RK Math: రామకృష్ణ మఠం సేవలు ఎనలేనివి: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

హైదరాబాద్: యువత వ్యక్తిత్వ వికాసానికి, శీల నిర్మాణానికి రామకృష్ణ మఠం అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొనియాడారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక జ్యోతి వెలిగించేందుకు, రామకృష్ణ మఠం దశాబ్దాలుగా చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. వ్యక్తుల సౌశీల్యంపై దేశ సౌశీల్యం ఆధారపడి ఉంటుందని చెప్పారు.

హైదరాబాద్ రామకృష్ణ మఠంలో అంతర్భాగమైన వివేకానంద ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ రజతోత్సవ వేడుక సభ కు గవర్నర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. నిరంతర అభ్యాసంతోనే పరిపూర్ణత సాధ్యమవుతుందని కార్య్రక్రమానికి హాజరైన విద్యార్థులకు సూచించారు. 

1893 సెప్టెంబర్ 11 న చికాగో విశ్వవేదిక సాక్షిగా స్వామి వివేకానంద హిందూ ధర్మ గొప్పతనాన్ని చాటిచెప్పారని గవర్నర్ గుర్తుచేశారు. స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులకు జిష్ణు దేవ్ వర్మ సూచించారు.

చదవండి: Ravi Varma: నిత్య విద్యార్థి.. ఈ ఉపాధ్యాయుడు

ఇరవై ఐదేళ్ళ క్రితం సెప్టెంబర్ 11 న హైదరాబాద్ రామకృష్ణ మఠంలో నాటి రామకృష్ణ మఠం, మిషన్ జాతీయ సర్వాధ్యక్షుడు స్వామి రంగనాథానంద వివేకానంద ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ విభాగాన్ని ప్రారంభించారని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. 

ఇప్పటివరకు ఇరవై లక్షల మందికి పైగా యువత కు వ్యక్తిత్వ వికాసం, శీల నిర్మాణం, యోగ, ధ్యానం, కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చామన్నారు. యువతకు విలువలను, నైపుణ్యాలను అందించేందుకు వి.ఐ.హెచ్.ఈ ఇరవై ఐదు ఏళ్లుగా పని చేస్తోందని చెప్పారు.

కార్యక్రమం లో రామకృష్ణ మిషన్, మఠం జాతీయ ఉపాధ్యక్షుడు స్వామి సుహితానంద, డెక్స్ టెరిటీ గ్లోబల్ వ్యవస్థాపకుడు శరద్ సాగర్, వి.ఐ.హెచ్.ఈ ఫాకల్టీ సభ్యులు, వాలంటీర్లు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కూచిపూడి నృత్యకళాకారిణి రాచర్ల నవ్య నేతృత్వంలో బాల్ వికాస్ విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

చదవండి: English Language: ఆంగ్లభాషా నైపుణ్యాల మెరుగుకు చర్యలు

#Tags