Tata Steel Chess Tournament: ప్రపంచ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌పై ప్రజ్ఞానంద విజయం

ప్రతిష్టాత్మక టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో భారత టీనేజ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద నాలుగో రౌండ్‌ గేమ్‌లో సంచలనం సృష్టించాడు.

క్లాసికల్‌ ఫార్మాట్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ డింగ్‌ లిరెన్‌ (చైనా)పై గెలుపొందాడు. తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద ఈ గేమ్‌లో నల్ల పావులతో ఆడుతూ 62 ఎత్తుల్లో డింగ్‌ లిరెన్‌ను ఓడించాడు.

తాజా ఫలితంతో ప్రజ్ఞానంద లైవ్‌ రేటింగ్స్‌లో 2748.3 పాయింట్లకు చేరుకున్నాడు. దాంతో 2748 పాయింట్లతో భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్న దిగ్గజ ప్లేయర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ను రెండో స్థానానికి పంపించి భారత కొత్త నంబర్‌వన్‌గా ప్రజ్ఞానంద అవతరించాడు. అంతేకాకుండా విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత క్లాసికల్‌ ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్‌ను ఓడించిన రెండో భారతీయ ప్లేయర్‌గానూ ప్రజ్ఞానంద ఘనత సాధించాడు.

వాస్తవానికి ప్రతి నెలాఖరుకు అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) వరల్డ్‌ రేటింగ్స్‌ను విడుదల చేస్తుంది. టోర్నీ జరుగుతున్న సమయంలో లైవ్‌ రేటింగ్స్‌ మార్పులు ఉంటాయి. ప్రస్తుత టాటా స్టీల్ టోర్నీలోని తదుపరి రౌండ్‌లలో ప్రజ్ఞానంద తడబడితే మళ్లీ ఆనంద్‌ నంబర్‌వన్‌ అయ్యే అవకాశాలున్నాయి. 14 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నీని నిర్వహిస్తున్నారు.

నాలుగో రౌండ్‌ తర్వాత ప్రజ్ఞానంద 2.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నాడు. భారత్‌కే చెందిన విదిత్‌ 2 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో, గుకేశ్‌ 1.5 పాయింట్లతో పదో ర్యాంక్‌లో ఉన్నారు. గత ఏడాది జనవరిలోనే జరిగిన టాటా స్టీల్‌ చెస్‌ టోర్నీలో డింగ్‌ లిరెన్‌పై ప్రజ్ఞానంద గెలిచాడు. ఆ తర్వాత ఏప్రిల్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లో రష్యా గ్రాండ్‌మాస్టర్‌ నెపోమ్‌నిష్‌ని ఓడించి డింగ్‌ లిరెన్‌ కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు.

Charvi Anilkumar: చిన్న‌ వయసులోనే ప్రపంచ రికార్డు నెలకొల్పిన చిచ్చరపిడుగు

#Tags