Skip to main content

Artificial intelligence: ఏఐ సాఫ్ట్‌వేర్లు మోసం చేస్తున్నాయి.. ఆ విషయంలో కృత్రిమ మేథను నమ్మలేం

Artificial intelligence

తమిళ దర్శకుడు శంకర్‌ తీసిన రోబోకు.. విల్‌స్మిత్‌ హీరోగా నటించిన హాలీవుడ్‌ సినిమా ‘ఐ రోబో’లో కామన్‌ ఏమిటో మీకు తెలుసా? రెండింటిలోనూ యంత్రాలు తమను తయారు చేసిన మనుషులను మోసం చేస్తాయి! కల్పిత కథలతో తీసిన సినిమాలు కదా.. ఎలా ఉంటే ఏం అని అనుకోవద్దు? ఎందుకంటే ఇప్పుడు నిజజీవితంలోనూ ఇలాంటివి నిజమయ్యే అవకాశం ఏర్పడింది. ఎందుకలా అని అనుకుంటూంటే చదివేయండీ ప్రత్యేక కథనాన్ని!

కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. సౌకర్యాలు పెంచింది.. కష్టాన్ని తగ్గించింది. సలహా, సూచనలు ఇచ్చేందుకూ ఉపయోగపడుతోంది. అయితే నాణేనికి రెండోవైపు ఉన్నట్లే ఈ కృత్రిమ మేధతో కొన్ని ఇబ్బందులూ లేకపోలేదు. ఉద్యోగాలకు ఎసరు పెట్టడం.. తప్పుడు సమాచారంతో వినియోగదారులను తప్పుదోవ పట్టించడం వంటి దుష్ప్రభావాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి.

అయితే... ఇటీవలి కాలంలో ఈ కృత్రిమ మేధ మరింత ముదిరిపోయిందని... మరీ ముఖ్యంగా ఛాట్‌బోట్లు నమ్మకంగా ఉన్నట్లు నటించడమూ నేర్చుకున్నాయని అంటున్నారు ఎంఐటీ (మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) గణిత శాస్త్రవేత్త పీటర్‌ పార్క్‌. ఈ విషయం డెవలపర్లకు కూడా తెలియకపోవడం మరింత ఆందోళన కలిగించేదని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘కృత్రిమ మేధతో పనిచేసే రెండు బోట్లు పోటీపడినప్పుడు ప్రత్యర్థికంటే ఒక మెట్టు పైనుండాలనే ఆలోచనతో అవి మోసానికి పాల్పడే అవకాశం ఉంది.’’ అని పీటర్‌ పార్క్‌ ఇటీవలే ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. గేమింగ్‌ వంటి అప్లికేషన్లలో ఏఐ సిస్టమ్‌లు చాలా నమ్మకంగా పనిచేస్తాయని మనం అనుకుంటూ ఉంటామని, కానీ జరుగుతున్నది ఇందుకు భిన్నమని చెప్పారు. ‘‘ఏ ఆటలోనైనా గెలుపుకోసం ప్రయత్నం జరుగుతుంది.

మెటా సిద్ధం చేసిన గేమింగ్‌ సాఫ్ట్‌వేర్‌నే ఉదాహరణగా తీసుకుందాం. సైసెరో ‘డిప్లొమసీ’ అనే ఈ గేమ్‌లో ఏఐ బోట్‌ నిజాయితీగా పనిచేసేలా కోడ్‌ రాశారు. అయితే వాస్తవానికి వచ్చేసరికి అది ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. ఉద్దేశపూర్వకంగా తన యూజర్‌ను మోసం చేస్తోంది. డిప్లొమసీతోపాటు డీప్ ‌మైండ్‌ అభివృద్ధి చేసిన ఆల్ఫాస్టార్‌, స్టార్‌క్రాఫ్ట్‌2..వంటి ఆటల్లోనూ ఏఐ సాఫ్ట్‌వేర్లు మోసం చేస్తున్నాయి’ అని పీటర్‌ వివరిస్తున్నారు.

10th & 12th Class పరీక్షా ఫలితాలలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు హీరో సాయం.. త్వరలో కలుస్తానంటూ మెసేజ్‌

 

ఆర్థిక వ్యవహారాల్లోనూ శిక్షణ...

కృత్రిమమేధ ఆర్థిక అంశాలకు సంబంధించిన చర్చల్లోనూ పాల్గొనేలా శిక్షణ పొందుతున్నాయి. ఏదైనా అంశంపై ఇన్‌పుట్స్‌తో చర్చకు సిద్ధం అయితే దాన్ని అనుకరించేలా ఏఐను వాడుతున్నారు. అయితే అందులో పైచేయి సాధించడానికి ఎలా అబద్ధాలు చెప్పాలో నేర్చుకుంటాన్నాయని పార్క్‌ చెప్పారు.

ఏఐ డెవలపర్‌లు, రెగ్యులేటర్‌లు వాటికి భద్రతా పరీక్షలు చేస్తుంటారు. ఏఐ క్రమపద్ధతిలో ఈ పరీక్షల్లోనూ మోసం చేసి నెగ్గుతోందని పార్క్‌ అంటున్నారు. ‘‘ఏఐ ఏదైనా అంశంపై అబద్ధం చెప్పడం నేర్చుకుంటే అదో పరిష్కరించలేని సమస్యగా మారుతుంది.. వీటి పరిష్కారానికి యూరోపియన్ యూనియన్‌ ఇటీవలే ఒక చట్టాన్ని రూపొందించింది. అవి అమలులోకి వస్తున్నాయి. అయితే వాటి ప్రభావం ఏమేరకు ఉంటుందో చూడాలి’’ అని పార్క్‌ అన్నారు.

కృత్రిమమేధ మోసపూరిత సామర్థ్యాలు మరింత అభివృద్ధి చెందుతాయి. దాంతో సమాజానికి ప్రమాదం పొంచి ఉందని పార్క్‌ అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఏఐ ఉత్పత్తులు, జనరేటివ్‌ ఓపెన్ సోర్స్ మోడల్‌లు చేయబోయే మోసానికి కళ్లెం వేయాలంటే మనకు మరింత సమయం కావాలంటున్నారు. ప్రస్తుతానికి ఏఐ మోసాన్ని కట్టడి చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ సమీప భవిష్యత్తులో దీన్ని ప్రమాదంగా పరిగణించాలని పార్క్‌ చెప్పారు.
 

 

Published date : 14 May 2024 05:03PM

Photo Stories