Gukesh: సంయుక్తంగా అగ్రస్థానంలో గుకేశ్

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీ ఓపెన్‌ విభాగంలో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది.

తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల గుకేశ్‌ 12వ రౌండ్‌ తర్వాత 7.5 పాయింట్లతో నకముర (అమెరికా), నిపోమ్‌నిషి (రష్యా)లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. 12వ రౌండ్‌లో గుకేశ్‌ 57 ఎత్తుల్లో నిజాత్‌ అబసోవ్‌ (అజర్‌బైజాన్‌)ను ఓడించాడు. ఈ టోర్నీలో గుకేశ్‌కిది నాలుగో విజయం.
 
భారత్‌కే చెందిన ప్రజ్ఞానంద, విదిత్‌లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నిపోమ్‌నిష్‌తో జరిగిన గేమ్‌ను తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 55 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా.. మహారాష్ట్ర ప్లేయర్‌ విదిత్‌ 52 ఎత్తుల్లో కరువానా (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. నిర్ణీత 14 రౌండ్‌లు ముగిశాక అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్‌ ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌తో ప్రపంచ టైటిల్‌ కోసం పోటీపడతాడు.

మరోవైపు మహిళల విభాగంలో భారత స్టార్‌ కోనేరు హంపి ఖాతాలో ఎనిమిదో ‘డ్రా’ చేరింది. గొర్యాచ్‌కినా (రష్యా)తో జరిగిన 12వ రౌండ్‌ గేమ్‌ను హంపి 25 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఉక్రెయిన్‌ గ్రాండ్‌మాస్టర్‌ అనా ముజిచుక్‌తో జరిగిన గేమ్‌ను భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి 57 ఎత్తుల్లో నెగ్గింది.  హంపి 6 పాయింట్లతో నాలుగో స్థానంలో, వైశాలి 5.5 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు.

Chess Tournament: చెస్‌ టోర్నమెంట్‌ మహిళల విభాగంలో హంపి, వైశాలి విజయం

#Tags