HMPV in India: భారత్‌లో హెచ్‌ఎంపీవీ కలకలం.. ఒకేరోజు దేశవ్యాప్తంగా ఐదు కేసులు నమోదు..!!
జనవరి 6వ తేదీ ఒక్క రోజే దేశవ్యాప్తంగా ఐదు కేసులు వెలుగు చూశాయి. గుజరాత్‌లో ఒకరు, కర్నాటకలో ఇద్దరు నెలల చిన్నారులకు హెచ్‌ఎంపీవీ సోకినట్టు నిర్ధారణ అయింది. తమిళనాడులో కూడా రెండు కేసులు నమోదయ్యాయి.
శ్వాస సంబంధిత సమస్యలకు దారి తీసే ఈ వైరస్ చైనాలో భారీగా మరణాలకు కారణమవుతున్నట్టు వస్తున్న వార్తలు, కరోనా తాలూకు అనుభవాల నేపథ్యంలో భారత్‌లోనూ తొలిసారి హెచ్‌ఎంపీవీ కేసులు నమోదవడం కలకలం రేపింది. అయితే ఆందోళన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. హెచ్‌ఎంపీవీ ప్రాణాంతకమేమీ కాదని తెలిపింది.
‘‘శ్వాస ద్వారా గాలిలో వ్యాపించే హెచ్‌ఎంపీవీ అన్ని వయసుల వారినీ ప్రభావితం చేయగలదు. అలాగని భయపడాల్సిన అవసరమేమీ లేదు. ఇది కేవలం మూమూలు శ్వాస సంబంధిత సమస్యేనని ఆరోగ్య నిపుణులు ఇప్పటికే నిర్ధారించారు. పైగా హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్ కూడా కాదు. దీన్ని 2001లోనే తొలిసారి గుర్తించారు. అప్పటినుంచీ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో తరచూ కనిపిస్తూనే ఉంది’’ అని వివరించింది.
ముందుజాగ్రత్తగా దేశవ్యాప్తంగా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ‘చైనాలో పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పటికైతే దేశంలో ఎక్కడా అదనపు హెచ్‌ఎంపీవీ కేసులు వెలుగు చూడలేదు. శ్వాస సంబంధిత కేసుల్లో అసాధారణ పెరుగుదల కూడా నమోదవలేదు’ అని స్పష్టం చేశారు.
అసాధారణ పరిస్థితులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కోవడానికి కేంద్రం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నట్టు మంత్రి ప్రకటించారు. ‘‘హెచ్‌ఎంపీవీకి సంబంధించి అంతర్జాతీయంగా ప్రస్తుత పరిస్థితి తదితరాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి నివేదిక కోరాం. తన వద్ద అందుబాటులో ఉన్న వివరాలను త్వరలో మనతో పంచుకోనుంది’’ అని ఒక ప్రకటనలో వివరించారు.
ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు..
తమిళనాడు, కర్నాటక, గుజరాత్ ప్రభుత్వాలు ఈ వైరస్‌కు ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని ప్రకటించాయి. హెచ్‌ఎంపీవీ కేసుల నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అప్రమత్తమయ్యాయి. తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలను గురించి ప్రజలను హెచ్చరిస్తున్నాయి. కర్నాటక ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మాసు్కలు ధరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కర్నాటకలో ఎనిమిది నెలల బాబు, మూడు నెలల పాప హెచ్‌ఎంపీవీ బారిన పడ్డారు.
ప్రమాదకారి కాదు
హెచ్‌ఎంపీవీ. ప్రస్తుతం దేశమంతటినీ ఆందోళనకు గురిచేస్తున్న వైరస్. కానీ కరోనా మాదిరిగా ఇది ప్రమాదకారి కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హెచ్‌ఎంపీవీ ఇతర సాదాసీదా శ్వాసకోశ వైరస్‌ల వంటిది మాత్రమేనని కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ (డీజీహెచ్‌ఎస్) డాక్టర్ అతుల్ గోయల్ తెలిపారు. చైనాలో వెలుగు చూసిన హెచ్‌ఎంపీవీలో జన్యు పరివర్తనాలు జరిగాయని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పడమే తప్ప నిర్ధారణ కాలేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. కరోనాలా ఇది మహమ్మారిగా మారే ప్రమాదమేమీ లేదని వివరించింది. హెచ్‌ఎంపీవీని తొలిగా 2001లో నెదర్లాండ్స్‌లో 28 మంది చిన్నారుల్లో గుర్తించారు.
దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..
- దగ్గు, తుమ్ము వంటివాటి ద్వారా హెచ్‌ఎంపీవీ వ్యాపిస్తుంది. శ్వాసనాళంలో ఎగువ, దిగువ భాగాలను ప్రభావితం చేస్తుంది.
- జలుబు, ముక్కు కారడం, దగ్గుతో పాటు కొన్నిసార్లు ముఖంపైనా, ఒళ్లంతా ఎర్రని దద్దుర్లు, కొద్దిపాటి జ్వరం రావచ్చు. ఇది శ్వాస ఇబ్బందులకు, నిమోనియా, బ్రాంకైటిస్‌కు దారి తీయడం అరుదే.
- హెచ్‌ఎంపీవీని ఆర్టిపీసీఆర్ ద్వారా నిర్ధారించవచ్చు. ఇది వారంలోపే తగ్గిపోతుంది. చిన్నారులు, వృద్ధులపై ప్రభావం ఎక్కువ.
- మాస్క్ ధరించడం, చేతులను సబ్బుతో బాగా కడుక్కోవడం వంటివి పాటించాలి.
- హెచ్‌ఎంపీవీకి ఇప్పటికైతే వ్యాక్సీన్, కచ్చితమైన చికిత్స లేవు.