Eknath Shinde:మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే

Eknath Shinde Meet Maharashtra's new Chief Minister

మహారాష్ట్ర నూతన (20వ) ముఖ్యమంత్రిగా శివసేన రెబెల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాత్రి 7.30 గంటల తర్వాత రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీ వారిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనూహ్యమైన మలుపులు చోటుచేసుకున్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడింది. మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం కూలిపోయిన 24 గంటల్లోనే.. రాజకీయ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ శివసేన తిరుగుబాటు వర్గం–బీజేపీ కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 

Also read: GK International Quiz: ప్రపంచంలోనే అతిపెద్ద గ్లాస్ బాటమ్ బ్రిడ్జిని ఏ దేశంలో ప్రారంభించారు?

ఏక్‌నాథ్‌ షిండే తొలుత దివంగత శివసేన అగ్రనేతలు బాల్‌ ఠాక్రే, ఆందన్‌ డిఘేకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు.  సీఎంగా తన నియామకం బాల్‌ ఠాక్రే సిద్ధాంతానికి, తన గురువు ‘ధర్మవీర్‌’ఆనంద్‌ డిఘే బోధనలకు లభించిన విజయమని వెల్లడించారు. మహారాష్ట్ర కొత్త ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉండడం లేదంటూ దేవేంద్ర ఫడ్నవీస్‌ మొదట ప్రకటించారు. అయినప్పటికీ ప్రభుత్వ పరిపాలన సాఫీగా సాగడానికి తన వంతు సాయం అందిస్తానన్నారు. కొద్దిసేపటి తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా స్పందిస్తూ.. ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని నూతన మంత్రివర్గంలో ఫడ్నవీస్‌ ఒక సభ్యుడిగా కొనసాగుతారని తేల్చిచెప్పారు. బీజేపీ పెద్దల ఆదేశాలతో మంత్రివర్గంలో చేరడానికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఫడ్నవీస్‌ అంగీకరించినట్లు సమాచారం.

#Tags