NCERT Text Books New Changes 2024 : 'ఎన్‌సీఈఆర్‌టీ' బుక్స్‌లో చేసిన‌ కీలక మార్పులు-చేర్పులు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) పాఠ్య పుస్తకాల్లో పలు మార్పులు, చేర్పులు చేసిన సంగతి తెలిసిందే.

అయితే 12వ తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పుస్తకంలోనూ అనేక మార్పులు చేసింది. ‘బాబ్రీ మసీదు’ సహా అనేక కీలక అంశాలను, చాలా సమాచారాన్ని తొలగించింది. 

ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌లో తొలగింపులు అంశాలవారీగా..  

☛ ‘బాబ్రీ మసీదు’ పదం తొలగింపు : పాఠ్య పుస్తకంలోంచి బాబ్రీ మసీదు అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. దాని స్థానంలో ‘మూడు గోపురాల నిర్మాణం’ను చేర్చింది.  
☛ అయోధ్య అధ్యాయం తగ్గింపు : నాలుగు పేజీలున్న అయోధ్య అధ్యాయాన్ని రెండు పేజీలకు తగ్గించింది. రథయాత్ర, కరసేవకుల పాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేత, అనంతరం జరిగిన హింస, ఆ తరువాత బీజేపీ పాలిత ప్రాంతాల్లో విధించిన రాష్ట్రప తి పాలన అంశాలను తొలగించింది.  
☛ చారిత్రక వివరాల సవరణ : బాబ్రీ మసీదుకు సంబంధించిన వివరాల్లో కూడా అనేక మార్పులు చేసింది. బాబ్రీ మసీదును 16వ శతాబ్దంలో మీర్‌ బాకీ నిర్మించినట్లుగా గత పుస్తకంలో ఉండగా.. 1528లో రాముడి జన్మస్థలంలో నిర్మించబడిన మూడు గోపురాల నిర్మాణంగా ఇప్పుడు పేర్కొన్నది. అంతేకాదు ఈ నిర్మాణంలో అనేక హిందూ చిహ్నాలు ఉన్నాయని, లోపలి, వెలుపలి గోడలపై శిల్పాలు ఉన్నాయని కొత్త పుస్తకం పేర్కొంది. హిందూ చిత్రాలు, విగ్రహాలను కూడా  కొత్తగా ప్రస్తావించింది.
☛ చట్టపరమైన, మతపరమైన కథనాల్లోనూ మార్పులు : ఆలయంలో పూజలు చేసుకునేందుకు బాబ్రీ మసీదు నిర్మాణాన్ని తెరచి ఉంచాలని 1986 ఫిబ్రవరిలో ఫైజాబాద్‌ జిల్లా కోర్టు ఇచ్చిన‌ తీర్పును పాత పుస్తకం వివరించగా, వాటన్నింటిని తొలగించి మూడు గోపురాల నిర్మాణం, తరువాత వచ్చిన‌ మతపరమైన వైరుధ్యాలను కొత్త పుస్తకం క్లుప్తంగా ప్రస్తావించింది. వివాదాస్పద భూమి ఆలయానికే చెందుతుందంటూ 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన‌ తీర్పును మాత్రం కొత్త ఎడిషన్‌లో చేర్చింది.  
☛ వార్తాపత్రికల కటింగ్స్‌ తీసివేత : పాత పుస్తకంలో వార్తాపత్రిక కథనాలకు సంబంధించిన అనేక ఛాయాచిత్రాలు ఉన్నాయి. వీటిలో డిసెంబర్‌ 7, 1992న ’బాబ్రీ మసీదు కూల్చివేత, కేంద్రం కళ్యాణ్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసింది’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం కూడా ఉంది. వీటన్నింటినీ తొలగించారు.
☛ గుజరాత్‌ అల్లర్ల అధ్యాయం తొలగింపు : ప్రజాస్వామ్య హక్కుల అధ్యాయం నుంచి గుజరాత్‌ అల్లర్ల ప్రస్తావనను పూర్తిగా తొలగించింది.  

ఇలాంటి వాటి గురించి బోధించాల్సిన అవసరం లేదు..: ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ 

ద్వేషం, హింస బోధనాంశాలు కావని, పాఠశాల పాఠ్యపుస్తకాలు వాటిపై దృష్టి పెట్టకూడదని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) చీఫ్‌ దినేష్‌ ప్రసాద్‌ సక్లానీ అన్నారు. గుజరాత్‌ అల్లర్లు, బాబ్రీ మసీదు కూల్చివేత గురించి బోధిస్తే పాఠశాల విద్యార్థులు హింసాత్మకంగా తయారవుతారని, అందుకే వాటిని పాఠ్యాంశాల్లోంచి తొలగించామని వెల్లడించారు. పాఠ్య పుస్తకాల్లో మార్పులు, బాబ్రీ మసీదు కూల్చివేత, తరువాత మతపరమైన హింసకు సంబంధించిన అంశాల తొలగింపులపై జూన్ 15వ తేదీన ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. సమాజంలో విద్వేషాలను సృష్టించే విధంగా బోధనలు అవసరం లేదని, చిన్నపిల్లలకు అల్లర్ల గురించిన నేర్పించాల్సిన అవసరం లేదని, అది ఎందుకు జరిగిందో పెద్దయ్యాక వారే తెలుసుకుంటారని చెప్పారు.

చరిత్రను యుద్ధభూమిగా మార్చడానికి కాకుండా..
రామ జన్మభూమికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాన్ని పాఠ్యపుస్తకాల్లో ఎందుకు చేర్చకూడదని, పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మించడం విద్యార్థులకు ఎందుకు తెలియకూడదని ఆయన ప్రశ్నించారు. చరిత్రను యుద్ధభూమిగా మార్చడానికి కాకుండా విద్యార్థులకు వాస్తవాలు తెలిసేలా బోధిస్తామన్నారు. పాఠ్యపుస్తకాల పునర్విమర్శ ప్రపంచవ్యాప్తంగా జరిగే అభ్యాసమని, ఏది మార్చాలన్నది సబ్జెక్ట్, బోధనా శాస్త్ర నిపుణులే నిర్ణయిస్తారని, తాను ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాల్లో 2014 నుంచి ఇప్పటివరకూ నాలుగు పర్యాయాలు మార్పులు చేసిన విష‌యం తెల్సిందే.

#Tags