Nobel Prize in Economics: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ అవార్డు.. ఎవ‌రెవరికంటే..

దేశంలోని సంస్థలు, వ్యవస్థల అసమర్థత కారణంగా ఆ దేశం ఎలా పేదరికంలోనే మగ్గిపోతుందనే అంశాలపై విస్తృత పరిశోధనలు చేసిన ముగ్గురు ఆర్థికవేత్తలకు అర్థశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్‌ పురస్కారం దక్కింది.

ఆయా సమాజాల్లో నిబంధనలను తుంగలో తొక్కడం, సంస్థలు, వ్యవస్థల్లో లోపాలు ఆ దేశాభివృద్ధికి ఎలా పెనుశాపాలుగా మారతాయనే అంశాలను డరేన్‌ ఎసిమోగ్లూ, సైమన్‌ జాన్సన్, జేమ్స్‌ ఏ రాబిన్సన్‌లు చక్కగా విడమర్చి చెప్పారని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ సైన్స్‌ విభాగ నోబెల్‌ కమిటీ కొనియాడింది. 

ఈ మేరకు ముగ్గురికీ నోబెల్‌ను ప్రకటిస్తూ అక్టోబ‌ర్ 14వ తేదీ కమిటీ ఒక ప్రకటన విడుదలచేసింది. ఎసిమోగ్లూ, జాన్సన్‌లు అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో సేవలందిస్తుండగా షికాగో విశ్వవిద్యాలయంలో రాబిన్సన్‌ పనిచేస్తున్నారు. 

‘దేశాల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించడం అనేది శతాబ్దాలుగా ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఆదాయ, ఆర్థికాభివృద్ధి అసమానతలను రూపుమాపడంలో అక్కడి వ్యవస్థల కీలకపాత్రను ఆర్థికవేత్తలు స్పష్టంగా పేర్కొన్నారు’ అని ఆర్థికశాస్త్ర కమిటీ చైర్మన్‌ జాకబ్‌ సెవెన్‌సన్‌ వ్యాఖ్యానించారు. తనకు నోబెల్‌ రావడంపై 57 ఏళ్ల ఎసిమోగ్లూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. 

Nobel Prize 2024: భౌతికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి.. వారెవ‌రంటే..
   
దేశాలు ఎందుకు సక్సెస్‌ కాలేవు? 
అవార్డ్‌ విషయం తెలిశాక తుర్కియే దేశస్థుడైన ఎసిమోగ్లూ మాట్లాడారు. ‘ప్రజాస్వామ్యయుత వ్యవస్థల గొప్పతనాన్ని ఈ అవార్డ్‌ గుర్తించింది. అభివృద్ధిలో దేశాలు ఎందుకు వెనుకబడతాయని రాబిన్సన్, నేను కలిసి పరిశోధించాం. ప్రజాస్వామ్యం అనేది సర్వరోగ నివారిణి కాదు. ఒక్కోసారి ఎన్నికలు వచ్చినప్పుడే సంక్షోభాలు ముంచుకొస్తాయి’ అని అన్నారు. ఒకే పార్టీ ఏలుబడిలో ఉన్న చైనా ఎలా అభివృద్ధి పథంలో దూసుకుపోగల్గుతోందని విలేఖరులు ప్రశ్నించగా.. ‘శక్తివంతమైన అధికారయంత్రాంగం ఉన్న చైనా లాంటి దేశాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, వినూత్న ఆవిష్కరణల కోసం ఎన్నో అవరోధాలను దాటుతున్నారు’ అని అన్నారు. 

12 ఏళ్ల క్రితం ఎసిమోగ్లూ, రాబిన్సన్‌ రాసిన ‘వై నేషన్స్‌ ఫెయిల్‌: ది ఆరిజన్స్‌ ఆఫ్‌ పవర్, ప్రాస్పారిటీ, పూర్‌’ పుస్తకం అత్యధిక కాపీలు అమ్ముడుపోయింది. వ్యక్తుల తప్పిదాలే ఆయా దేశాలను పేదదేశాలుగా మిగిలిపోవడానికి కారణమని రచయితలు ఆ పుస్తకంలో వివరించారు. సరిగ్గా అమెరికా–మెక్సికో సరిహద్దులో ఉన్న ఆరిజోనా రాష్ట్ర నోగేల్స్‌ సిటీ భిన్న పరిస్థితులను ఆర్థికవేత్తలు చక్కటి ఉదాహరణగా తీసుకున్నారు. అమెరికా వైపు ఉన్న నోగేల్స్‌ సిటీ ఉత్తరప్రాంత వాసులు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఆయుర్దాయం ఎక్కువ. 

ఎక్కువ మంది విద్యార్థులు హైస్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేస్తున్నారు. అదే దక్షిణవైపు ప్రాంత ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. అక్కడ వ్యవస్థీకృత నేరాలు ఎక్కువ. ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేయడం కూడా రిస్క్‌తో కూడిన వ్యవహారం. అవినీతి రాజకీయనేతలను అధికారం నుంచి కిందకు దింపడం కూడా చాలా కష్టం. అమెరికాలో అయితే పౌరుల ఆస్తిహక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఇలాంటి విధానాలే ఒకరకంగా దేశం బాగుపడటానికి బాటలువేస్తాయ‌ని ఎసిమోగ్లూ వివరించారు.  

Nobel Prize in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు
 
వ్యవస్థలకు తగ్గుతున్న ఆదరణ 
దురదృష్టవశాత్తు ఇటీవలి కాలంలో అమెరికా, యూరప్‌లలో ప్రజాస్వామ్యయుత వ్యవస్థలకు ఆదరణ తగ్గుతోంది. తమకు అన్యాయం జరిగిందని ప్రజలు భావించిన సందర్భాల్లో ప్రజాస్వామ్యదేశాలు ఓడిపోయినట్లే లెక్క. ఇలాంటి ఉదంతాలు ప్రజాస్వామ్యదేశాలు మేల్కొనాల్సిన తరుణం వచ్చిందని గుర్తుచేస్తాయి. సుపరిపాలన అందించేందుకు దేశాలు మళ్లీ ప్రయత్నించాల‌ని ఎసిమోగ్లూ అన్నారు.

#Tags