Revanth Reddy To Be Telangana Chief Minister: తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి.. 7న ప్ర‌మాణ‌స్వీకారం..

తెలంగాణ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌రెడ్డి(54) ప్రమాణం చేయబోతున్నారు.
Revanth Reddy to be Telangana Chief Minister

 సీఎల్పీ నేతగా ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ. మంగళవారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ నిర్ణయం వెల్లడించారు.

‘సీఎల్పీ భేటీలో మూడు తీర్మానాలు చేశారు. అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నాక తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును ప్రకటిస్తున్నాం. సీనియర్లందరికీ న్యాయం జరుగుతుంది. అంతా టీంగా పని చేస్తారు’’ అని కేసీ వేణుగోపాల్‌ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.  

కుటుంబ నేప‌థ్యం :

టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో కొండారెడ్డి ప‌ల్లి, వంగూర్‌లో న‌వంబ‌ర్ 08, 1969న జ‌న్మించారు. వీరిది వ్య‌వ‌సాయ కుటుంబం. తండ్రి పేరు దివంగ‌త అనుముల న‌ర్సింహ రెడ్డి. త‌ల్లి అనుముల రామ‌చంద్ర‌మ్మ‌. ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కుడు జైపాల్ రెడ్డి మేన‌కోడ‌లు గీతాను రేవంత్ రెడ్డి వివాహ‌మాడారు.

చిన్న‌నాటి నుంచే..

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కి చెందిన రేవంత్ రెడ్డి చిన్న‌నాటి నుంచే రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తి క‌న‌బ‌రిచేవారు. గ్రాడ్యూయేష‌న్ చ‌ద‌వుతున్న స‌మ‌యంలో ఆయ‌న అఖిల భార‌త విద్యార్థి ప‌రిష‌త్ నాయ‌కుడిగా ఉన్నారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ఏ.వీ. కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన త‌ర్వాత ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కుడు జైపాల్ రెడ్డి మేన‌కోడ‌లు గీతాను వివాహ‌మాడారు. 

రాజ‌కీయ ప్ర‌స్థానం..

ఒక సాధారణ మండల నాయకుడిగా టీఆర్ఎస్‌లో మొదలైన రేవంత్ రెడ్డి ప్రస్థానం.. ఆ పార్టీలో టికెట్ దక్కకపోవడంతో టీడీపీలోకి మారేలా చేసింది. ఆ తర్వాత చంద్రబాబుకు సన్నిహితుడిగా ఆయన మదిని దోచి.. ఆయనకు నమ్మినబంటుగా పార్టీలో ఎదిగేవరకూ వెళ్లింది.ఒకనాక దశలో టీడీపీ తెలంగాణ బాధ్యతలు రేవంత్ రెడ్డికి వచ్చాయి. అనంతరం తెలుగుదేశం తెలంగాణలో అంతర్థానంతో రేవంత్ రెడ్డి పార్టీ మారాల్సి వచ్చింది. తనకు బద్ధ శత్రువైన కేసీఆర్ ను వ్యతిరేకించే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 

1992 విద్యార్థిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న అఖిల భార‌త విద్యార్థి ప‌రిష‌త్‌లో స‌భ్యుడయ్యారు.  2004 ఆయ‌న తెలుగుదేశం పార్టీలో చేరారు. 2006 జెడ్‌టీపీసీ ఎన్నిక‌ల్లో మిడ్జిల్ స్థానం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి నెగ్గారు. 2008 శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి విజ‌యం సాధించారు. 2009 ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న గెలుపొందారు. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గురునాథ్ రెడ్డిని ఓడించారు. 2014 కొడంగ‌ల్ నుంచి మ‌రోమారు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి గురునాథ్ రెడ్డిపై గెలిచి రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.   

#Tags