TG Cabinet Subcommittee: ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల కట్టడి.. ఈ కోచింగ్‌ కేంద్రాలపై నియంత్రణ

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ, వాటి నిర్వహణ తీరును కట్టడి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది.

ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికలు పడిపోవడంపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం–2020 అమలు వల్ల జరిగే ప్రయోజనాలు, సవాళ్లను సమగ్రంగా విశ్లేషించాలని సూచించింది. 

ఇంజనీరింగ్‌ విద్యలో నాణ్యత పెంపు దిశగా సరికొత్త మార్గాన్వేషణ చేయాల్సిన అవసరాన్ని విద్యాశాఖ ముందుంచింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం విద్యారంగంలో సంస్కరణలపై సెప్టెంబర్ 11న‌ సమగ్రంగా చర్చించింది. సబ్‌ కమిటీ సభ్యురాలు మంత్రి సీతక్క ఈ సమీక్షలో పాల్గొన్నారు. 

కోచింగ్‌ కేంద్రాలపై నియంత్రణ 

పలు రకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్‌ కేంద్రాలపై నియంత్రణ అవసరమని, అభ్యర్థుల భద్రత, ఫీజుల నియంత్రణపై దృష్టి పెట్టాలని మంత్రి శ్రీధర్‌బాబు అధికారులను కోరారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో కూడా అమలు చేస్తామన్నారు.

ప్రైవేటు స్కూళ్లు, ఇంటర్మీడియట్‌ కళాశాల ఫీజుల నిర్ధారణపై నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు శ్రీధర్‌ బాబు వెల్లడించారు. 

చదవండి: School Fees for Admissions : పేద విద్యార్థుల తల్లిదండ్రులపై భారం.. ఎందుకంటే..

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచితే, పేదలు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లరని, ఈ దిశగా ఎక్కడ లోపం ఉందో అన్వేషించాలని మంత్రి అధికారులకు సూచించారు.

మానవ వనరులు వృథా అవ్వకుండా అప్పర్‌ ప్రైమరీ, హైస్కూళ్లను విలీనం చేసే అంశంపై అధ్యయనం చేయాలని విద్యాశాఖకు మంత్రి వర్గ ఉప సంఘం సూచించింది.  

ప్రమాణాలు తగ్గడంపై ఆందోళన 

రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలు తగ్గడంపై ఉప సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా ప్రమాణా ల్లో రాష్ట్రం 34వ స్థానంలో ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

డిగ్రీ కళాశాలల్లో బీఏ కోర్సుల పాఠ్య ప్రణాళికలో మార్పులు చేసి విద్యార్థులను ఉద్యోగాలకు సంసిద్ధం చేసేలా శిక్షణ ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని 9 పాలిటెక్నిక్‌ కాలేజీలను ఇంజనీరింగ్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసే పనులను వేగవంతం చేయాలని చెప్పారు. 

మాసబ్‌ట్యాంక్, రామంతాపూర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, కొత్తగూడెం, సికింద్రాబాద్, కులీకుతుబ్‌ షా పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఇంజనీరింగ్‌ కాలేజీలను ప్రారంభిస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు.

మహిళలపై వేధింపులకు పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయనే అంశాలను 5, 6 తరగతుల పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉన్నా విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు ఎందుకు వెళ్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. 

#Tags