Veer Gatha 4.0: దేశభక్తి పెంపునకు ‘వీర్‌గాథ’

విద్యారణ్యపురి: పాఠశాల స్థాయి విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో వీర్‌ గాథ 4.0 పోటీలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఇందులో భాగంగా మూడో తరగతి విద్యార్థుల నుంచి ఇంటర్‌ విద్యార్థుల వరకు పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు రక్షణ, విద్యామంత్రిత్వ శాఖ సంయుక్తంగా వీర్‌గాథ 4.0 పేరిట పోటీలకు సంబంధించి డీఈఓ జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రిన్సిపాళ్లకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. హనుమకొండ జిల్లాలో అన్ని యాజమాన్యాలు కలిపి మొత్తం 967 పాఠశాలలు ఉన్నాయి.

ఆయా పాఠశాలల్లో, విద్యా సంస్థల్లో మొదటగా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పోటీలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ వివరాలన్నీ వీర్‌గాథ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా.. గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలైన సైనిక వీరుల ధైర్య సహసాలు, త్యాగాలు, జీవిత గాథలను నేటి విద్యార్థులకు పరిచయం చేయడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు, వెబినార్ల ద్వారా వివిధ సెషన్లలో దృశ్యరూపకంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

చదవండి: World Record: గిన్నిస్‌ రికార్డు.. ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషీన్‌ను రూపొందించిన భారతీయుడు..!

20లోగా పోటీలు..

అక్టోబర్ 20వ తేదీలోగా పాఠశాల స్థాయిలో పోయమ్‌ రైటింగ్‌, ఎస్సే రైటింగ్‌, డ్రాయింగ్‌, పెయింటింగ్‌ పోటీలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతీ కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచిన ఎంట్రీని (మొత్తం 4 ఎంట్రీలు) ప్రధానోపాధ్యాయుడు ఆదివారంలోగా మైగౌట్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
ఉన్నతాధికారులు జిల్లా స్థాయిలో మొదటి నలుగురిని, రాష్ట్ర స్థాయిలో మొదటి 8 మందిని, జాతీయ స్థాయిలో మొదటి 100 మందిని (సూపర్‌ 100) ఎంపిక చేసి వచ్చే గణతంత్ర దినోత్సవం రోజున బహుమతులు అందజేస్తారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

వీర్‌గాథ విజేతలు..

సూపర్‌ 100 విజేతల్లో వీర్‌గాథ పోటీల్లో ఒక స్థాయిలో ఎంపికై న వారిని మరో స్థాయిలో ఎంపిక చేయకుండా వేర్వేరు విద్యార్థులను ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి పోటీల్లో నలుగురిని విజేతలుగా ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపిస్తారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో 8 మందిని విజేతలుగా గుర్తించి జాతీయ స్థాయికి పంపుతారు. జాతీయస్థాయి పోటీల్లో వంద మందిని విజేతలుగా ప్రకటిస్తారు.

వీరిని సూపర్‌ 100 విజేతలుగా పిలుస్తారు. ఇందులో మూడు నుంచి 5వ తరగతి వరకు 25 మందిని ఆరు నుంచి 8వ తరగతి వరకు 25 మందిని తొమ్మిది నుంచి పదో తరగతి వరకు 25 మంది విద్యార్థులను ఇంటర్‌ నుంచి 25 మంది విద్యార్థులను జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. జిల్లా రాష్ట్ర స్థాయిలోని పోటీల విజేతలకు సత్కారం, సర్టిఫికెట్‌ అందజేస్తారు. జాతీయస్థాయి విజేతలకు విద్యా, రక్షణ మంత్రిత్వ శాఖలు రూ.10 వేలు చొప్పున నగదును అందజేస్తాయి. సత్కారం ఉంటుంది.

వివిధ కేటగిరీలు విద్యార్థులు(తరగతివారీగా) పోటీలు

  • కేటగిరీ–1 3,4,5 కవితలు, వ్యాస రచన 150 పదాలు, డ్రాయింగ్‌/పెయింటింగ్‌
  • కేటగిరీ–2: 6, 7,8 కవితలు, వ్యాస రచన 300 పదాలు, డ్రాయింగ్‌/పెయింటింగ్‌
  • కేటగిరీ–3: 9,10 కవితలు, వ్యాస రచన 750 పదాలు, డ్రాయింగ్‌/పెయింటింగ్‌)
  • కేటగిరీ–4: 11,12 కవితలు, వ్యాస రచన 1,000 పదాలు, డ్రాయింగ్‌/పెయింటింగ్‌

ఎక్కువ మంది పాల్గొనేలా చూడాలి

హనుమకొండ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మూడు నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు చూడాలి. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వీర్‌గాథపై దృష్టి కేంద్రీకరించి ప్రతీ పాఠశాలను వీర్‌గాథ వెబ్‌ పోర్టల్‌ లో నమోదు చేయాలి. తర్వాత విద్యార్థులకు పోటీలు నిర్వహించి నలుగురిని ఎంపిక చేసి పోర్టల్‌ లో అప్లోడ్‌ చేయాలి. కేంద్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకునే గడువును పెంచే అవకాశం ఉంది.

– డి.వాసంతి, డీఈఓ, హనుమకొండ
 

#Tags