మెడికల్ అడ్మిషన్లు రద్దయిన విద్యార్థులకు ఊరట
టీఆర్‌ఆర్ మెడికల్ కాలేజీ అప్పీలును కేంద్రం కొట్టివేయడంతో National Medical Commission (NMC) ఆదేశాల మేరకు.. ఆ కాలేజీకి చెందిన 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను సర్దుబాటు చేయాలని కాళోజీ నారా యణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఎంఎన్‌ఆర్, మహావీర్ కాలేజీలకు సంబంధించి మాత్రం అనిశ్చితి కొనసాగుతోంది.
చదవండి: Internship: ఎంబీబీఎస్ చదివిన చోటే ఇంటర్న్‌షిప్
టీఆర్‌ఆర్ విద్యార్థుల కోసం వారంలో నోటిఫికేషన్..
సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్, పటాన్‌చెరులోని టీఆర్‌ఆర్, వికారాబాద్‌లోని మహావీర్ కాలేజీల్లో మొత్తం 450 ఎంబీబీఎస్ ఫస్టియర్ సీట్లతోపాటు రెండు కాలేజీల్లోని 113 పీజీ మెడికల్ అడ్మిషన్లను ఎన్‌ఎంసీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఆయా కాలేజీల్లో చేరిన విద్యార్థుల పరిస్థితి గందరగోళంలో పడింది. ఎన్‌ఎంసీ నిర్ణయంపై టీఆర్‌ఆర్ కాలేజీ చేసుకున్న అప్పీలును కేంద్రం తోసిపుచ్చడంతో అందులో చేరిన 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను రాష్ట్రంలోని 12–13 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అదనపు సీట్లు సృష్టించి.. సర్దుబాటు చేయాలని కాళోజీ వర్సిటీ నిర్ణయించింది. దీనిపై వారంలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని.. విద్యార్థులు ఇచ్చే ఆప్షన్ల ప్రకారం సర్దుబాటు చేస్తామని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఇప్పటికే చెల్లించిన ఫీజును.. వారు చేరబోయే మెడికల్ కాలేజీకి టీఆర్‌ఆర్ కాలేజీ నుంచి బదిలీ చేస్తారు.
చదవండి: ఎంబీబీఎస్ తర్వాత నెక్ట్స్ పాసైతేనే రిజిస్ట్రేషన్
మిగతా రెండు కాలేజీలపై అనిశ్చితే..
ఎంఎన్‌ఆర్, మహావీర్ మెడికల్ కాలేజీలకు చెందిన 300 మంది ఎంబీబీఎస్, 113 పీజీ మెడికల్ విద్యార్థుల సర్దుబాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీ అప్పీల్‌ను పరిశీలించిన కేంద్రం.. తనిఖీల సందర్భంగా పలువురు ఇచ్చిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని గుర్తించింది. ఓపీ (ఔట్ పేషెంట్ల సంఖ్య) 600గా ఉందని ఒక నివేదికలో, 800 ఓపీగా మరో నివేదికలో ఉందని.. మరికొన్ని అంశాల్లోనూ తేడాలు ఉన్నాయని పరిశీలన సందర్భంగా తేల్చింది. ఈ క్రమంలో మరోసారి ఎంఎన్‌ఆర్ కాలేజీకి వెళ్లి తనిఖీ చేయాలని నిర్ణయించారు. మౌలిక సదుపాయాలు సంతృప్తికరంగా ఉంటే అందులోనే విద్యార్థులను కొనసాగించే అవకాశం ఉందని.. లేకుంటే వారినీ సర్దుబాటు చేస్తారని కాళోజీ వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు మహావీర్ మెడికల్ కాలేజీకి సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఏదేమైనా త్వరలోనే విద్యార్థులందరినీ ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేయడమో, లేదా ఉన్నచోటే కొనసాగించడమో జరిగే అవకాశముందని అధికారవర్గాలు చెప్తున్నాయి. 113 మంది పీజీ మెడికల్ విద్యార్థులను సర్దుబాటు చేయాలంటే.. ఇతర కాలేజీల్లో ఆ మేరకు మౌలిక సదుపాయాలు ఉండాల్సి వస్తుందని.. ఇది కాస్త కష్టమైన పని అని పేర్కొంటున్నాయి.
చదవండి: ఈ కాలేజీల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి
మరి డొనేషన్ల మాటేంటి?
విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయడం ఒక ఎత్తు అయితే.. వారు చెల్లించిన డొనేషన్ల వ్యవహారాన్ని పరిష్కరించడం మరో సమస్యగా మారే అవకాశముంది. టీఆర్‌ఆర్ కాలేజీ విద్యార్థులు చెల్లించిన ఫీజును సర్దుబాటు సందర్భంగా వారు చేరే కాలేజీకి బదిలీ చేయాలని నిర్ణయించారు. అయితే ఎంబీబీఎస్ కోర్సు ఐదేళ్ల ఫీజును ఒకేసారి కడితే రాయితీ ఇస్తామని కాలేజీ చెప్పడంతో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు అలా చెల్లించినట్టు సమాచారం. ఫీజుకు అదనంగా డొనేషన్లు కూడా తీ సుకున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. డొనేషన్ల సొమ్ముకు ఎలాంటి రసీదులూ ఇవ్వలేదని అంటున్నారు. ఫీజు సొమ్ము ను ఎలాగోలా బదిలీ చేస్తారుగానీ.. డొనేషన్ల కింద భారీగా చెల్లించిన డబ్బుల సంగతేమిటని ఆందోళనలో పడ్డారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.