన్నాయి. ఇక జగిత్యాల జిల్లాలో చూస్తే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 99 ఉన్నాయి. ఎస్జీటీ ఉద్యోగాలు 161గా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 86 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 224 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 84 స్కూల్ అసిస్టెంట్ లు ఖాళీగా ఉంటే..137 పోస్టులు ఎస్జీటీలు ఉన్నాయి.