Directorate of Enforcement: ఉచిత విద్య పేరిట విదేశాల నుంచి అక్రమంగా కోట్లు వసూలు

సాక్షి, హైదరాబాద్‌: దళిత, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్య, భోజన వసతి కల్పన పేరిట విదేశాల నుంచి కోట్ల రూపాయల విరాళాలు సేకరించి వాటి ద్వారా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఆపరేషన్‌ మొబిలైజేషన్‌ (ఓఎం) సంస్థలో సోదాలు నిర్వహించారు.

జూన్ 21, 22 తేదీల్లో హైదరాబాద్, ఇతర 11 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో పలు కీలక పత్రాలు, డిజిటల్‌ డివైజ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఆపరేషన్‌ మొబిలైజేషన్‌ గ్రూప్‌ ఆఫ్‌ చారిటీస్‌ సంస్థ.. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, డెన్మార్క్, జర్మనీ, ఫిన్‌లాండ్, ఐర్లండ్, మలేసియా, నార్వే, బ్రెజిల్, చెక్‌ రిపబ్లిక్, ఫ్రాన్స్, రుమేనియా, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్‌ దేశాల్లోని దాతల నుంచి దళిత్‌ ఫ్రీడమ్‌ నెట్వర్క్‌ ద్వారా రూ.300 కోట్ల మేర నిధులు వసూలు చేయడంపై తెలంగాణ సీఐడీ విభాగం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దీని ఆధారంగా మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: Private Schools Admissions : ఉచిత విద్యకు మొద‌టి విడ‌తలో అడ్మిష‌న్‌ పొందిన విద్యార్థులు..!

 ఓఎం సంస్థ వంద పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత విద్య, భోజన వసతి కల్పిస్తున్నామంటూ విరాళాల రూపంలో వసూలు చేసిన డబ్బులను ఆస్తులను కూడబెట్టేందుకు, ఇతర అనధికార పనులకు వాడినట్టు అధికారులు గుర్తించారు. ఉచిత విద్య, ట్యూషన్‌ ఫీజుల పేరిట నెలకు ఒక్కో విద్యార్థికి రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు ఓఎం సంస్థ వసూలు చేసినట్టు సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. 

ఈ సొమ్మును సదరు సంస్థ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఇతర ఆస్తుల కొనుగోలుకు వినియోగించినట్టు వెల్లడైంది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ కింద వసూలు చేసిన నిధులకు సంబంధించి సైతం సరైన రికార్డులు లేవని తేలింది. ఈ అక్రమాలన్నింటిపైనా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: Private Schools Admissions: ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ఫీజు క‌డితేనే అడ్మిష‌న్‌..! లేకుంటే..

పలు రాష్ట్రాల్లో ఆస్తుల కొనుగోలు..

ఈడీ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఓఎం గ్రూప్‌ ఆఫ్‌ చారిటీస్‌ పేరిట విదేశాల నుంచి సేకరించిన సొమ్ముతో సంస్థల్లోని కీలక ఆఫీస్‌ బేరర్స్‌ పేరిట తెలంగాణ, గోవా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.

ఓఎం గ్రూపు సంస్థలకు సంబంధించిన ఎఫ్‌ఆర్‌సీఏ (ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌) రిజిస్ట్రేషన్లు సైతం రెన్యువల్‌ చేయలేదని, ఓఎం బుక్స్‌ ఫౌండేషన్‌ సంస్థ పేరిట సేకరించిన విదేశీ విరాళాలు ఇతర సంస్థలకు రుణాలు ఇచ్చినట్టుగా చూపి దారి మళ్లించినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది.

ఓఎం సంస్థలకు చెందిన ఆఫీస్‌ బేరర్స్‌ గోవాలో పలు డొల్ల కంపెనీలను సృష్టించి వాటిలో వారంతా ఉద్యోగులుగా చూపి, వేతనాల రూపంలోనూ డబ్బులు దండుకున్నట్టు తేలింది. 

కేసు దర్యాప్తులో భాగంగా ఓఎం గ్రూప్‌ సంస్థ కీలక సిబ్బంది ఇళ్లు, కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో బినామీ కంపెనీలకు సంబంధించిన పలు పత్రాలు, అనుమానాస్పద లావాదేవీల వివరాలు, డిజిటల్‌ డివైజ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు వారు వెల్లడించారు.

#Tags