Pakistan Crisis: పాక్‌ దివాళా..? బతుకు దుర్భరం.... తన్నులాటలో ఒకరు మృతి

ఆక్‌..పాక్‌.. కరివేపాకు ... అంటూ హేళన చేసేవాళ్లం. కానీ, ఇప్పుడు అదే నిజమయ్యే పరిస్థితులు పాకిస్తాన్‌లో నెలకొన్నాయి. ఆకులు కొనాలన్నా, కరివేపాకు కొనాలన్నా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
News about Pakistan Economic Crisis In Telugu

కిలో ఉల్లి రూ.220, చికెన్‌ కిలో రూ.400 ధర పలుకుతున్నాయి. గత ఏడాది 36 రూపాయలు ఉన్న కిలో ఉల్లి ధర  501 శాతం పెరిగి రూ. 220 గా ఉంది. చికెన్‌  కిలో రూ.210 నుంచి రూ.400కి, పప్పుధాన్యం దాదాపు రూ.151 నుంచి రూ.228కి ఎగబాకింది. పాలు లీటరు రూ. 150కి కొనాల్సిన దుస్థితి. 

పాకిస్తాన్‌ ప్రజలు బియ్యంతో పాటు గోధుమపిండిని కూడా ఎక్కువగా వినియోగిస్తారు. ప్రస్తుతం గోధమపిండి కిలో రూ.160కి చేరింది. దీంతో అక్కడక్కడ ప్రభుత్వం రాయితీపై పిండిని అందిస్తోంది. దీంతో జనాలు ఎగబడుతున్నారు. ఖైబర్‌ పఖ్తూంక్వా, సింధ్, బలూచిస్తాన్‌  ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో తొక్కిసలాట, తన్నులాటలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన సంఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

మరోవైపు పాకిస్తాన్‌ ను ద్రవ్యోల్బణం హడలెత్తిస్తోంది. 2021 డిసెంబర్‌లో పాక్‌ ద్రవ్యోల్బణం 12.3 శాతం కాగా, 2022 డిసెంబర్‌లో 24.5 శాతం నమోదయ్యింది. ఆహార ద్రవ్యోల్బణం ఒక ఏడాదిలోనే 11.7 శాతం నుంచి 32.7 శాతానికి చేరింది. పాకిస్తాన్‌ లో విదేశీ మారక నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి.

2021 డిసెంబర్‌లో 23.9 బిలియన్‌ డాలర్లు ఉండగా, 2022 డిసెంబర్‌లో కేవలం 11.4 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. విదేశీమారక నిల్వలు అడుగంటడంతో దిగుమతులపై భారీగా ఆంక్షలు విధించాల్సి వస్తోంది. పెట్రోల్, డీజిల్‌ ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇవే పరిస్థితులు కొనసాగితే శ్రీలంకలాగే పాకిస్తాన్‌ కూడా దివాళా తీస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 

#Tags