Govt Medical College: వైద్య కళాశాల పనులు షురూ

పాలకొల్లు అర్బన్‌: ప్రజారోగ్యమే పరమావధిగా, గ్రామీణ విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు సంకల్పించారు. దీనిలో భాగంగా భీమవరం కేంద్రంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేశారు. పాలకొల్లు మండలం దగ్గులూరులో వైద్య కళాశాల నిర్మాణానికి రూ.475 కోట్ల నిధులు విడుదల చేశారు. ఎంబీబీఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులతో పాటు ప్రత్యేక వై ద్య విభాగాలు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని 20 మండలాలతో పాటు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ప్రజలకు సేవలందించేలా దగ్గులూరులో వైద్య కళాశాల నిర్మాణ
పనులు చురుగ్గా సాగుతున్నాయి.

100 మంది నుంచి 61 ఎకరాల సేకరణ
దగ్గులూరులో వైద్య కళాశాల నిర్మాణానికి భూములిచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సుమారు 100 మంది రైతుల నుంచి ప్రభుత్వం 61 ఎకరాలు సేకరించింది. భూములకు ఆశించిన ధర కన్నా అదనంగా ప్రభుత్వం చెల్లించడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పనులు చురుగ్గా సాగడం చూసి సంతోషపడుతున్నారు.

చ‌ద‌వండి: Govt and Private Schools: సజావుగా ‘సీస్‌’ పరీక్ష

మెగా ఇంజనీరింగ్‌కి పనులు
వైద్య కళాశాల నిర్మాణ పనులను మెగా ఇంజనీరింగ్‌ సంస్థ చేపట్టింది. ప్రస్తుతం నిర్మాణ ప్రాంతంలో సుమారు రూ.50 కోట్ల విలువైన నిర్మాణ సామగ్రి అందుబాటులో ఉంచారు. పనులు ప్రారంభించిన నాటి నుంచి రెండున్నరేళ్లలో పూర్తిచేసి అప్పగించేలా మెగా ఇంజనీరింగ్‌ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

200 పిల్లర్ల నిర్మాణం
కళాశాల ప్రాంగణంలో 200 పిల్లర్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీని కోసం 27 మీటర్ల లోతు, 7.50 అడుగుల వ్యాసార్థంలో పనులు చేపట్టారు. 50 మంది సాంకేతికత, 150 మంది సాంకేతికేతర సిబ్బంది పనుల్లో నిమగ్నమయ్యారు. నిర్మాణ ప్రాంతంలో ప్రత్యేక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మించారు. అలాగే సిమెంట్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేశారు. రూ.50 కోట్ల విలువైన యంత్రాలతో పనులు జరుగుతున్నాయి. వాహనాల రాకపోకలకు కోసం తాత్కాలికంగా గ్రావెల్‌ రోడ్లు నిర్మించారు. 2025–26 విద్యా సంవత్సరంలో కళాశాలలో తరగతులు నిర్వహించే లక్ష్యంతో పనులు చేస్తున్నారు.

#Tags