YS Jagan Mohan Reddy: రూ.125కోట్లతో 452 పడకల సూపర్‌ స్పెషాలిటీ విభాగం

సాక్షి ప్రతినిధి, కడప: ‘పేదల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నాన్న రెండు అడుగులు ముందుకేస్తే, ఆయన కొడుకుగా నాలుగు అడుగులు ముందుకేస్తా... మీ బిడ్డగా నాక్కావాల్సింది మీ ప్రేమాభిమానాలు... ప్రతి ఇంట్లో ఉన్నట్లు నాన్న ఫొటో పక్కన నా ఫొటో కూడా చేరాలి’.. విపక్షనేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి.

 సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అచ్చం అలాగే పేదలకు పెన్నిధిగా మారారు. సమగ్రాభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. పుట్టిన గడ్డ వైభవోపేతానికి విశేషకృషి చేస్తున్నారు. కడప గడపలో రిమ్స్‌ వైద్య వనం అందుబాటులోకి తెచ్చారు. పుట్టినరోజు కానుకగా జాతికి అంకితం చేయనున్నారు.

దశదిశలా రిమ్స్‌ వైభవాన్ని చాటిచెప్పనున్నారు. మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జిల్లా ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించాలని తపించారు. 230 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లు వ్యయంతో ‘రిమ్స్‌’వైద్య కళాశాల, దంత వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేశారు. సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులో లేకుండాపోయాయి. ఈనేపథ్యంలో డాక్టర్‌ వైఎస్సార్‌ తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రిమ్స్‌ ప్రాంగణంలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల, కేన్సర్‌ హాస్పిటల్‌, మానసిక వైద్యశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

చదవండి: Foreign Education: విదేశీ విద్యా దీవెనతో పేద విద్యార్థులకు ఉన్నత చదువులు

రూ.272.81కోట్లతో మూడు ప్రత్యేక విభాగాల వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చారు. ఏపీఎంఎస్‌ఐడీసీ (ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌) ద్వారా రూ.125కోట్లతో 452 పడకల సూపర్‌ స్పెషాలిటీ విభాగం, రూ.40.81 కోట్లతో 100 పడకల మానసిక వైద్యశాల, మరో రూ.107 కోట్లతో 100 పడకల కేన్సర్‌ హాస్పిటల్‌ నిర్మించారు.

కార్డియాలజీ, పీడియాట్రిక్‌, న్యూరాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ లాంటి సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు ఇకపై కడప గడపలో రిమ్స్‌ వైద్య వనంలో అందనున్నాయి. దీంతోపాటు వంద పడకల కేన్సర్‌ హాస్పిటల్‌, వంద పడకల మానసిక వైద్యశాల అందుబాటులోకి రావడంతో జిల్లా వాసులకు ఎంతో ఉపశమనం దక్కనున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు.

సీఎం బర్త్‌డే కానుకగా....

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బర్త్‌డే కానుకగా జిల్లా ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలను అందుబాటులోకి తెస్తున్నారు. కడప పురవీధులు, 12 సర్కిళ్లల్లో రూపురేఖలు మారుస్తున్నారు. రూ.120కోట్ల వ్యయంతో సుందర కడపగా తీర్చిదిద్దారు. బుగ్గవంక ప్రొటెక్షన్‌వాల్‌కు ఇరువైపులా రహదారులు సిద్ధం అవుతున్నాయి. ఇవన్నీ జాతికి అంకితం అయిన తర్వాత నగరవాసులకు ఎంతో ఉపశమనం దక్కనుంది.

ఆదరించి అక్కున చేర్చుకున్న జిల్లా వాసుల మదిలో చిరస్థాయిగా నిల్చేందుకు ప్రణాళికలు చేపట్టిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సక్సెస్‌ అయ్యారని పలువురు కొనియాడుతున్నారు. కాగా గురువారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు.

#Tags