Samineni Koteswara Rao: ప్రభుత్వ విద్యార్థులకు ఉపకార వేతనాలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: గత మార్చిలో జరిగిన 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ప్రతిభావంతులుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపకార వేతనాలు ప్రదానం చేయనున్నట్లు కమ్మజన సేవా సమితి అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు తెలిపారు.

న‌వంబ‌ర్ 4న‌ బృందావన్‌గార్డెన్స్‌ కుందుల రోడ్డులోని కమ్మ జన సేవా సమితిలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలల నుంచి టెన్త్‌ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి, ఇంటర్‌, పాలిటెక్నిక్‌ చదువుతున్న విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తులు పంపాలని సూచించారు.

టెన్త్‌లో 90 శాతం (9 జీపీఏ) మార్కులు వచ్చిన వారితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు దూరమైన వారు, శారీరక వైకల్యం కలిగిన విద్యార్థులకు 80 శాతం (8 జీపీఏ) వచ్చినప్పటికీ అర్హులేనని పేర్కొన్నారు. అదే విధంగా తల్లిదండ్రులు ఇరువురూ లేని విద్యార్థులు టెన్త్‌లో ఉత్తీర్ణత సాధిస్తే చాలునని తెలిపారు. దరఖాస్తులను సంస్థ కార్యాలయం ద్వారా, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కేజేఎస్‌ఎస్‌.ఇన్‌ సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని, పూర్తి చేసిన దరఖాస్తులకు సంబంధిత ధ్రువపత్రాలను జతపర్చాలని సూచించారు. సంస్థ కార్యదర్శి చుక్కపల్లి రమేష్‌ మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి ఒక్కొక్కరికీ రూ. ఏడువేల చొప్పున ఉపకార వేతనాన్ని అందజేస్తామని తెలిపారు.

చదవండి: NCC Training: శిక్షణతో పాటు సర్టిఫికెట్‌... ఉన్నత విద్య, ఉద్యోగాలలో ప్రత్యేక ప్రాధాన్యత!

కుల, మతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. కమ్మజన సేవా సమితి ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థినులకు ప్రతి ఏటా రూ.50 లక్షల మేరకు ఉపకార వేతనాలు, ఫీజుల చెల్లింపు చేస్తున్నామని చెప్పారు. ఐఐటీల్లో చదువుతున్న విద్యార్థులకు సైతం ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలిపారు.

సామాజిక సేవా సంస్థలు, అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, హాస్టళ్లలో ఉంటున్న పేద విద్యార్థులకు సమితి తరపున అవసరమైన చేయూత అందిస్తామని, వీల్‌చైర్స్‌, దుప్పట్లు, ఇతర ఫర్నీచర్‌ కావల్సిన వారు తమను సంప్రదించాలని సూచించారు. ఉపకార వేతన దరఖాస్తుకు సంబంధించిన ఇతర వివరాలకు 8330934815, 7382620317 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

సమావేశంలో సంస్థ సభ్యులు కన్నెగంటి బుచ్చయ్యచౌదరి, గోరంట్ల పున్నయ్యచౌదరి, వడ్లమూడి నాగేందర్‌, ఎంసీహెచ్‌ సీతారామయ్య, వడ్లమూడి శివరామకృష్ణ, సాంబశివరావు పాల్గొన్నారు.

#Tags