Integrated Educational Hub: ఇంటిగ్రేటెడ్‌ ఎడ్యుకేషనల్‌ హబ్‌ మంజూరు

వనపర్తి: జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఇందుకు సంబంధించిన సర్క్యులర్‌ను జూన్ 20న సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి జారీ చేశారు. అలాగే ఏర్పాటుకు కావాల్సిన పూర్తి నివేదికను అందించాలని ఎమ్మెల్యే, అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అభ్యర్థన మేరకు సీఎం సూచనతో గోపాల్‌పేట మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల సమీపంలో సుమారు 70 ఎకరాల ప్రభుత్వ స్థలంలో హబ్‌ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

చదవండి: ఆ నిధులతో ‘ఏకలవ్య’ స్కూళ్ల నిర్మాణం

రాష్ట్రంలో తొలివిడతగా ఏర్పాటు చేయనున్న ఎడ్యుకేషనల్‌ హబ్‌లలో వనపర్తికి స్థానం కల్పించాలని ప్రయత్నించగా.. సీఎం ఈ ప్రాంతంపై ఉన్న అభిమానంతో ఒప్పుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇందుకు ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

రూ.50 కోట్లు మంజూరు..

కొంతకాలంగా అద్దెభవనాల్లో కొనసాగుతున్న పెద్దమందడి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల భవన నిర్మాణానికి రూ.25 కోట్లు, వనపర్తి సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ గురుకుల భవన నిర్మాణానికి రూ.25 కోట్లు తన అభ్యర్థన మేరకు ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న రెండు భవనాలకు నెలకు అద్దె రూ.95 వేలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు.
 

#Tags