Inspirational Women Success Story : నా భర్త సవాలుకు సై కొట్టా.. నేడు కోట్లకు అధినేత్రి అయ్యానిలా..
అయితే వారికి ఆశించిన తోడ్పాటు, ఆర్థిక వనరులు ఉండవు. దీంతో తమ వ్యాపార ఆలోచనను అక్కడితోనే ఆపేస్తుంటారు. కానీ కేరళకు చెందిన ఒక గృహిణి ఇంట్లోనే ఉంటూ.. లోదుస్తులు, ఇన్నర్‌వేర్ బ్రాండ్‌ను ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తోంది. తనకంటూ సొంత పేరును సంపాదించుకుంది. ఈమే కేరళకు చెందిన షీలా కోచౌఫ్. ఈ నేపథ్యంలో షీలా కోచౌఫ్ సక్సెస్ జర్నీ మీకోసం..
భర్త రెండు షరతులు పెట్టాడు.. అవి..
కేరళకు చెందిన షీలా కోచౌఫ్.. ఒక వ్యాపారవేత్త భార్య. వారిది బాగా స్థిరపడిన కుటుంబం. అయినా ఆమె తనకంటూ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని భావించింది. తన ఆలోచనను భర్తతో పంచుకుంది. కానీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆమె భర్త రెండు షరతులు పెట్టాడు. ఒకటి వ్యాపారానికి కుటుంబానికి సంబంధించిన డబ్బును వాడుకోకూడదు. రెండోది వ్యాపార కార్యాలయానికి ఖాళీగా అద్దె కట్టకూడదు.
భర్త సవాలుకు సై అంటూ..
చాలా సంవత్సరాలు గృహిణిగా ఉన్న షీలా, తన భర్త సవాలును స్వీకరించింది. ఒక బ్యాంకు నుంచి చిన్నపాటి లోన్ తీసుకొని వీ-స్టార్ క్రియేషన్స్ అనే తన లోదుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. అలా బ్యాంకు రుణంతో 1995లో ఓ 10 మందితో చిన్న బట్టల వ్యాపారంగా ప్రారంభించింది. కేరళలో విక్రయిస్తున్న ఇన్నర్‌వేర్ లోదుస్తులు చాలామటుకు ముంబై, బెంగళూరు ప్రాంతాల నుంచి వస్తున్నాయని గ్రహించిన ఆమె రాష్ట్రంలోనే స్థానిక బ్రాండ్‌గా ఎదిగే లక్ష్యంతో వివిధ డిజైన్‌లు, రంగులతో నాణ్యమైన లోదుస్తులు, ఇన్నర్‌వేర్‌లను తయారు చేయడం ప్రారంభించింది. ప్రారంభంలో బ్రాలు, ప్యాంటీలను 10 మంది ఉద్యోగులు చేతితో కుట్టేవారు.
సింపుల్ డిజైన్లు, అందుబాటు ధరల కారణంగా వీ-స్టార్ క్రియేషన్స్ వృద్ధి చెందడం ప్రారంభించింది. ఇప్పుడు మల్టీ-మిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. 1995లో షీలా కొచౌఫ్ స్థాపించిన వీ-స్టార్ క్రియేషన్స్ ఆదాయం 2022 నాటికి దాదాపు రూ.500 కోట్లకు చేరుకుందని టోఫ్లర్ పేర్కొంది. జీ బిజినెస్ ప్రకారం.. షీలా కోచౌఫ్ మొత్తం నెట్‌వర్త్ 2020లో రూ.540 కోట్లు ఉంటుంది. ఇప్పుడు ఇంకా కంపెనీ టర్నోవర్ పెరిగే ఉంటుంది.
షీలా కోచౌఫ్ సక్సెస్ జర్నీ నేటి మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాగే మహిళలను తలుచుకుంటే... ఏదైన సాధించవచ్చుని షీలా కోచౌఫ్ సక్సెస్ ఉదాహరణ.