Russia Presidential Elections: రష్యా ఎన్నికల్లో పుతిన్ మరోసారి ఘన విజయం, మరో ఆరేళ్ల పాటు..
మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ మరోసారి ఘన విజయం సాధించారు. ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్‌కు రికార్డుస్థాయిలో 88 శాతం ఓట్లు లభించినట్లు తెలుస్తోంది. మార్చి 15న ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ మూడు రోజుల పాటు జరిగి 17న ముగిశాయి. 1999 నుంచి దేశ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న పుతిన్ తాజా విజయంతో మరో ఆరేళ్లపాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. ఈ ఎన్నికల్లో పుతిన్‌తో కలిపి నలుగురు అధ్యక్ష పదవికి పోటీపడ్డారు.
కాగా, చివరిరోజు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని, పుతిన్ విధానాలను వ్యతిరేకిస్తున్నవారు పోలింగ్ కేంద్రాలకు రావాలని ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రతిపక్ష నేత నావల్నీ మద్దతుదారులు ఇచ్చిన పిలుపుతోనే చివరిరోజు ఓటర్లు పోటెతినట్లు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు జరిగాయి.
కొన్నిచోట్ల బ్యాలెట్ పెట్టెల్లో ఇంకు పోశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు అరెస్టయ్యారు. బలమైన ప్రత్యర్థులు, పుతిన్‌ను గట్టిగా విమర్శించేవారెవరూ లేకుండానే ఎన్నికలు కొనసాగాయి. పలు యూరప్ దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న రష్యా దౌత్య కార్యాలయాల్లో పెద్దఎత్తున రష్యా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఉక్రెయిన్ నుంచి రష్యాపైకి డ్రోన్లు దూసుకొచ్చాయి. ఎన్నికలను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది.