Class 10 and 12 Exams Guidance: 10, 12 తరగతుల.. వార్షిక పరీక్షలు.. బెస్ట్ స్కోర్ ఇలా!
విద్యార్థుల్లోని అకడమిక్ నైపుణ్యాలను పరిశీలిస్తూనే.. ఆయా అంశాలను వాస్తవ పరిస్థితుల్లో అన్వయించేలా ప్రశ్నలు అడుగుతారు. ఈ నేపథ్యంలో.. సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల
పరీక్ష విధానం, మంచి స్కోర్‌కు మార్గాలపై ప్రత్యేక కథనం..
ఫిబ్రవరి 15 నుంచి పరీక్షలు
సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల వార్షిక పరీక్షలను 2025 ఫిబ్రవరి 15 నుంచి నిర్వహించనున్నారు. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 18 వరకు; 12వ తరగతి (+2) పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు మధ్య కనీసం నాలుగైదు రోజుల వ్యవధి ఉంటోంది. దీంతో విద్యార్థులు ఒక పేపర్ తర్వాత మరో పేపర్‌కు తుది దశ ప్రిపరేషన్‌కు సమయం అందుబాటులో ఉంటుంది.
10వ తరగతి.. 80 మార్కులకు
సీబీఎస్‌ఈ అకడమిక్ బోధన విధానాల ప్రకారం–పదో తరగతిలో ప్రతి సబ్జెక్ట్‌లో 80 మార్కులకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. మరో 20 మార్కులకు పాఠశాల స్థాయిలో ఇంటర్నల్ అసెస్‌మెంట్స్ ఉంటాయి. వార్షిక పరీక్షల్లో 50 శాతం ప్రశ్నలు సామర్థ్య ఆధారిత ప్రశ్నలు, కేస్ స్టడీ బేస్డ్ ప్రశ్నలు అడుగుతారు. వీటితోపాటు స్వల్ప సమాధాన ప్రశ్నలు, దీర్ఘ సమాధాన ప్రశ్నలు కూడా ఉంటాయి.
మ్యాథమెటిక్స్(బేసిక్)
ఇందులో మొదటి విభాగంలో 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు (20 మార్కులు); రెండో విభాగంలో 5 స్వల్ప సమాధాన ప్రశ్నలు (10 మార్కులు); మూడో విభాగంలో 6 స్వల్ప సమాధాన ప్రశ్నలు (18 మార్కులు); నాలుగో విభాగంలో 4 దీర్ఘ సమాధాన ప్రశ్నలు (20 మార్కులు); అయిదో విభాగంలో సోర్స్ బేస్డ్, కేస్ బేస్డ్, ప్యాసేజ్ బేస్డ్ ప్రశ్నలు 3 (12 మార్కులు) అడుగుతారు.
సైన్స్
ఈ సబ్జెక్ట్‌లో మొదటి విభాగంలో 20 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు (20 మార్కులు); రెండో విభాగంలో అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు 6 (12 మార్కులు); మూడో విభాగంలో స్వల్ప సమాధాన ప్రశ్నలు 7 (21 మార్కులు); నాలుగో విభాగంలో దీర్ఘ సమాధాన ప్రశ్నలు 3 (15 మార్కులు); అయిదో విభాగంలో సోర్స్/కేస్ బేస్డ్ ప్రశ్నలు 3 (12 మార్కులు) ఉంటాయి.
సోషల్ సైన్స్
ఈ సబ్జెక్ట్‌లో కూడా మొదటి విభాగంలో 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు (20 మార్కులు); రెండో విభాగంలో అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు 4 (8 మార్కులు); మూడో విభాగంలో స్వల్ప సమాధాన ప్రశ్నలు 5 (15 మార్కులు); నాలుగో విభాగంలో లాంగ్ ఆన్సర్ కొశ్చన్స్ 4 (20 మార్కులు); అయిదో విభాగంలో కేస్ బేస్డ్ కొశ్చన్స్ 3 (12 మార్కులు); అయిదో విభాగంలో మ్యాప్ ఆధారిత ప్రశ్న 1 (5 మార్కులు)తో పరీక్ష పత్రం ఉంటుంది.
ఇంగ్లిష్
ఈ సబ్జెక్ట్‌లో మొదటి విభాగంలో రీడింగ్ (20 మార్కులు); రెండో విభాగంలో రైటింగ్,గ్రామర్(20 మార్కులు), మూడో విభాగంలో లిటరేచర్ (40 మార్కులు)ఉంటాయి. రీడింగ్ విభాగంలో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. రైటింగ్, గ్రామర్ విభాగంలో 10 ప్రశ్నలు గ్రామర్ నుంచి, 5 మార్కులకు లెటర్ రైటింగ్, మరో 5 మార్కులకు ప్రెసిస్ రైటింగ్ ఉంటాయి. మూడో విభాగంలో గద్య భాగం, పద్య భాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
హిందీ
హిందీ సబ్జెక్ట్‌లో అపరిచిత పద్యం (5 మార్కులు), అపరచిత గద్యం (5 మార్కులు); గ్రామర్ (16 మార్కులు); లిటరేచర్ పద్యం, గద్యం (14 మార్కులు); రెండో భాగంలో పద్య భాగంలో షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ గద్య భాగంలో వెరీ షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్; సప్లిమెంటరీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగానికి 20 మార్కులు ఉంటాయి. రైటింగ్ విభాగంలో ప్యాసేజ్ రైటింగ్, లెటర్ రైటింగ్, రెజ్యుమే/ ఈ–మెయిల్ రైటింగ్; లెటర్ రైటింగ్/అడ్వర్టయిజ్‌మెంట్ రైటింగ్‌లతో 20 మార్కులకు మరో విభాగం ఉంటుంది.
చదవండి: Intermediate Students : విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా బోధన
12వ తరగతి.. మెడికల్, నాన్–మెడికల్
సీబీఎస్‌ఈ 12వ తరగతి(+2) పరీక్షలను మెడికల్, నాన్–మెడికల్ అనే రెండు విభాగాలుగా నిర్వహిస్తారు. రాష్ట్రాల బోర్డ్ స్థాయిలో ఎంపీసీకి సరితూగే విధంగా నాన్–మెడికల్ విభాగంలోని సబ్జెక్ట్‌లు (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, హిందీ) ఉంటాయి. బైపీసీకి సరితూగే మెడికల్ విభాగంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్, హిందీ సబ్జెక్ట్‌లలో పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది. సీఈసీకి సరితూగేలా కామర్స్ స్ట్రీమ్‌లో అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, హిందీలు; హెచ్‌ఈసీకి సరితూగేలా జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్‌లు ఉంటాయి.
మ్యాథమెటిక్స్
12వ తరగతి స్థాయిలో ఎంతో కీలకంగా భావించే మ్యాథమెటిక్స్ పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. సెక్షన్–ఎలో 18 ఎంసీక్యూలు, 2 అసెర్షన్ అండ్ రీజన్ ప్రశ్నలు (20 మార్కులు); సెక్షన్–బిలో 5 వెరీ షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ (10 మార్కులు); సెక్షన్–సిలో 6 షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ (18 ప్రశ్నలు); సెక్షన్–డిలో 4 లాంగ్ ఆన్సర్ కొశ్చన్స్ (20 మార్కులు); సెక్షన్–ఇలో సోర్స్/కేస్/ప్యాసేజ్ బేస్డ్/ఇంటిగ్రేటెడ్ యూనిట్స్ ప్రశ్నలు 4 (12 మార్కులు) అడుగుతారు.
ఫిజిక్స్
ఫిజిక్స్‌లో మాత్రం 70 మార్కులకే పరీక్ష ఉంటుంది. సెక్షన్–ఎలో 16 ఎంసీక్యూలు, సెక్షన్–బిలో 5 షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ (10 మార్కులు); సెక్షన్–సిలో 3 మార్కుల ప్రశ్నలు 7 (21 మార్కులు); సెక్షన్–డిలో 2 కేస్ స్టడీ బేస్డ్ ప్రశ్నలు (8 మార్కులు) అడుగుతారు.
కెమిస్ట్రీ
కెమిస్ట్రీలో 70 మార్కులకే పరీక్ష నిర్వహిస్తారు. సెక్షన్–ఎలో 16 ఎంసీక్యూలు (16 మార్కులు); సెక్షన్–బిలో 5 వెరీ షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ (10 మార్కులు); సెక్షన్–సిలో 7 షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ (21 మార్కులు); సెక్షన్–డిలో 2 కేస్ బేస్డ్ ప్రశ్నలు (8 మార్కులు); సెక్షన్–ఇలో 3 లాంగ్ ఆన్సర్ కొశ్చన్స్ (15 మార్కులు) ఉంటాయి.
బయాలజీ
బయాలజీలో సెక్షన్–ఎ లో 16 ఎంసీక్యూలు (16 మార్కులు); సెక్షన్–బిలో వెరీ షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ (10 మార్కులు); సెక్షన్–సిలో 7 షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ (21 మార్కులు); సెక్షన్–డిలో 2 కేస్ ఆధారిత ప్రశ్నలు (8 మార్కులు); సెక్షన్–ఇలో 3 లాంగ్ ఆన్సర్ కొశ్చన్స్ (15 మార్కులు) అడుగుతారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
సిలబస్‌పై పట్టు
సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల వార్షిక పరీక్షల్లో మంచి స్కోర్ సాధించాలంటే.. విద్యార్థులు ముందుగా సిలబస్‌పై పట్టు సాధించాలి. సీబీఎస్‌ఈ విధానం ప్రకారం –ఆయా సబ్జెక్ట్‌లలో సదరు అంశాలకు లభిస్తున్న వెయిటేజీని గుర్తించి.. అధిక వెయిటేజీ ఉన్న అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
పరీక్ష విధానంపై అవగాహన
వార్షిక పరీక్షలకు ఇప్పటి నుంచి నిర్దిష్ట స్టడీ షెడ్యూల్‌ను రూపొందించుకోవాలి. తాము కష్టంగా భావించే సబ్జెక్ట్‌లకు ఎక్కువ సమయం కేటాయించాలి. ప్రతిరోజు తరగతి అభ్యసనానికి అదనంగా కనీసం ఆరు గంటలు ప్రిపరేషన్ కొనసాగించాలి. సిలబస్‌పై పట్టు సాధించడంతోపాటు.. పరీక్ష విధానంపైనా సీబీఎస్‌ఈ విద్యార్థులు అవగాహన ఏర్పరచుకోవాలి. సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నమూనా ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. అదే విధంగా.. పాఠశాల, కళాశాల స్థాయిలో నిర్వహిస్తున్న పరీక్షలను అవగతం చేసుకోవాలి.
ఎంసీక్యూలకు సంసిద్ధంగా
సీబీఎస్‌ఈ పరీక్షలో ఎంసీక్యూ(బహుళైచ్ఛిక ప్రశ్నలు)లు కూడా అడుగుతారు. వీటికి సమాధానం ఇచ్చేందుకు కూడా ఇప్పటి నుంచే సన్నద్ధత పొందాలి. ఒక ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో సరైన ఆప్షన్ గుర్తించేందుకు.. సదరు ఆప్షన్ వెంటనే స్ఫురించేలా ప్రిపరేషన్ సాగించాలి. ఇందుకోసం.. ఆయా సబ్జెక్ట్‌లలో ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు, నిర్వచనాలను అవగాహన చేసుకోవాలి.
రివిజన్‌కు సమయం
ప్రిపరేషన్‌లో భాగంగా విద్యార్థులు రివిజన్‌కు సమయం కేటాయించుకోవాలి. ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు.. కనీసం రెండు వారాల ముందు నుంచి పూర్తిగా రివిజన్‌పై దృష్టి పెట్టాలి. ప్రతిరోజు అన్ని సబ్జెక్ట్‌లను రివిజన్ చేసుకునేలా సమయం కేటాయించాలి.
జేఈఈతో సమన్వయం
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులు జేఈఈ–మెయిన్‌తోపాటు వార్షిక పరీక్షలకు ఏకకాలంలో సన్నద్ధత పొందాల్సి ఉంటుంది. జేఈఈ–మెయిన్ 2025 జనవరి సెషన్ పరీక్షలను 2025 జనవరి 22 నుంచి నిర్వహించనున్నారు.
జనవరి సెషన్‌కు హాజరయ్యే 12వ తరగతి విద్యార్థులు జనవరి 10వ తేదీ నాటికి ఈ రెండు పరీక్షలకు ఉమ్మడి ప్రిపరేషన్ పూర్తచేయాలి. ఆ తర్వాత జేఈఈ–మెయిన్ పరీక్ష తేదీ వరకు ఆ పరీక్షకు సన్నద్ధం కావాలి.